టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ని బీసీసిఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌నుంచి తప్పించడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రేయస్ జట్టు కోసం ఆడే ఆటగాడు అని... మిడిలార్డర్‌లో కీలక సభ్యుడు అని, జట్టును ఎన్నో సందర్భాల్లో ఆదుకొన్న ఆటగాడు అనీ.. ఇలాంటి ప్లేయర్ ని కనీస గౌరవం ఇచ్చి, బీసీసిఐ కాంట్రాక్ట్‌లోకి తీసుకోకపోవడాన్ని తప్పుపడుతున్నారు.
శ్రేయస్ అయ్యర్ ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌నుంచి గాయం కారణంగా తప్పుకొన్నాడు, అయితే అతన్ని రంజీ మ్యాచ్ లు ఆడాలని బీసీసిఐ ఆదేశించింది. వెన్నునొప్పి కారణంగా సాధ్యం కాదని చెప్పాడు. కొంతకాలం నుంచి శ్రేయస్ వెన్నునొప్పితోనే ఆడుతున్నాడు. అయితే ఈ సారి ఐపీయల్, టీ-20 ప్రపంచకప్ కి ఎక్కువ సమయం లేకపోవడం, వరుసగా మ్యాచ్ లు ఆడుతున్న నేపథ్యంలో రంజీలు ఆడలేను అని చెప్పాడు. అయినా వినని బీసీసిఐ అతన్నిసెంట్రల్ కాంట్రాక్ట్‌లోకి తీసుకోలేదు.
అయితే శ్రేయస్ అయ్యర్ 2023 ప్రపంచ కప్ లో ఆడటంకోసమే ఆ సంవత్సరం ఐపీయల్ వదులుకొన్నాడు. ప్రపంచ కప్ సమయంలో కూడా నొప్పి లేకుండా ఉండటానికి 3 కార్టిసోన్ ఇంజెక్షన్లు తీసుకున్నాడు. సెమీస్ & ఫైనల్స్ సమయంలో నొప్పి ఇబ్బంది పెట్టినా అప్పటికే హార్ధిక్ పాండ్యా దూరమై టీం మిడిలార్డర్ బలహీనపడ్డ నేపథ్యంలో నొప్పి భరిస్తూనే జట్టుకోసం ఆడాడు. తర్వాత T20I సిరీస్, దక్షిణాఫ్రికా సిరీస్, ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్‌లో కూడా ఆడాడని ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు.
అంతేకాకుండా వన్డేల్లో 50 సగటుతో, టీ20ల్లో 30కి పైగా సగటుతో బ్యాటింగ్ చేప్తోన్న శ్రేయస్ ని ఇలా చిన్నకారణంతో పక్కకు పెట్టబడం సరికాదనే చర్చ సాగుతోంది. ఈ సారి కరేబియన్ దీవుల్లో టీ-20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో మిడిలార్డర్ లో అనుభవం ఉన్న శ్రేయస్ ఉండాల్సిందే అని ఫ్యాన్స్ అంటున్నారు. లాగే ఫామ్ పరంగా చూసినా, ఫిట్‌నెస్ పరంగా చూసినా శ్రేయస్ ఎప్పుడూ ముందుంటాడు. జట్టుకోసం ఆలోచించే శ్రేయస్ గురించి బీసీసిఐ పునరాలోచన చేయాల్సిందే అంటున్నారు. సీనియర్లు రోహిత్,విరాట్,రాహుల్ తర్వాత బ్యాటింగ్ భారాన్ని మోసే శ్రేయస్‌ని ఇలా అవమానించడం బాధాకరం అంటున్నారు.
ఒక్క రంజీమ్యాచ్ కోసం అంతర్జాతీయ క్రికెటర్ అయిన శ్రేయస్ పై ఇలాంటి చర్య తీసుకోవడం పట్ల ఫ్యాన్స్ మాత్రమే కాదు క్రికెట్ విశ్లేషకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ భవిష్యత్తు ఏంటి అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ మళ్ళీ పునరుద్ధరిస్తారా? ఐపీయల్ లో రాణించినా టీ-20 ప్రపంచకప్‌కి ఎంపిక చేస్తారా చేయరా అన్న సందేహం కలుగుతోంది.
శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కారణాలను కలిపి చూడొద్దని, ఎంతో భవిష్యత్తు ఉన్న శ్రేయస్ పట్ల నిర్ణయంపై మళ్లీ ఆలోచించాల్సిందిగా ఫ్యాన్స్ విజ్ణప్తి చేస్తున్నారు. అసలు ఎంతమంది సీనియర్ క్రికెటర్లు రంజీలు ఆడుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. ఏది ఏమైనా కీలక ఆటగాడి పట్ల ఇంత నిర్దయగా వ్యవహరించడం అతడి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని, కమిట్మెంట్ ఉన్న ఆటగాడి పట్ల ఇలా వ్యవహరించడం బీసీసిఐ కి కరెక్ట్ కాదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.