ICC Vs IOC : ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను శాశ్వతంగా ప్రవేశపెట్టేలా ఐసీసీ ఛైర్మన్ జైషా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా స్విట్జర్లాండ్‌లో ఆయన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) చీఫ్ థామస్ బ్యాచ్‌తో సమావేశమయ్యారు. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్ క్రీడలు 2028లో ఇప్పటికే క్రికెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై చర్చించేందుకుగాను జై షా.. ఆయనతో సమావేశమయ్యారు. సమావేశం అర్థవంతగా జరిగిందని, అటు ఒలింపిక్స్‌లో పాల్గొనడం ద్వారా నూతన అభిమానులను పొందడం, ఇటు క్రికెట్ అభిమానుల్లో ఒలింపిక్స్‌పై క్రేజ్ తీసుకురావడంపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. జనవరి 30న స్విట్జర్లాండ్‌లోనే ఐఓసీ సెషన్ జరుగనున్న క్రమంలో థామస్ బ్యాచ్‌తో జై షా సమావేశమవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. మీటింగ్‌కు సంబంధించిన ఫొటోలను ఐసీసీ సోషల్ మీడియాలో పంచుకుంది.
128 ఏళ్ల తర్వాత...లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌ను ప్రవేశపెడుతూ 2023లో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన ఐఓసీ సెషన్లలో ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. పొట్టి ఫార్మాట్లో క్రికెట్‌ను ఈ క్రీడల్లో ప్రవేశపెడతారు. ఇందుకు సంబంధించిన కార్యచరణను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే మూడున్నరేళ్ల పాటు మరింత కట్టుదిట్టంగా పని చేసి, క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో భాగం చేయాలని ఐసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక కార్యాచరణతో ముందుకు పోతోంది. చివరిసారిగా 1900లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్‌ను ఆడారు. పారిస్‌లో ఈ ఎడిషన్ క్రీడలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ను చూసి ఐఓసీ కూడా క్రికెట్‌పై మక్కువతోనే ఉంది.
బ్రిస్బేన్ ఒలింపిక్స్‌లోనూ..లాస్ ఎంజిలిస్ తర్వాత జరిగే బ్రిస్బేన్ ఒలింపిక్స్‌లోనూ క్రికెట్‌కు స్థానం కల్పించాలని ఐసీసీ చైర్మన్ జై షా ఇప్పటికే పావులు కదుపుతున్నారు. గతనెలలో జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా ఆస్ట్రేలియాను సందర్శించిన ఆయన.. క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ తో పాటు బ్రిస్బేన్ ఒలింపిక్స్ ఆర్గనైజేషన్ కమిటీతోనూ చర్చలు జరిపారు. లాస్ ఏంజెలిస్ ఎడిషన్‌లో వచ్చే ఆదరణను బట్టి, దీనిపై నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. మరోవైపు క్రికెట్ ఆస్ట్రేలియా దేశపు జాతీయ క్రీడ కాబట్టి, ఒలింపిక్స్‌లో కొనసాగించే అంశంపై మద్ధతు లభిస్తుందని ఐసీసీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఒలింపిక్స్ లో క్రికెట్ ను ప్రవేశ పెడితే భారత్ ఖాతాలో కచ్చితంగా ఒక పతకం చేరుతుందని అభిమానులు ఆశగా చూస్తున్నారు. 2028తోపాటు మిగతా ఎడిషన్లలోనూ క్రికెట్ ను కొనసాగించడం సంప్రదాయంగా రావాలని కోరుకుంటున్నారు.