New Captain For Sunrisers Hyderabad: ఐపీఎల్ సీజన్ మరికొన్ని రోజల్లో ప్రారభం కాబోతోంది. ఈ సీజన్ కోసం మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగబోతోంది. సన్ రైజర్స్ కొత్త కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ వ్యవహరించబోతున్నట్టు ఫ్రాంచైజీ అఫీషియల్ గా ప్రకటించింది. గత సీజన్ లో ఎయిడెన్ మార్ క్రమ్ జట్టును నడిపించగా, ఇప్పుడు తనను కమిన్స్ రీప్లేస్ చేయబోతున్నాడు. ప్యాట్ కమిన్స్ గురించి తెలిసిందేగా. ఆస్ట్రేలియా ప్రపంచకప్ విన్నింగ్ జట్టుకు కెప్టెన్. ప్రపంచకప్ పూర్తయ్యాక జరిగిన వేలంలో ప్యాట్ కమిన్స్ ను 20 కోట్ల 50 లక్షల భారీ ధరకు సన్ రైజర్స్ దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే


ఇది రెండో అత్యధిక ధర. వన్డే ప్రపంచకప్ అందించడం, ఇంత భారీ ధర దక్కించుకోవడం... ఇవన్నీ చూశాక క్రికెటింగ్ ప్రపంచం అంతా కమిన్స్ కెప్టెన్ అవడం ఖాయమని ఫిక్స్ అయిపోయింది. ఇన్నాళ్లూ సస్పెన్స్ మెయింటైన్ చేసిన ఫ్రాంచైజీ... ఇవాళ ఈ ప్రకటనను అఫీషియల్ చేసేసింది. అయితే ఈ ప్రకటన కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మార్ క్రమ్ కెప్టెన్సీలో జట్టు అంతగా పర్ఫార్మ్ చేయలేదన్నది నిజమే. కానీ దానికి తనను ఒక్కడ్నే బాధ్యుడ్ని చేశారా అన్న థాట్ ఓవైపు వస్తోంది. దానికి  తోడు... సౌతాఫ్రికా 20 లీగ్ లో మార్ క్రమ్ విజయవంతమైన కెప్టెన్. అక్కడ ఇదే సన్ రైజర్స్ కు చెందిన ఈస్టర్న్ కేప్ ఫ్రాంచైజీకి వరుసగా రెండు టైటిల్స్ అందించాడు. అంటే కచ్చితంగా కెప్టెన్సీ మెటీరియలే. అంత తేలిగ్గా తీసేయకుండా ఈ ఏడాది కూడా అవకాశం ఇచ్చి ఉండాల్సిందని కొందరి అభిప్రాయం.






ఇప్పుడు జట్టు స్వరూపం కూడా మారింది  కాబట్టి మరింత మెరుగైన ఫలితాలను రాబట్టేవాడేమో అని ఐపీఎల్ ఫ్యాన్స్ కొందరు చర్చించుకుంటున్నారు. సరే మార్ క్రమ్ విషయం పక్కన పెడితే ఇప్పుడు దృష్టంతా ప్యాట్ కమిన్స్  పైనే. వరల్డ్ కప్ అందించాడు. అలాగే టెస్టుల్లో కూడా విజయవంతమైన కెప్టెన్. మరి ఆ రేంజ్ సక్సెస్ ను ఐపీఎల్ కెప్టెన్ గా రెప్లికేట్ చేయగలడా లేదా.. మార్చ్ 22 నుంచి మొదలై రెండు నెలల్లోగా మనకో క్లారిటీ వచ్చేస్తుంది.