Bournvita: పిల్లలు, పెద్దల ఆరోగ్యానికి బలవర్దకమైన ఆహారం అంటూ ప్రకటనల్లో కనిపించే తియ్యటి బోర్నవిటా (Bournvita), ఇప్పుడు చేదు అనుభవం ఎదుర్కొంటోంది, తీవ్రమైన విమర్శల దుమారంలో చిక్కుకుంది. 


బోర్నవిటాకు సంబంధించి "తప్పుదోవ పట్టించే" ‍‌(misleading) వ్యాపార ప్రకటనలు, ప్యాకేజింగ్‌, లేబుళ్లను సమీక్షించి, ఉపసంహరించుకోవాలని.. ఆ ఉత్పత్తిని తయారు చేస్తున్న మాండెలెజ్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా (Mondelez International India) కంపెనీ జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్‌ (NCPCR) నోటీసు జారీ చేసింది.


అధిక చక్కెర, క్యాన్సర్‌ కారక రంగులు
బోర్నవిటాలో అధిక శాతం చక్కెర, క్యాన్సర్‌కు కారణమయ్యే రంగులు, పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించే ఇతర పదార్థాలు ఉన్నాయన్నది ఆ కంపెనీపై వచ్చిన ఆరోపణ. 


“ఆరోగ్య పొడి/ఆరోగ్య పానీయంగా పిల్లల ఎదుగుదల & అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని ప్రచారం చేసుకుంటున్న బోర్న్‌విటాలో పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపే అధిక శాతం చక్కెర & హానికరమైన పదార్థాలు/మిశ్రమాలు/ఫార్ములా ఉన్నాయని మా దృష్టికి వచ్చింది" అని మోండెలెజ్ ఇంటర్నేషనల్‌ ఇండియా ప్రెసిడెంట్ దీపక్ అయ్యర్‌ను ఉద్దేశించి తన నోటీసులో కమిషన్‌ పేర్కొంది. 


ఈ అంశంపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని మాండెలెజ్‌ ఇంటర్నేషనల్‌ ఇండియాకు NCPCR సూచించింది.


చర్యలు తీసుకోవాలని FSSAIకి కూడా నిర్దేశం             
ఆహార భద్రత, ప్రకటనల విషయంలో మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI), సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీని (CCPA) కూడా  బాలల హక్కుల రక్షణ సంఘం కోరింది.


బోర్న్‌విటా పౌడర్ సప్లిమెంట్‌లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉందని, కోకో ఘన పదార్థాలు, క్యాన్సర్‌కు కారణమయ్యే రంగులు ఉన్నాయని ఆరోపిస్తూ ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఒక వీడియోను పోస్ట్‌ చేయడంతో వివాదం రేగింది. దీంతో, బోర్నవిటా కంపెనీకి NCPCR నోటీసు ఇచ్చింది. అయితే.. మోండెలెజ్ ఇంటర్నేషనల్‌ ఇండియా కంపెనీకి లీగల్ నోటీసు అందిన తర్వాత, ఆ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తన వీడియోను తొలగించాడు. అప్పటికే ఆ వీడియోను 1.2 కోట్ల మంది చూసినట్లు నమోదైంది. 


ఆరోపణలను ఖండించిన బోర్నవిటా కంపెనీ            
బోర్న్‌విటాపై సోషల్‌ మీడియాలో వచ్చిన ఆరోపణలనుఆ కంపెనీ కొట్టేస్తూ గతంలో ఒక ప్రకటన విడుదల చేసింది.                                          


"అత్యుత్తమ రుచి, ఆరోగ్యాన్ని అందించడానికి పోషకాహార నిపుణులు & ఆహార శాస్త్రవేత్తల బృందం శాస్త్రీయంగా బోర్న్‌విటా మిల్క్ సప్లిమెంట్ ఫార్ములాను రూపొందించింది. నియంత్రణ పరమైన తనిఖీల్లో మా ఫార్ములాలో ఉపయోగించిన అన్ని పదార్థాలకు నియంత్రణ పరమైన ధృవీకరణలు జరిగాయి, అనుమతులు వచ్చాయి. అన్నీ పారదర్శకంగా జరిగాయి. ఫార్ములాలో ఉపయోగించిన అన్ని పోషకాహార పదార్థాలకు సంబంధించి వినియోగదార్లకు ఇచ్చే సమాచారాన్ని ప్యాక్‌పై ముద్రించడం జరిగింది" అని బోర్న్‌విటా ప్రతినిధి వెల్లడించారు.