ICC Champions Trophy News: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బీసీసీఐ ఇచ్చే ఆదాయంతోనే ఐసీసీ మనుగడ సాధిస్తుందని విశ్లేషకులు చెబుతుంటారు. అలాంటి బీసీసీఐతో పేచి పెట్టుకునేందుకు ఐసీసీ సిద్ధమైందని తెలుస్తోంది. అది కూడా భారతీయుడు జై షా ఐసీసీ చైర్మన్ గా ఉన్న సమయంలో జరుగబోతోందని కథనాలు వస్తున్నాయి. నిజానికి ఈ మేటర్ అధికారికం కాకపోయినప్పటికీ, బీసీసీఐ కొన్ని రకాల చర్యలకు పాల్పడితే కచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని ఐసీసీ పేర్కొన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తున్న పాకిస్థాన్ పేరును తమ కిట్లపై ప్రదర్శించేందుకు బీసీసీఐ విముఖంగా ఉందని తెలుస్తోంది. ఆతిథ్య హోదాలో ఉన్న పాక్ పేరును వాడేందుకు బోర్డు సిద్ధంగా లేదని తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతం ప్రతిష్టంభన నెలకొంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. 


ఆ కారాణాన్ని చూపుతున్న బోర్డు..
నిజానికి చాంపియన్స్ ట్రోఫీని పీసీబీ నిర్వహిస్తున్న భారత్ ఆడే మ్యాచ్ లను దుబాయ్ లో నిర్వహిస్తారు. దీని కోసం ఐసీసీ సమక్షంలో ఇరు బోర్డుల మధ్య ఒప్పందం జరిగింది. భవిష్యత్తులో భారత్ లో జరిగే ఐసీసీ టోర్నీలకు తమ జట్టును కూడా పంపబోమని పాక్ తేల్చి చెప్పింది. అయితే తాము పాక్ లో మ్యాచ్ లు ఆడటం లేదు కాబట్టి, ఆ దేశపు పేరు ధరించబోమని బోర్డు వాదనగా తెలుస్తోంది. అయితే దీనికి ఐసీసీ అంగీకరించడం లేదన్నది సమాచారం. ఇక, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని వచ్చేనెల 19 నుంచి పాక్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్ల జెర్సీలపై పాక్ పేరు ఉండాలి.


అయితే బీసీసీఐ తాజాగా విడుదల చేసిన టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు లేదని తెలుస్తోంది. దీనిపై పీసీబీ విరుచుక పడింది. బోర్డు అధికారి మాట్లాడుతూ.. క్రీడల్లోకి రాజకీయాలను తేవడం సరికాదని వ్యాఖ్యానించాడు. టోర్నీకి సంబంధించిన కొన్ని సంప్రదాయాలను కూడా బీసీసీఐ పాటించడం లేదని ఆక్షేపించాడు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇరుదేశాల అభిమానులు కామెంట్లతో చర్చను హాట్ గా మారుస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరలైంది. 


రోహిత్ ను పంపడం డౌటే..
భారత ప్రభుత్వ సూచనతో టీమిండియాను పాక్ కు పంపించేందుకు బీసీసీఐ ససేమిరా అంటోంది. బీసీసీఐ పట్టుదల కారణంగానే ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ నిర్వహణలోకి దుబాయ్ కూడా వచ్చి చేరింది. హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్న ఈ టోర్నీలో కేవలం భారత్ ఆడే మ్యాచ్ లు మాత్రమే దుబాయ్ లో జరుగుతాయి. లీగ్ మ్యాచ్ లతోపాటు నాకౌట్ చేరుకుంటే సెమీస్, ఫైనల్ మ్యాచ్ లు కూడా దుబాయ్ లోనే జరిపేందుకు పీసీబీ అంగీకరించింది.



అలాగే ఐసీసీ చాంపియన్స్ టోర్నీకి ముందు కెప్టెన్లతో జరిపే సమావేశానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మను కూడా పంపబోమని వెల్లడించింది. ఏదేనా ఐసీసీ టోర్నీ జరిగేముందు కెప్టెన్లతో మీటింగ్ నిర్వహించి, ఫొటో షూట్ తీయించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సమావేశం పాక్ లో జరుగుతుండటంతో అక్కడకి రోహిత్ ను పంపేందుకు బీసీసీఐ నో చెప్పినట్లు తెలిసింది. జెర్సీ వివాదంతోపాటు దీనిపై కూడా త్వరలోనే స్పష్టత వస్తుందని తెలుస్తుంది. 


Also Read: Cricket In Olympics: ఐఓసీ ప్రెసిడెంట్‌ను కలిసిన జై షా - బ్రిస్బేన్ ఒలింపిక్స్‌లోనూ క్రికెట్‌కు స్థానం!