7/G Brindavan Colony Sequel: దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో 2004లో విడుదలైన బ్లాక్ బస్టర్ తమిళ చిత్రం '7/G రెయిన్‌బో కాలనీ' (తెలుగులో 7/G బృందావన్ కాలనీ) బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. రొమాంటిక్ డ్రామాకి సీక్వెల్ త్వరలోనే రాబోతుందని గతేడాది చిత్ర నిర్మాత ఏఎం రత్నం తెలిపారు. ఈ నేపథ్యంలో జులై నుంచి ఈ మూవీ షూటింగ్‌ను మొదలుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘7/G బృందావన్ కాలనీ’లో హీరోగా నటించిన రవికృష్ణ సీక్వెల్‌లో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిసింది.


'7/G బృందావన్ కాలనీ సినిమాలో హీరోగా రవికృష్ణ నటించగా, సోనియా అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు అత్యంత సహజంగా తెరకెక్కించడంతో ఈ మూవీ చాలా తొందరగా యూత్ ను ఆకట్టుకుంది. యువన్‌శంకర్‌ రాజా సంగీతం అందించిన 7/G బృందావన్ కాలనీలోని పాటలు సైతం సూపర్‌హిట్‌ అయ్యాయి. దీంతో ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత రవికృష్ణ, సోనియా అగర్వాల్ లు కొన్ని సినిమాలు చేసినా అవి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత ఇద్దరూ సినిమాలు చేయడం మానేశారు. సోనియా మాత్రం కొన్ని సినిమాలు చేస్తూ వస్తోంది.


ఆ తర్వాత గతేడాది ఈ సినిమాకు సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారంటూ నిర్మాత ఎం.రత్నం చెప్పారు. ఈ సీక్వెల్ లో ఎవరు నటిస్తారనేది చర్చనీయంగా మారింది. సీక్వెల్‌లో కూడా రవికృష్ణే ఉంటేనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలరనే అభిప్రాయం వ్యక్తమైంది. అలాగే హీరో విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. జూలైలో షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు. కానీ ఇప్పటివరకు సినిమా సీక్వెల్ పై మేకర్స్, నిర్మాత లేదా నటులు ఎవరూ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ ఆ వార్తే నిజమైతే బాక్సాఫీస్ వద్ద హిట్ ఖాయం అని పలువురు భావిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఇదిలా ఉండగా 7/G బృందావన్ కాలనీతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ సోనియా అగర్వాల్‌.. ఆ సమయంలోనే డైరెక్టర్ సెల్వ రాఘవన్ తో ప్రేమలో పడ్డారు. వీరు 2006లో ప్రేమ వివాహం చేసుకోగా.. కొన్ని మనస్పర్థల కారణంగా వారిద్దరూ 2010లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తాను చాలా మానసిక క్షోభకు గురయ్యానని, ఆ సమయంలోనే తన జీవితంలోకి గీతాంజలి వచ్చిందని, ఆమె వల్ల నా జీవితంలో పెను మార్పు చోటుచేసుకుందని, ఇప్పుడు ఇద్దరం సంతోషంగా ఉన్నామంటూ ఇటీవల సెల్వ రాఘవన్ చెప్పుకొచ్చారు.


Read Also: అమితాబ్ మనవరాలిపై ఫేక్ న్యూస్ - గూగుల్‌కు న్యాయస్థానం కీలక ఆదేశాలు