Jos Buttler: భారత్ తో బుధవారం నుంచి జరిగే టీ20 సిరీస్ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. తమ జట్టులో లోయర్ ఆర్డర్ వరకు బ్యాటింగ్ చేయగల సమర్థులున్నారని, అది తమకు అడ్వాంటేజీ అని తెలిపాడు. తొలిసారి మ్యాచ్ కు 24 గంటల ముందే ప్లేయింగ్ లెవన్ ను ఇంగ్లాండ్ ప్రకటించింది. ఈ సందర్భంగా బట్టర్ తన మనసులోని మాటలను పంచుకున్నాడు. లోయర్ ఆర్డర్లో బైడెన్ కార్స్, ఆదిల్ రషీద్, గస్ అట్కిన్సన్ లాంటి వారితో పటిష్టంగా ఉందని, గతంలో బ్యాట్ తో రాణించిన సత్తా కలిగి ఉన్నారని పేర్కొన్నాడు. వీరి వల్ల టాపార్డర్ లో ఒత్తిడి తగ్గుతుందని, తాము ఔటైనా ఇంకా బ్యాటింగ్ ఆర్డర్ మిగిలే ఉందనే ఆలోచనతో ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతామని చెప్పాడు.
సొంతగడ్డపై బలమైన జట్టు..
టీ20 ఫార్మాట్లో భారత్ చాలా బలమైన జట్టని బట్లర్ అంగీకరించాడు. సొంతగడ్డపై భారత్ తో తలపడటం అంటే సవాలేనని తెలిపాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచుకుని టీమిండియా మంచి జోరు మీదుంది. ఆ తర్వాత జరిగిన సౌతాఫ్రికా సిరీస్ లో అదర గొట్టింది. సంజూ శాంసన్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సెంచరీల మీద సెంచరీలు బాదడంతో ప్రపంచ రికార్డు స్కోర్లు నమోదయ్యాయి. ప్రొటీస్ గడ్డపై జరిగిన ఆ సిరీస్ లో ఆతిథ్య సౌతాఫ్రికా 3-1తో టీమిండియా చిత్తు చేసింది. అదే జోరును బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఐదు టీ20ల సిరీస్ లో కూడా కొనసాగించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఇప్పటివరకు టెస్టు కోచ్ గా ఉన్న బ్రెండన్ మెకల్లమ్ లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ జట్టుకు కోచ్ గా వ్యవహరించడంపై బట్లర్ ఆనందం వ్యక్తం చేశాడు. తన రాకతో తమ జట్టు మరింత ఉత్సాహంతో పని చేస్తుందని తెలిపాడు.
స్నేహ సంబంధాలు..
దాదాపు టెస్టుల్లో ఆడుతున్న ప్లేయర్లే, టీ20ల్లోనూ ఆడుతున్నారని వారితో మెకల్లమ్ కు స్నేహ సంబంధాలు ఉన్నాయని బట్లర్ తెలిపాడు. ఆటగాళ్ల శక్తి సామర్థ్యాలు బజ్ కు బాగా తెలుసని, వారికి తగిన విధంగా ఉపయోగించుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక జట్టులో టీ20 స్టార్లకు కొదువే లేదు. బట్లర్, లియామ్ లివింగ్ స్టోన్, బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ వంటి వారితో జట్టు దుర్భేధ్యంగా ఉంది.
జాకబ్ బెతెల్ చేరికతో జట్టు మరింత పటిష్టంగా మారిందని బట్లర్ పేర్కొన్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో బెతెల్ నిరూపించుకున్నాడని, భారత్ సిరీస్ కోసం తాను ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడని పేర్కొన్నాడు. 56కిపైగా సగటు, 165 స్ట్రైక్ రేట్ తో తను పరుగులు సాధించాడని గుర్తు చేశాడు. మరోవైపు మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్స్ మైదానం బ్యాటింగ్ కు స్వర్గధామం గా ఉంటుందని తెలుస్తోంది. 200కిపైగా స్కోరు అలవోకగా నమోదవుతుందని సమాచారం.