Virupaksha Temple: ‘విరూపాక్ష’ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లతో దూసుకెళ్తున్న సినిమా. అయితే, ‘విరూపాక్ష’ పేరుతో ఒక ఆలయం ఉందనే సంగతి మీకు తెలుసా?


కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలోని హంపిలో విరూపాక్ష దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు. దేశంలోని అత్యద్భుత నిర్మాణాల్లో ఒకటిగా భావించే విరూపాక్ష దేవాలయంలో ప‌ర‌మ‌శివుడు విరూపాక్షుడిగా దర్శనమిస్తాడు. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఆ తరువాత హోయసల రాజులు ఈ ఆలయాన్ని పోషించారు. విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా దీనికి మరింత సొబగులు దిద్దారు. అయితే, ఇక్కడ కనిపించే వింతలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలాయి. చివరికి బ్రిటీష్ పాలకులు సైతం ఇక్కడి కట్టడాల్లోని వింతల వెనుక రహస్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. మరి, ఈ ఆలయం ప్రత్యేకతలు ఏమిటో చూసేయండి.


యునెస్కో గుర్తింపు


యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందిన విరూపాక్ష ఆలయం తుంగభద్ర నది ఒడ్డున ఉంది. విరుపాక్ష స్వామి వారికి పంపాపతి అని నామము కూడా ఉంది. పూర్వం పంపానదిగా పేరొందిన‌దే ఈనాటి తుంగభద్రా నది. ఈ ఆలయంలో త్రికాల పూజలు జరుగుతాయి. కర్ణాటకలో అత్యంత పవిత్రమైన ఆలయాల్లో ఒకటిగా విరూపాక్ష ఆల‌యం పేరుగాంచింది. ఇక్క‌డ‌ 9, 10వ శతాబ్దాల‌కు చెందిన శాసనాలు ఉన్నాయి. ముఖ మంటపం లోనికి ఎక్కే మెట్ల ప్రక్కన ఒక శిలా శాసనం పురాతన తెలుగులో రెండు వైపులా చెక్కి ఉంది. 


ఎత్తైన రాజ‌గోపురం


విరూపాక్ష ఆల‌య రాజగోపురం పదకొండు అంతస్తులుగా నిర్మిత‌మైంది. ముఖమండపంపై అద్భుతమైన పెయింటింగ్స్‌ ఉన్నాయి. ఈ ఆలయంలో స్వామి ఉగ్రరూపుడు. అందువల్ల ముఖమండపం నుంచి గర్భాలయానికి దారి లేదు. అద్భుత నిర్మాణాల్లో ఇదొకటి. 


త‌ల కిందులుగా గోపురం నీడ‌


ఈ దేవాలయానికి మూడు గోపురాలు ఉన్నాయి. తూర్పు గోపురం 160 అడుగుల ఎత్తుతో, తొమ్మిది అంతస్తులుగా నిర్మిత‌మైంది. ఇది పదిహేను శతాబ్దం నాటిది. దీనిని పదహారవ శతాబ్దంలో కృష్ణదేవరాయలు పునర్నిర్మించాడు. విరూపాక్ష ఆలయం లోపల గోడ మీద 6 అంగుళాల సన్నటి చీలిక ఉంటుంది. గర్భగుడి నీడ ఆలయం వెనుక వైపుతల క్రిందులుగా పడుతుంది. సూర్యోదయం నుండి ఉదయం 9 గంటలవరకు ఈ నీడ కనిపిస్తుంది. గోపురం నీడ ఎత్తు 15 అడుగులు ఉంటుంది. గోపురం ఎత్తు కూడా 15 అడుగుల ఎత్తు ఉండడం గమనార్హం. ఇలా జరగటానికి విరూపాక్షస్వామి మహత్యమే భక్తులు నమ్ముతుంటారు. నాటి వాస్తు శిల్పుల మేధస్సుకు తార్కాణమని ఇదొక అద్భుత దృశ్యంగా చెప్పవచ్చు. 


సంగీత స్తంభాలు


ఇక్కడే ఉన్న‌ విఠలాలయం శిల్పకళా రీత్యా అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. గర్భాలయాన్ని ఆనుకుని 6 మండపాలు ఆలయ ప్రాంగణంలో విడివిడిగా ఉంటాయి. ఇక్కడే ఉన్న‌ సంగీత స్తంభాల మండపంలో 56 స్తంభాలున్నాయి.  వీటిలోని 7 స్తంభాల‌ను మీటితే సప్తస్వరాలు సరిగమలు వినిపించడం ఒక అద్భుతం. అందుకే ఈ స్తంభాలను సరిగమ స్తంభాలు అని కూడా అంటారు. ఆ కాలంలో ఇలా రాయిలో సప్తస్వరాలు వచ్చేలా ఎలాంటి టెక్నాలజీ వాడారనేది ఇప్పటికి ఎవరికీ అంతుపట్టని విషయం. భారతదేశ బ్రిటీష్ పాలకులు కూడా సంగీత స్తంభాల వెనుక రహస్యాన్ని తెలుసుకోవాల‌ని భావించి రెండు స్తంభాలను పగలకొట్టారు. వాటిలో ఏమీ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయారు.


శివ‌లింగాన్ని తాకే సూర్యకిరణాలు


ఇంకొక విశేషం ఏమిటంటే ఉగాది సమయంలో వచ్చే పాడ్యమినాడు సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న శివలింగం మీద పడతాయి.


మూడు తలల నంది


ఈ క్షేత్రంలో  అందరినీ  ఆశ్చర్య పరిచే మరో వింత ఏమిటంటే ప్రపంచంలో ఏ  శివాలయంలోని లేని విధంగా ఇక్కడ మూడు తలలు కలిగిన నంది విగ్రహం దర్శనమిస్తుంది. ఏ శివాలయంలో అయిన నందికి ఒక తల ఉండటం మనం చూస్తుంటాము. ఇక్కడ ప్రధాన ఆలయానికి ఉత్తరదిశలో వున్న రెండు ఉపఆలయాల్లో పరమ శివుని సతీమణులైన పంపాదేవి, భువనేశ్వరి ఆలయం బయట మనకు మూడు తలల కలిగిన నంది కనిపిస్తుంది. 


అద్భుత శిల్ప క‌ళ‌కు ఆల‌వాలం


హంపి గ్రామం విజయనగర శిల్పకళకు మంచి ఉదాహరణ. రాజభవనాలు, జల నిర్మాణాలు, పురాతన మార్కెట్ వీధులు,  బలమైన గోడలు, రాజ మంటపాలు, ఖజానా భవనాలు, స్తంభాలు ఆక‌ట్టుకుంటాయి. విజ‌య‌న‌గ‌ర సంస్కృతిలో లీనమైన ఆరాధ్య కళలు, హస్తకళలు, శాసనాలతో ఈ దేవాలయం వెలుగులీనింది. అయితే, ఈ నిర్మాణాలను ఆ సమయంలో ముస్లిం చొరబాటుదారులు ధ్వంసం చేశారు. సాధారణంగా డిసెంబర్ నెలలో ఆలయానికి భారీ సంఖ్యలో పర్యాటకులు, సందర్శకులు త‌ర‌లివ‌స్తారు.


Also Read: భార్య, భర్తకు ఎటువైపు నిద్రపోవడం మంచిదో తెలుసా? పడక గదిలో ఈ నియమాలు తప్పనిసరి!