Pat Cummins To Captain Sunrisers Hyderabad In IPL 2024:ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League) షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 22న ఐపీఎల్‌ మహా సమరం ప్రారంభం కానుంది. దేశంలోనే పూర్తిగా ఐపీఎల్‌ నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 17వ ఎడిషన్ మొదటి 15 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు జరిగే మ్యాచ్‌లను తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్‌... రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది. ధోనీ, కోహ్లీ మధ్య జరిగే ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్‌ ప్రారంభంకానున్న వేళ సన్‌రైజర్స్‌ నూతన సారధిని నియమించనుందన్న వార్తలు వస్తున్నాయి.


కమిన్స్‌కే సారధ్య బాధ్యతలు!
ఐపీఎల్‌-2024 సీజన్‌ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వేలంలో రూ.20.50 కోట్టు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన ఆసీస్‌ స్టార్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌(Pat Cummins)కు తమ సన్‌రైజర్స్‌ పగ్గాలు అప్పజెప్పాలని  నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న ఐడైన్‌ మార్‌క్రమ్‌ను తప్పించేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఒకట్రెండు రోజుల్లో ఆరెంజ్‌ ఆర్మీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. కెప్టెన్‌గా కమ్మిన్స్‌కు ఉన్న అనుభవం దృష్ట్యా.. ఎస్‌ఆర్‌హెచ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా పునఃవైభ‌వానికి క‌మిన్స్ నాంది ప‌లికాడు. 2022లో టెస్టు సార‌థిగా ఎంపికైన అత‌డు ఆస్ట్రేలియా జట్టుకు నిరుడు ప్రపంచ టెస్టు చాంపియ‌న్‌షిప్‌తో పాటు వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌  Cup)ట్రోఫీని అందించాడు.  మార్‌క్రమ్‌ సైతం దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో వరుసగా రెండు సార్లు ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌ను ఛాంపియన్స్‌గా నిలిపాడు. 


గెట్‌ రెడీ ఆరెంజ్‌ ఆర్మీ
తొలి మ్యాచ్‌లో ఆరెంజ్‌ ఆర్మీ.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(Kolkata Knight Riders)తో తలపడనుంది. హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ షెడ్యూల్‌లో సన్‌రైజర్స్‌ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. మార్చి 27న ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌.. ఐదుసార్లు ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఢీకొననుంది. 15 రోజులు ప్రకటించిన తొలి షెడ్యూల్‌లో హైదరాబాద్ నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మార్చి 23న కేకేఆర్‌తో తొలి మ్యాచ్‌ ఆడే సన్‌ రైజర్స్‌.. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. రెండు మ్యాచ్‌లు సొంత గ్రౌండ్‌లో ఆడనున్న హైదరాబాద్‌.. మిగతా రెండింటినీ కోల్‌కతా, అహ్మదాబాద్‌లో ఆడాల్సి ఉంది. మార్చి 23వ తేదీన కోల్‌కతా వర్సెస్‌ హైదరాబాద్ – కోల్‌కతా... మార్చి 27వ తేదీన హైదరాబాద్‌ వర్సెస్‌ ముంబై మార్చి 31న గుజరాత్‌ వర్సెస్‌ హైదరాబాద్‌ – అహ్మదాబాద్‌ … ఏప్రిల్‌ 5న హైదరాబాద్‌ వర్సెస్‌ చెన్నై మ్యాచ్‌లు జరగనున్నాయి.