Rohit Sharma News: టెస్టులలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మకు వన్డేల్లోనూ షాక్ ఎదురయ్యే అవకాశముంది. వచ్చేనెలలో పాకిస్థాన్ లో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి సారథ్య బాధ్యతలను రోహిత్ నుంచి స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు అప్పగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే వన్డేల నుంచి కూడా త్వరలోనే 37 ఏళ్ల రోహిత్ బయటకు వెళ్లిపోవచ్చని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతమున్న పేలవ ఫామ్ నే ఆ టోర్నీలోనూ కొనసాగిస్తే, రోహిత్ అంతర్జాతీయ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశముందని తెలుస్తోంది. 


రోహిత్ పై భారం తగ్గించేందుకే..
ఇక సారథ్య బాధ్యతల మార్పు విషయంలో బీసీసీఐ తీవ్ర ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓపెనర్ గా బరిలోకి దిగే రోహిత్, భుజాలపై కెప్టెన్సీ భారం తగ్గించేందుకే ఈ నిర్ణయాన్ని బోర్డు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ రోహిత్ రాణించకపోతే అతని కష్టకాలం తప్పదు. ఇక సారథ్య బాధ్యతల కోసం యువ ప్లేయర్ శుభమాన్ గిల్ నుంచి పోటీ ఉన్నా, హార్దిక్ వైపే బోర్డు మొగ్గు చూపే అవకాశముంది. అనుభవం, ఒత్తిడి పరిస్థితులను హేండిల్ చేసే విధానాలను బట్టి, హార్దిక్ కే ఈ మెగా టోర్నీలో సారథ్యం చేసే అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. మరోవైపు టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను వయసు రిత్యా వన్డేలకు పరిగణనలోకి తీసుకునే ఉద్దేశంలో బోర్డు లేదు. దీంతో హార్దిక్ కే కెప్టెన్సీ వహించే అవకాశాలు పెరుగుతాయి.


గతంలో చాలాసార్లు టఫ్ సిట్యువేషన్లను ఫేస్ చేసిన అనుభవం ఉండటంతోనే బోర్డు ఈ నిర్ణయానికి వచ్చి ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు ఈ ట్రోపీకి ముందుగా ఇంగ్లాండ్ తో మూడు వన్గేల సిరీస్ జరుగనుంది. ప్రయోగాత్మకంగా ఈ సిరీస్ లో కూడా పాండ్యాకే పగ్గాలు అప్పగించ వచ్చని పలువురు వాదిస్తున్నారు. ఏదేమైనా ఈనెలలో వన్డే సిరీస్ కు జట్టు ప్రకటన ఉండనుండటంతో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. 


ఐదో టెస్టులో దూరం..
ఇక సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో రోహిత్ తప్పుకున్నాడు. ఈ సిరీస్ లో మూడు మ్యాచ్ లాడిన రోహిత్ కేవలం 31 పరుగులు మాత్రమే చేసి నిరాశ పర్చాడు. దీంతో కీలకమైన ఈ టెస్టుకు దూరంగా ఉంటానని టీమ్ మేనేజ్మెంట్ తో చెప్పినట్లు సమాచారం. ఇక చాంపియన్స్ ట్రోఫీ వచ్చేనెల 19 నుంచి ప్రారంభమవుతుంది. తొలిమ్యాచ్ లో న్యూజిలాండ్ తో పాక్ తలపడుతుంది. 20న బంగ్లాదేశ్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.  ఆ తర్వాత పాకిస్తాన్, న్యూజిలాండ్ లతో ఆడనుంది. ఈ నాలుగు జట్లు గ్రూప్ ఏ లో పోటిపడుతున్నాయి. 2017 లో చివరి సారిగా ఈ టోర్నీ జరగగా, ఫైనల్లో భారత్ ను ఓడించిన పాక్ విజేతగా నిలిచింది. అంతకుముందు 2013లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భారత్ చివరగా చాంపియన్స్ ట్రోపీలో విజేతగా నిలిచింది. 


Also Read: Bumrah Fires On Aussies: బుమ్రాను గెలికిన కొన్ స్టాస్ - టీమిండియా ఆటగాళ్ల సంబరాలతో బెంబేలు