Jonny Bairstow and R Ashwin News: ధర్మశాల(Dharamshala) వేదికగా మార్చి 7 నుంచి 11 వరకు అయిదో టెస్ట్‌ జరగనుంది. ఇప్పటికే టెస్ట్‌ సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా(Team India).. ఈ టెస్ట్‌లోనూ గెలిచి వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌(WTC) పాయింట్లు పెంచుకోవాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని బ్రిటీష్‌ (England) జట్టు చూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌ ద్వారా ఇద్దరు ఆటగాళ్లు అరుదైన రికార్డు సృష్టించనున్నారు. టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు ర‌విచంద్రన్ అశ్విన్‌, ఇంగ్లాండ్ బ్యాట‌ర్ జానీ బెయిర్ స్టోలకు ఈ మ్యాచ్  ప్రతిష్టాత్మకంగా నిల‌వ‌నుంది. అశ్విన్‌, జానీ బెయిర్ స్టోలు త‌మ కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరు ఎలా రాణిస్తారు అన్న అంశంపై ఆస‌క్తి నెల‌కొంది. ఈ మ్యాచ్ ఎవ‌రికి తీపి గుర్తుగా మిగ‌ల‌నుందో మ‌రికొద్ది రోజుల్లో తేల‌నుంది. ఒక టెస్టులో ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు వందో మ్యాచ్‌లు ఆడుతుండటం 147 ఏండ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇది మూడోసారి మాత్రమే. 


చరిత్రలో రెండుసార్లే 
2006లో న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించింది. ఈ సిరీస్‌లో భాగంగా కివీస్‌ దిగ్గజం స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ , దక్షిణాఫ్రికా లెజెండరీ పేసర్‌ షాన్‌ పొలాక్‌ కలిసి వందో టెస్టు ఆడారు. 2013లో ఇంగ్లండ్‌ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా అలెస్టర్‌ కుక్‌, మైఖెల్‌ క్లార్క్‌ కలిసి వందో టెస్టు ఆడారు. ఇప్పుడు తాజాగా అశ్విన్‌ – బెయిర్‌ స్టోలు ఆడనుండటం మూడోసారి ఆడనున్నారు. ఈ సిరీస్‌లో అశ్విన్‌ ఎప్పటిలాగే వికెట్ల వేట కొనసాగిస్తుండగా బెయిర్‌ స్టో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. 


గవాస్కర్‌ సంచలన వ్యాఖ్యలు
రాంచీ(Ranchi) వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో విజయంతో ఇంగ్లాండ్‌(England)తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ గెలుపుతో రోహిత్‌ సేన మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ కైవసం చేసుకుంది. యువ క్రికెటర్లు తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఆనందంగా ఉందని టీమిండియా సారధి రోహిత్‌ శర్మ అన్నాడు. సీనియర్లు మళ్లీ జట్టులోకి వచ్చినా ఒత్తిడికి గురికాకుండా నిర్ణయం తీసుకుంటామని హిట్‌ మ్యాన్‌ స్పష్టం చేశాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని టీమిండియా దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ కూడా అన్నాడు. బజ్‌బాల్‌తో టెస్ట్‌ క్రికెట్‌ను శాసిస్తున్న ఇంగ్లాండ్‌పై టెస్ట్‌ సిరీస్‌ విజయం తప్పకుండా కొందరికి హెచ్చరిక అని గవాస్కర్‌ పేర్కొన్నాడు. తాము లేకపోతే భారత్ గెలవలేదని అనుకొనే వారికి ఇదొక బలమైన సందేశమని వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌లు గెలిచేందుకు కేవలం పెద్ద స్టార్లు అవసరం లేదని కూడా అన్నాడు. ఇకనుంచి ఎవరైనా ‘స్టార్లు’ తాము లేకపోతే భారత్‌ గెలవడం కష్టమని భావించే వారికి ఈ సిరీస్‌ విజయం ఓ హెచ్చరిక అని గవాస్కర్‌ తెలిపాడు. క్రికెట్ అనేది జట్టుగా పోరాడేదని... కేవలం ఒకరిద్దరి మీదనే ఆధారపడి ఉండదని తేల్చి చెప్పాడు.