ప్రతి వ్యక్తికి జీవితంలో కలలుంటాయి. వాటిలో సుఖప్రదమైన వైవాహిక జీవితం గురించి కల కనని వారెవరూ ఉండరు. వైవాహిక జీవితం ఆనందంగా లేని వారు జీవితంలో అన్ని కోల్పోయినట్లే భావిస్తారు. దంపతుల మధ్య సఖ్యత జీవితంలో సుఖసంతోషాలతో పాటు సంపదను కూడా అందిస్తుంది. నిత్యం వాదులాడుకునే, కీచులాడుకునే దంపతులుండే ఇంట్లో లక్ష్మి నిలిచి ఉండదని పెద్దలు చెబుతుంటారు.
వాస్తు శాస్త్రంలో వివాహిత మహిళలు చెయ్యాల్సిన పనులు, తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా వివరించారు. మరి వివాహిత మహిళలు వాస్తు ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం.
దంపతులు నిద్రించే గది వాస్తు
- వాస్తు ప్రకారం దంపతుల బెడ్ రూమ్ ఇంటిలో వాయవ్య లేదా నైరుతి దిశలో ఉండాలి. ఈ దిక్కులు వారి మధ్య ప్రేమను పెంచేందుకు దోహదం చేస్తాయి.
- మంచం మీదకు ఎలాంటి వెలుతురు నేరుగా పడకుండా చూసుకోవాలి.
- ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవీ కూడా దంపతులు నిద్రించే గదిలో పెట్టుకోకూడదు.
- నిద్రకు ఉపక్రమించడానికి ముందే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను గది బయట వదిలెయ్యాలి.
- మంచం ఏర్పాటు చేసుకునే సమయంలోనే మంచం తల దక్షిణం వైపు ఉండేట్టుగా జాగ్రత్త పడాలి.
- ఇక దంపతులు ఇంటికి యజమానులైతే పడక గది తప్పని సరిగా నైరుతిలో ఉండాలి.
- నూతన దంపతులై, ఉమ్మడి కుటుంబంలో ఉండే వారైతే వాయవ్యంలో ఉండడం మంచిది.
- ఈశాన్యం వైపు ఉండే పడక గది దంపతులకు కేటాయించకపోవడమే మంచిది.
- పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న వారు ఆగ్నేయం వైపున్న పడక గది వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
వివాహిత మహిళలు ఎక్కడ పడుకోవద్దు?
వివాహిత మహిళ వాయవ్య మూలన ఎప్పుడూ నిద్రించకూడదు. వాయవ్యం అంటే ఉత్తరం పశ్చిమ దిక్కులు కలిపే మూలగా చెప్పుకోవాలి. వాయవ్యానికి అధిపతి చంద్రుడు. ఈ దిక్కున నిద్రించే స్త్రీ భర్తను వదిలేసి మరొకరితో జీవితం గడపడం గురించిన కలలు కంటారని అంటుంటారు. కాబట్టి దాంపత్యంలో ఉన్న స్త్రీలు ఎప్పుడూ గదిలోని వాయవ్యం వైపు పడుకోకూడదు. అంతేకాదు వివాహిత మహిళలు ఇటువైపు పడుకుంటే కుబేరుడు కినుక వహిస్తాడట. అందువల్ల ఇంట్లో ఆర్థిక కష్టాలు కూడా వస్తాయని వాస్తు చెబుతోంది.
ఎటువైపు పడుకుంటే మంచిది?
వాస్తు ప్రకారం వివాహిత మహిళలు దక్షిణం వైపు పడుకోవడం శుభప్రదం. కానీ పడుకున్నపుడు తల దక్షిణం వైపు ఉండేలా జాగ్రత్త పడాలి. దక్షిణానికి అధిపతి యమధర్మరాజు, అందుకే ఇటువైపు ఎట్టి పరిస్థితుల్లోనూ కాళ్ళు ఉంచి నిద్రించకూడదు. ఇలా పడుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.
వాస్తు ప్రకారం మంచంలో కుడి వైపు, భర్తకు ఎడమ వైపు వివాహిత మహిళలు నిద్రించాలి. ఇలా నిద్రించడం వల్ల వారి మధ్య ప్రేమ వృద్ది చెందుతుంది. వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు రావని వాస్తు శాస్త్రం చెబుతోంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.