Vidur niti in telugu : విదురుడు ధ‌ర్మానికి మాన‌వ‌ అవతారంగా పేరొందాడు. ఆయ‌న‌ తన జీవితమంతా ధర్మ మార్గంలో గడిపింది. పాండవులు- కౌరవులు ఇద్దరికీ ధర్మ మార్గాన్ని అనుసరించమని విదురుడు బోధించాడు. కానీ కౌరవులు విదురుడి మాట వినలేదు. ఆయన మాటలను ఎప్పుడూ ఖండించేవారు. ఆఖరి రోజుల్లో కౌరవులు విదురుడు మాట వినకుండా తప్పు చేశామని అనుకున్నారు కానీ అప్పటికే సమయం మించిపోయింది.


విదుర నీతి


కలియుగంలో కూడా విదురుడి మాటలు అంతే ముఖ్యమైనవి. విదురుడు మానవ జీవితానికి అవసరమైన ఎన్నో విషయాలను ప్రస్తావించాడు. ఆయ‌న సూత్రాలను విదుర నీతి అంటారు. అతని సూత్రాలు మహాభారతం నుంచి కలియుగం వరకు విస్తృతంగా వ్యాపించాయి. విదుర‌ నీతి ప్రకారం, ఒక వ్యక్తి ఈ విధంగా ప్రవర్తిస్తే, అతని ఆయుష్షు తగ్గిపోతుంది. ఇంతకీ కలియుగానికి అనుకూలమైన విదురుడి విధానాలు ఏమిటి.?


విదుర నీతి ప్రకారం ఈ పనులు చేయవద్దు


విదురుడు తన నీతి శాస్త్రంలో అసభ్యకరంగా మాట్లాడే వారితో వ్యవహారాలు కూడ‌ద‌ని చెప్పాడు. ఒక వ్యక్తి మరొకరితో ఎలా వ్యవహరించాలో ముందుగా ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలని చెబుతాడు. లేదంటే ఈ ర‌క‌మైన వ్య‌వ‌హార శైలితో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చ‌రించాడు. ఒక వ్యక్తి అవసరమైనంత వరకు మాట్లాడాలి. అవసరానికి మించి మాట్లాడితే ఆయుష్షు కూడా తగ్గిపోతుందని విదుర‌ నీతి చెబుతోంది.


Also Read : ఈ ఐదు మీ దిన‌చ‌ర్య‌లో భాగ‌మైతే మీ పేరు, ప్ర‌తిష్ఠ‌లకు తిరుగుండదు


కోపాన్ని అదుపులో ఉంచుకోండి


మితిమీరిన కోపంతో ఉన్నవారికి కూడా తక్కువ ఆయుష్షు ఉంటుందని విదురుడు చెబుతాడు. ఎక్కువగా కోపం తెచ్చుకునే వ్యక్తి భవిష్యత్తులో చెడు పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని హెచ్చ‌రించాడు. ఒక వ్యక్తి  కోపాన్ని గ్రంథాల్లో నరక ద్వారం అంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని, ఎప్పుడూ ఓపికగా ఉండమని విదురుడు చెబుతాడు. విపరీతమైన కోపం ఉన్నవారు నరకానికి వెళ్తారని, వారి ఆయుష్షు కూడా తగ్గిపోతుందని తెలిపాడు.


దురాశ, స్వార్థాన్ని వీడండి


దురాశ, స్వార్థం కార‌ణంగా ఒక వ్యక్తి తన జీవితాన్ని తగ్గించుకుంటాడు అని కూడా విదురుడు చెప్పాడు. అత్యాశ క‌లిగిన వారు, స్వార్థపరులు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. వారు చేసే పనికి మరొకరు బాధపడినా, విసుగు చెందినా పర్వాలేదు, త‌మ‌కు మేలు క‌లిగితే చాలని కోరుకుంటారు. అలాంటి వారి ఆయుష్షు రోజురోజుకూ తగ్గిపోతోంది. అత్యాశ క‌లిగిన‌వారు, స్వార్థపరులు ఇతరులకు హాని చేయడానికి వెనుకాడ‌రు. దీనికి మనం మహాభారత‌మే చక్కని ఉదాహరణ. ఇలాంటి భావాలు మహాభారత యుద్ధానికి  దారితీశాయి. ఈ భావోద్వేగాలు ఒక వ్యక్తి ఆయుష్షును తగ్గిస్తాయి.


ఇతరులపై అధికారం చెలాయించవద్దు


మన గురించి మనం గర్వపడటం వల్ల ప్రయోజనం లేదు. అలా కాకుండా ఎదుటివారు మన గురించి గర్వపడేలా పనులు చేయాలని విదురుడు సూచించాడు. ఎప్పటికీ పాలకుడిలా భావించ‌కూడదు.  మనల్ని మనం సేవకునిగా భావించి ఇతరులకు మేలు చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. లేకుంటే ఆయుష్షు రోజురోజుకూ తగ్గిపోతుందని విదురుడు పేర్కొన్నారు.


‘విరూపాక్ష’కూ ఓ ఆలయం ఉంది, ఆ రహస్యాన్ని బ్రిటీషర్లు కూడా తెలుసుకోలేకపోయారు - ఏమిటా వింత?


త్యాగం, అంకిత భావం ఉండాలి


విదుర నీతి ప్రకారం, ఒక వ్యక్తి త్యాగం, అంకిత భావాన్ని కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి తన గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించాలి. లేనిదానిని కోరుకునే బదులు, ఉన్నదానితో సంతోషంగా ఉండాలి. ఏమీ లేని వారి గురించి ఆలోచించండి, దేవుడు నాకు సంతోష‌క‌ర‌మైన జీవితం ఇచ్చాడ‌ని ఆనందించండి. ఇతరులను బాధపెట్టే బదులు వారిని సంతోషపెట్టాలి. ఈ భావం లేనివారు వీలైనంత త్వరగా జీవితాన్ని విడిచిపెడతారని విదుర నీతి పేర్కొంది.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.