FIFA WC 2022 Qatar: కీలక పోరులో పోర్చుగల్ జట్టు విజృంభించింది. స్విట్జర్లాండ్ తో మ్యాచులో గోల్స్ మోత మోగించింది. దూకుడైన ఆటతో స్విస్ జట్టును 6-1 తేడాతో మట్టికరిపించింది. ఈ విజయంతో క్వార్టర్స్ కు దూసుకెళ్లింది.
బంతి ఎక్కువ సేపు తమ నియంత్రణలోనే ఉన్నప్పటికీ స్విస్ జట్టు 6-1 తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. అందివచ్చిన అవకాశాలు ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా రెండో అర్ధభాగంలో చెలరేగారు. తొలి అర్ధభాగంలో ఒక గోల్ చేసిన రామోస్ రెండో అర్ధభాగంలో మరింతగా రాణించి రెండు గోల్స్ చేశాడు.
రామోస్ త్రిబుల్
మ్యాచ్ ప్రారంభమైన 17 నిమిషాల వద్ద జావో ఫెలిక్స్ నుంచి పాస్ అందుకున్న రామోస్ బంతిని గోల్‌పోస్టులోకి నెట్టడంతో పోర్చుగల్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 33 నిమిషాల వద్ద బ్రూనో ఫెర్నాండెస్ నుంచి పాస్ అందుకున్న పీప్ తలతో కళ్లుచెదిరే రీతిలో గోల్ కొట్టాడు. దీంతో 2-0 తేడాతో పోర్చుగల్ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఇక రెండో అర్ధభాగంలో 51 నిమిషాల వద్ద రామోస్ మరో గోల్ కొట్టి 3-0 తేడాతో తన జట్టును మరింత ఆధిక్యంలో తీసుకెళ్లాడు. కాసేపటికే 55 నిమిషాల వద్ద రామోస్ నుంచి పాస్ అందుకున్న రాఫేల్ గెరీరో గోల్ చేయడంతో పోర్చుగల్ 4-0 లీడ్‌లోకి వెళ్లింది. అయితే 58 నిమిషాల వద్ద స్విట్జర్లాండ్ ఆటగాడు మాన్యువల్ అకంజీ గోల్ చేయడంతో స్విస్ జట్టు ఖాతా తెరిచింది. ఇక 67 నిమిషంలో మరోసారి రామోస్, మ్యాచ్ అదనపు సమయంలో రాఫేల్ లియో గోల్ చేశారు. ఈ ఆటలో స్విస్ ఆటగాళ్లు ఏ మాత్రం దూకుడు ప్రదర్శించలేకపోయారు. పోర్చుగల్ కంటే ఎక్కువ పాస్‌లు అందుకున్నప్పటికీ స్విట్జర్లాండ్ ఆటగాళ్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యారు.
స్పెయిన్ ను ఓడించి క్వార్టర్స్ కు చేరుకున్న మొరాకో
ఫిఫా ప్రపంచకప్ లో సంచలనాలు ఆగడం లేదు. గ్రూప్ దశలో ఆశ్చర్యకర ఫలితాలతో విస్మయపరిచిన చిన్నజట్లు... నాకౌట్ లోనూ చెలరేగుతున్నాయి. గ్రూప్ దశలో తమది గాలివాటం గెలుపు కాదని రుజువు చేస్తూ పసికూన మొరాకో జట్టు.. మాజీ ఛాంపియన్ స్పెయిన్ ను మట్టికరిపించింది. పెనాల్టీ షూటౌట్ లో 3-0 తేడాతో స్పెయిన్ ను ఓడించిన మొరాకో సగర్వంగా క్వార్టర్స్ లో అడుగుపెట్టింది.
ఫుట్ బాల్ ప్రపంచకప్ లో నాకౌట్ దశలోనూ సంచలనాలు నమోదవుతున్నాయి. స్పెయిన్ ముందు పసికూన లాంటి మొరాకో.. మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించి తొలిసారి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. కేవలం ఆరోసారి మాత్రమే ప్రపంచకప్ ఆడుతూ, ఎప్పుడో 36 ఏళ్ల కిందట ఒకసారి నాకౌట్ ఆడిన చరిత్ర ఉన్న మొరాకో.. మంగళవారం అంచనాలకు అందని ఆటతో స్పెయిన్‌కు కళ్లెం వేసింది.