Vidur Neeti in Telugu  : విదురుడు మహాభారతంలో కనిపించే ఒక గౌర‌వనీయ‌మైన పాత్ర‌. విదురుడి మాటలు పరమ సత్యాలు. ధృతరాష్ట్ర‌, పాండురాజు, భీష్ముడు, ద్రోణుడు, పాండవులతో సహా అందరూ ధర్మం, న్యాయం, సత్యం మార్గంలో నడుస్తున్న విదురుడి మాటలతో ఏకీభవించారు. విదురుడు దేశం, రాజు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తన నిర్ణయాలను, సూచనలను ఇచ్చేవాడు. అలా విదురుడి సూచ‌లు చాలా విలువైన‌వి. పాండురాజు, ధృతరాష్ట్రుడు, ధర్మరాజుకు ప్రధానమంత్రిగా రాజ్య‌పాల‌న‌లో సహాయం చేసిన ముఖ్యమైన వ్య‌క్తి విదురుడు. విదురుడి విధానం నేటికీ అనుస‌ర‌ణీయ‌మైన‌ది. విదురుడి విధానాలు జీవితానికి విలువనిస్తాయి. విదుర నీతి జీవితాలకు దీపం లాంటిది. విదురుడి సూచ‌న‌లు పాటిస్తే జీవితం మరింత ఉల్లాసంగా ఉంటుంది. ఇంత గొప్ప వివేకం, సత్యసంధత, న్యాయానికి పేరుగాంచిన విదురుడు జీవితంలో త‌ప్ప‌క ఆచ‌రించాల్సిన‌ కొన్ని సేవలను కూడా పేర్కొన్నాడు.

ఐదుగురికి సేవ          జీవితంలో పురోగతి, గౌరవం, ఆర్థికాభివృద్ధి కోసం అత్యంత శ్రద్ధ, అంకితభావంతో ఐదుగురికి సేవ  చేయాల‌ని విదురుడు చెప్పాడు. ఈ సేవల ద్వారా ప్రజల జీవితాలు ధన్యమవుతాయని, చుట్టుపక్కల ప్రజలు గౌరవించబడతారని మహాత్మ విదుర సందేశం. ఆ ఐదుగురు ఎవరంటే...

త‌ల్లి సేవ        జ‌న్మ ఇచ్చింది అమ్మ. భ‌గ‌వంతుడి త‌ర్వాత స్థానం తల్లిదే. అమ్మ ఆశీస్సులు లేకుండా ఏ పనీ జరగదు. ఇలా తల్లి సేవను నిర్మలమైన మనస్సుతో చేయాలి. ఆమె మనోభావాలు నొప్పించకుండా ప్రవర్తించాలని విదురుడు వెల్ల‌డించాడు.

Also Read: మీకు ఈ రెండు అలవాట్లు ఉంటే, వెంటనే మానుకోండి - లేకపోతే జీవితంలో ఎన్నటికీ విజయం దక్కదు!

తండ్రి సేవ               తల్లితో పాటూ తండ్రికి కూడా భగవంతుని స్థానం ఉంది. తల్లిదండ్రులిద్దరూ బిడ్డ‌ల‌కు ప్ర‌త్య‌క్ష దైవాలు. పిల్లల సంక్షేమం కోసం తమ‌ జీవితాన్ని అంకితం చేశారు. అదేవిధంగా, తండ్రి తన కుటుంబం కోసం కష్టపడి పనిచేస్తాడు. అలా తండ్రి ఆశీస్సులు అందరికీ శ్రీరామ‌రక్ష. అటువంటి భగవంతుని స్థానంలో ఉన్న తండ్రికి సేవ చేస్తే పుణ్యం లభిస్తుంది.

గురుసేవ         తల్లిదండ్రుల త‌ర్వాత‌ అత్యంత పవిత్రమైన స్థానంలో ఉన్న మరొక వ్యక్తి గురువు. ప్రతి ఒక్కరికి వారి జీవితానికి మార్గదర్శకత్వం అవసరం. సదా గురుసేవ చేసి వారి అనుగ్రహం పొందాలి. గురువు మార్గదర్శకత్వం లేకుండా జీవితంలో విజయం సాధించలేరు.

ఆత్మ సేవ         మన ఆత్మను ఎప్పుడూ పవిత్రంగా ఉంచుకోవాలి. చెడు ఆలోచనలు మనసులోకి రాకుండా జాగ్రత్తపడాలి. అన్నింటినీ స్వచ్ఛమైన మనస్సుతో అంగీకరించాలి. ప్రతి ఒక్కరికీ అంతర్గత శుభ్రత చాలా ముఖ్యం. అదే విధంగా శరీర ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని విదురుడు చెబుతాడు. ఈ సేవే మనిషి విజయానికి మార్గమ‌ని తెలిపాడు.

Also Read: వంశపారపర్య ఆస్తులతో పాటూ పాపాలూ వెంటే వస్తాయి, వాటినుంచి విముక్తి పొందాలంటే!

అగ్ని సేవ          ప్ర‌కృతిలో పంచభూతాలు అత్యంత‌ ముఖ్యమైనవి. అలాగే అగ్ని సేవ కూడా జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని విదురుడు చెప్పాడు. అగ్ని లేకుండా యాగ ఫలం ఉండదు.

ఈ ఐదు సేవ‌ల‌ను దిన‌చ‌ర్య‌లో భాగంగా మార్చుకుంటే జీవితం ధ‌న్య‌మ‌వుతుంద‌ని, స‌మాజంలో పేరు, ప్ర‌తిష్ఠ‌లు ల‌భిస్తాయ‌ని విదుర‌నీతిలో వెల్ల‌డించాడు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.