IND vs BAN, Rohit Sharma Injured:


బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో టీమ్‌ఇండియాకు షాక్‌! కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయపడ్డాడు. ఫీల్డింగ్‌ చేస్తుండగా అతడి చేతికి గాయమైంది. నొప్పి ఎక్కువగా ఉండటంతో బీసీసీఐ వైద్య బృందం అతడిని ఆస్పత్రికి పంపించింది. స్కానింగ్‌ రిపోర్టులు తీసుకుంటోంది.


మూడు వన్డేల సిరీస్‌లో నేడు రెండో మ్యాచ్‌ జరుగుతోంది. మీర్పూర్‌ వేదికగా రెండు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. టాస్‌ ఓడిన టీమ్‌ఇండియా మొదట బౌలింగ్‌కు దిగింది. రెండో ఓవర్‌ను మహ్మద్‌ సిరాజ్ విసిరాడు. తొలి రెండు బంతుల్ని అనుముల్‌ హక్‌ బౌండరీలుగా మలిచాడు. నాలుగో బంతి అతడి బ్యాటు అంచుకు తగిలి స్లిప్‌లో వెళ్లింది. ఆ క్యాచ్‌ అందుకొనే క్రమంలోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయపడ్డాడు.






సిరాజ్‌ ఆఫ్‌ సైడ్‌ ఆఫ్ స్టంప్‌లో వేసిన బంతిని అనుముల్‌ ఆడాడు. ఫ్రంట్‌ ఫుట్‌తో కమిట్‌ అవ్వకుండానే బ్యాటు అడ్డు పెట్టాడు. స్లిప్‌లోకి వెళ్లిన బంతిని రోహిత్‌ క్యాచ్‌ అందుకొనేందుకు ప్రయత్నించాడు. నేలపై పడిన బంతి అతడి ఎడమచేతి బొటన వేలిపై బలంగా తాకింది. రక్తం కారింది. కాస్త వాపు కనిపించింది. బంతి తగలగానే హిట్‌మ్యాన్‌ నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే మైదానం వీడాడు. అతడి స్థానంలో రజత్‌ పాటిదార్ ఫీల్డింగ్‌కు వచ్చాడు.






గాయపడ్డ రోహిత్‌ను బీసీసీఐ వైద్య బృందం పరీక్షించింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వేలి ఎముకలో చేలిక ఏమైనా వచ్చిందేమోనని అతడిని ఆస్పత్రికి పంపించారు. స్కానింగ్‌ చేయిస్తున్నారు. నొప్పి తగ్గితే రోహిత్‌ తిరిగి బ్యాటింగ్‌కు రావొచ్చు. లేదంటే టీమ్‌ఇండియా పది మంది బ్యాటర్లతోనే బంగ్లా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తుంది. వైస్‌ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ కీపింగ్‌తో పాటు నాయకత్వ బాధ్యతలు చూసుకుంటున్నాడు.


మ్యాచులో టీమ్‌ఇండియా ఆధిపత్యం చలాయిస్తోంది. 15 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాను 63-3కు నిలువరించింది. షకిబ్‌ అల్‌ హసన్‌ (6), ముష్ఫికర్‌ రహీమ్‌ (10) బ్యాటింగ్ చేస్తున్నారు. పిచ్‌ మందకొడిగా ఉండటంతో బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నారు. మహ్మద్‌ సిరాజ్‌ 2, ఉమ్రాన్‌ మాలిక్ ఒక వికెట్‌ పడగొట్టారు. ప్రత్యర్థిని సాధ్యమైనంత తక్కువ స్కోరుకు కట్టడి చేయాలని భారత్‌ పట్టుదలగా ఉంది.


Also Read: అనుకున్నదే! ఆర్బీఐ రెపోరేటు మరో 35 బేసిస్‌ పాయింట్లు పెంపు - 6.25 శాతానికి వడ్డీరేటు


Also Read: ప్రి క్వార్టర్స్‌లోరిజర్వు బెంచీపై రొనాల్డొ - అవమానామా? వ్యూహాత్మకమా?