Gautam Gambhir News: ఇంగ్లాండ్ తో ఐదు టీ20ల సిరీస్ బుధవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ మంగళవారం కోల్ కతాలోని కాళీ దేవి మందిరాన్ని దర్శించుకున్నాడు. శక్తిపీఠాల్లో ఒకటైన ఈ కాళీఘాట్ లోని కాళీ దేవి మందిరాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. రుద్ర తాండవం సందర్భంగా సతీ దేవీ శరీర భాగాలు పడిన చోటులో ఒకటిగా కాళీ ఘాట్ ను చెబుతారు. కుడికాలి బొటనవేలు ఈ ప్రాంతంలో పడినట్లు స్థల పురాణం చెబుతోంది. మరోవైపు ఇటీవల టెస్టుల్లో వరుస పరాజయాలతో అపఖ్యాతి పొందిన గౌతం గంభీర్.. టీ20 సిరీస్ లో భారత జట్టు మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నాడు. ఈ క్రమంలో కాళీ మాత ఆశీస్సులు పొందాలని గుడిని సందర్శించినట్లు పలువురు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. గుడిని గంభీర్ సందర్శించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అభిమానులు ఈ పోస్టుపై కామెంట్లు చేస్తూ, వైరల్ చేశారు. 






కోల్ కతాతో విడదీయరాని అనుబంధం..
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా నగరంతో గంభీర్ కు విడదీయరాని అనుబంధం ఉంది. తన ఐపీఎల్ కెరీర్లో ఎన్నో మైలురాళ్లను కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నప్పుడే సాధించాడు. 2012, 2014లో కోల్ కతాకు కెప్టెన్గా గంభీర్ ఐపీఎల్ టైటిల్ సాధించి పెట్టాడు. ఆ తర్వాత మెంటార్ గా కోల్ కతా బాధ్యతలు నిర్వర్తించిన గంభీర్.. గతేడాది కేకేఆర్ కప్పు కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. అదే సక్సెస్.. టీమిండియా హెడ్ కోచ్ వరకు తనను తీసుకొచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎదురైన వరుస పరాజయాలను తనకు ఎంతో అచ్చొచ్చిన ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మరిపించేలా విజయాలను సాధించాలని గంభీర్  కోరుకుంటున్నాడు. కొత్త సంవత్సరం టీ20 సిరీస్ విజయంతో ప్రారంభించి, బోర్డర్-గావస్కర్ ట్రోఫీ తాలుకు చేదు అనుభవాలను మరిపించేలా చేయాలని అభిమానులు కోరుతున్నారు. 


భారత్ దే పైచేయి..
టీ20ల్లో ముఖాముఖి పోరులో భారత్ దే పైచేయిగా నిలిచింది. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 24 టీ20లు జరుగగా, 13 మ్యాచ్ ల్లో టీమిండియా గెలువగా, 11 మ్యాచ్ ల్లోనే ఇంగ్లాండ్ గెలిచింది. ఆఖరుగా జరిగిన ఏడు టీ20ల్లో భారత్ ఐదింటిని గెలుపొంది తన వాడిని చూపించింది. ముఖ్యంగా గతేడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో భాగంగా సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించి సత్తా చాటింది. దీంతో 2022 టీ20 ప్రపంచకప్  సెమీఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. మరోవైపు మ్యాచ్ కు 24 గంటల ముందే ఇంగ్లాండ్ జట్టును ప్రకటించింది. స్పీడ్ స్టర్ మార్క్ వుడ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. జోఫ్రా ఆర్చర్ కూడా రంగంలోకి దిగనున్నాడు. ఇక వెటరన్ పేసర్ మహ్మద్ షమీ రాకతో భారత్ బలం మరింతగా పెరిగింది.



అర్షదీప్ సింగ్ తో కలిసి షమీ కొత్తబంతిని పంచుకోనున్నాడు. ఏదేమైనా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో బోణీ కొట్టాలని భావిస్తోంది. దీని తర్వాత వరుసగా చెన్నై, రాజకోట్, పుణే, ముంబైల్లో మ్యాచ్ లు జరుగుతాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 6నుంచి నాగపూర్ లో మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. వచ్చేనెల 19 నుంచి జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోపీకి సన్నాహకంగా ఇరుజట్లకు ఈ సిరీస్ ఉపయోగపడనుంది.  


Also Read: Cricket In Olympics: ఐఓసీ ప్రెసిడెంట్‌ను కలిసిన జై షా - బ్రిస్బేన్ ఒలింపిక్స్‌లోనూ క్రికెట్‌కు స్థానం!