Ind Vs Eng 1st Test Day 3 Live Updates:  భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్టు ఉత్కంఠ భ‌రితంగా సాగుతోంది. ఆదివారం మూడోరోజు ఆట‌ముగిసేస‌రికి ఇండియా 23.5 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల‌కు 90 ప‌రుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుక‌ని ప్ర‌స్తుతం 96 ప‌రుగుల లీడ్ లో ఉంది. ప్ర‌స్తుతం క్రీజులో ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ (75 బంతుల్లో 47 బ్యాటింగ్, 7 ఫోర్లు), కెప్టెన్ శుభ‌మాన్ గిల్ (6 బ్యాటింగ్) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో భార‌త్ 471 ప‌రుగులు సాధించ‌గా, ఇంగ్లాండ్ 465 ప‌రుగుల‌కు ఆలౌటౌంది.. దీంతో ఆరు ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం ద‌క్కింది. మ్యాచ్ కు మ‌రో రెండు రోజులు ఉండ‌టంతో దాదాపు ఫ‌లితం వ‌చ్చే అవ‌కాశ‌ముంది. 

సాధికారికంగా బ్యాటింగ్..రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే భార‌త్ కు షాక్ త‌గిలింది. సెంచ‌రీతో సూప‌ర్ ఫామ్ లో ఉన్న య‌శ‌స్వి జైస్వాల్ (4) త్వ‌ర‌గా ఔట్ కావ‌డంతో నాలుగో ఓవ‌ర్ ఫ‌స్ట్ బాల్ కే భార‌త్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ క్ర‌మంలో రాహుల్, సాయి సుద‌ర్శ‌న్ (30) సూప‌ర్బ్ గా ఆడారు. వీరిద్ద‌రూ ఇంగ్లీష్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొన్నారు. నిజానికి తొలి ఇన్నింగ్స్ మాదిరిగానే లెగ్ సైడ్ ట్రాప్ పెట్టి, సుద‌ర్శ‌న్ ను ఔట్ చేయాల‌ని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టొక్స్ ప్ర‌య‌త్నించినా కాసేపు దాన్ని నిర్వీర్యం చేశాడు. అలాగే రాహుల్-సుద‌ర్శ‌న్ జోడీ వేగంగా ప‌రుగులు సాధిస్తూ రెండో వికెట్ కు 66 ప‌రుగులు జోడించారు. అయితే ఎట్ట‌కేల‌కు వ్యూహం మార్చి, లెగ్ సైడ్ పై బంతిని వేసి, సుద‌ర్శ‌న్ ను స్టోక్స్ ఔట్ చేశాడు. 

రాహుల్ క్లాస్..మంచి ఆట‌తీరుతో ఫ‌స్ట్ ఇన్నింగ్స్ లో ఫిఫ్టీని మిస్ చేసుకున్న రాహుల్.. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. త‌న‌ను ఇంగ్లీష్ బౌల‌ర్లు ఎలాంటి ఇబ్బందుల‌కు గురి చేయ‌లేక‌పోయారు. ఏడు చూడ‌చ‌క్క‌ని, సొగ‌స‌రి బౌండ‌రీలు బాది త‌న క్లాస్ ని చూపించాడు. సుద‌ర్శ‌న్ ఔట‌య్యాక కెప్టెన్ గిల్ క్రీజులోకి వ‌చ్చి, తొలి బంతినే బౌండ‌రీకి త‌ర‌లించాడు. వీరిద్ద‌రూ కాసేపు ఆడిన త‌ర్వాత వ‌ర్షం ప‌డ‌టంతో మ్యాచ్ ను నిర్ణీత స‌మ‌యానికి ముందే ముగించారు. అంత‌కుముందు స్టార్ పేస‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రా స‌త్తా చాటడంతో ఓవ‌ర్ నైట్ స్కోరు 209/3 తో మూడోరోజు ఆట‌ను కొన‌సాగించిన ఇంగ్లాండ్ 465 ప‌రుగుల‌కు ఆలౌటైంది. మూడో రోజు హేరీ బ్రూక్ (99) వేగంగా ఆడి, త్రుటిలో సెంచ‌రీని మిస్ చేసుకున్నాడు. మిగ‌తా బౌల‌ర్ల‌లో ప్ర‌సిధ్ కృష్ణ‌కి 3, మ‌హ్మ‌ద్ సిరాజ్ కు రెండు వికెట్లు ద‌క్కాయి.