FIFA WC 2022 Qatar:


బండ్లు ఓడలు... ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో! అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో నంబర్‌వన్‌ ఆటగాడు ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు క్రిస్టియానో రొనాల్డొ! ప్రపంచంలోనే అత్యధిక గోల్స్‌ నమోదు చేసిన దిగ్గజం. అతడు మైదానంలో ఉంటేనే ప్రత్యర్థుల బలం సగానికి తగ్గిపోతుంది. అలాంటి ఆటగాడు తమ జట్టులో ఉండాలనే ఎవరైనా కోరుకుంటారు. అలాంటిది ఫిఫా ప్రపంచకప్‌ ప్రిక్వార్టర్లో అతడిని రిజర్వు బెంచీపై కూర్చోబెట్టింది పోర్చుగల్‌.


బెంచ్‌పై రొనాల్డొ


ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్‌ మంగళవారం రాత్రి స్విట్జర్లాండ్‌తో ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌ ఆడింది. నాకౌట్‌ మ్యాచ్‌ కావడంతో ఇందులో ఓడిపోతే ఇంటికే! సాధారణంగా నాకౌట్‌ మ్యాచుల్లో అత్యుత్తమ ఆటగాళ్లను ఆడించాలని ఏ జట్టైనా కోరుకుంటుంది. పోర్చుగల్‌ జట్టేమో విచిత్రంగా క్రిస్టియానో రొనాల్డొను బెంచీపై కూర్చోబెట్టింది. తుది పదకొండు మందిలోకి పంపించనే లేదు. ఈ విషయం తెలియడంతో అతడి అభిమానులు హల్‌చల్‌ చేశారు. సోషల్‌ మీడియాలో రచ్చరచ్చ చేశారు. కాగా అతడిని మ్యాచ్‌లో ఆడించకపోవడం వ్యూహత్మకమేనని పోర్చుగల్‌ మేనేజర్‌ శాంటోస్‌ అంటున్నాడు.


వ్యూహాత్మకమేనన్న మేనేజర్‌


స్విట్జర్లాండ్‌ మ్యాచులో రొనాల్డొను బెంచీపై కూర్చోబెట్టడం వ్యూహాత్మకమేనని ఫెర్నాండో శాంటోస్‌ అన్నాడు. అంతకు మించి మరేం లేదన్నాడు. దక్షిణ కొరియా మ్యాచులో సస్పెండ్‌ అయినప్పుడు రొనాల్డొ ప్రతిస్పందన తనకు అసంతృప్తి కలిగించిన మాట వాస్తవమేనని పేర్కొన్నాడు. ఈ మ్యాచులో ఆడించకపోవడానికి అది మాత్రం కారణం కాదని వెల్లడించాడు. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడన్న సంగతి అందరికీ తెలుసన్నాడు. ఏ నిర్ణయమైనా సరే జట్టు కోణంలోనే తీసుకుంటామని పేర్కొన్నాడు.


అనుబంధం గొప్పది!


రొనాల్డొను మ్యాచులో ఆడించకపోవడం తన కెరీర్లో తీసుకున్న కఠిన నిర్ణయమా అన్ని ప్రశ్నించగా 'రొనాల్డొతో నాది సన్నిహిత సంబంధం. ఎప్పటికీ అదలాగే ఉంటుంది. 19 ఏళ్ల కుర్రాడి నుంచి అతడిని చూస్తూనే ఉన్నాను. ఇన్నేళ్లుగా అతడు జాతీయ జట్టులో ఉన్నాడు. కోచ్‌, ఆటగాడి రిలేషన్‌షిప్‌లోకి మేమిద్దరం వ్యక్తిగత, మానవ అనుబంధాల అంశాన్ని తీసుకురాం. ఎప్పుడూ గందరగోళానికి గురవ్వం. క్వార్టర్‌ ఫైనల్లో మొరాకోతో కఠిన పోటీ ఉంటుంది. కానీ మా జట్టు మంచి ఫామ్‌లో ఉంది' అని శాంటోస్‌ అన్నాడు. ఇలాగే మెరుగ్గా ఆడితే తమకు కచ్చితంగా అవకాశం ఉంటుందన్నాడు.


అదరగొట్టిన పోర్చుగల్‌


FIFA WC 2022 Qatar:  కీలక పోరులో పోర్చుగల్ జట్టు విజృంభించింది. స్విట్జర్లాండ్ తో మ్యాచులో గోల్స్ మోత మోగించింది. దూకుడైన ఆటతో స్విస్ జట్టును 6-1 తేడాతో మట్టికరిపించింది. ఈ విజయంతో క్వార్టర్స్ కు దూసుకెళ్లింది. 


బంతి ఎక్కువ సేపు తమ నియంత్రణలోనే ఉన్నప్పటికీ స్విస్‌ జట్టు 6-1 తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్‌ ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. అందివచ్చిన అవకాశాలు ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా రెండో అర్ధభాగంలో చెలరేగారు. తొలి అర్ధభాగంలో ఒక గోల్‌ చేసిన రామోస్‌ రెండో అర్ధభాగంలో మరింతగా రాణించి రెండు గోల్స్‌ చేశాడు. 


రామోస్ త్రిబుల్


మ్యాచ్‌ ప్రారంభమైన 17 నిమిషాల వద్ద జావో ఫెలిక్స్‌ నుంచి పాస్‌ అందుకున్న రామోస్‌ బంతిని గోల్‌పోస్టులోకి నెట్టడంతో పోర్చుగల్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 33 నిమిషాల వద్ద బ్రూనో ఫెర్నాండెస్‌ నుంచి పాస్‌ అందుకున్న పీప్‌ తలతో కళ్లుచెదిరే రీతిలో గోల్‌ కొట్టాడు. దీంతో 2-0 తేడాతో పోర్చుగల్‌ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 


ఇక రెండో అర్ధభాగంలో 51 నిమిషాల వద్ద రామోస్‌ మరో గోల్‌ కొట్టి 3-0 తేడాతో తన జట్టును మరింత ఆధిక్యంలో తీసుకెళ్లాడు. కాసేపటికే 55 నిమిషాల వద్ద రామోస్‌ నుంచి పాస్‌ అందుకున్న రాఫేల్‌ గెరీరో గోల్‌ చేయడంతో పోర్చుగల్‌ 4-0 లీడ్‌లోకి వెళ్లింది. అయితే 58 నిమిషాల వద్ద స్విట్జర్లాండ్‌ ఆటగాడు మాన్యువల్‌ అకంజీ గోల్‌ చేయడంతో స్విస్‌ జట్టు ఖాతా తెరిచింది. ఇక 67 నిమిషంలో మరోసారి రామోస్‌, మ్యాచ్‌ అదనపు సమయంలో రాఫేల్‌ లియో గోల్‌ చేశారు. ఈ  ఆటలో స్విస్‌ ఆటగాళ్లు ఏ మాత్రం దూకుడు ప్రదర్శించలేకపోయారు. పోర్చుగల్‌ కంటే ఎక్కువ పాస్‌లు అందుకున్నప్పటికీ స్విట్జర్లాండ్‌ ఆటగాళ్లు గోల్స్‌ చేయడంలో విఫలమయ్యారు.