పట్టిసీమ సమీపంలో ఆలయం అనగానే  వీరభద్రస్వామి ఆలయమే గుర్తొస్తుంది. వీరభద్రస్వామి ఆలయం మినహా పట్టిసీమ నుంచి  కొవ్వూరు వరకూ గోదావరి తీరంలో ఎక్కడా శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం లేదు. అదే విషయంపై చర్చించిన పాతపట్టిసీమకు చెందిన కొందరు మహిళలు వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మిద్దామని గ్రామస్తులతో చర్చించారు. అంతా కలసి కడదాం అని అడిగితే..చేయందించకపోగా అవమానించారు. గుడి కట్టడం మాటలా లక్షల రూపాయలు ఖర్చవుతుంది ఆడోళ్లు మీరేం చేస్తారని హేళన చేశారు. ఆ హేళనకి కుంగిపోలేదు..అడుగు ముందుకేయాల్సిందే అని మరింత గట్టిగా ఫిక్సయ్యారు. మనం ఎందుకు చేయలేం అనుకున్నారు. 12 మంది  మహిళలు ఫిక్సయ్యారు. పట్టుదలగా ముందకు సాగారు. నిత్యం కూలికి వెళితే కానీ పూట గడవని కుటుంబాలు వారివి. ఆర్థికఇబ్బందులు, కుటుంబ బాధ్యతలకు తోడు..వెంకన్న ఆలయం నిర్మించడం కూడా తమ బాధ్యతే  అనుకుని  ఆలయం నిర్మాణం కోసం సంకల్పం వీడకుండా మందడుగు వేశారు.


Also Read: పురాణ కాలంలో మహిళా సాధికారికతకు నిదర్శనం ఈ ఐదుగురు


గోదావరి గట్టున ఉన్న నీటిపారుదలశాఖ స్దలంలో ఆలయం నిర్మించాలనుకున్నారు. అందుకోసం అధికారులను కలసి అనుమతి తీసుకున్నారు. 2018డిసెంబర్ 15వ తేదిన ఆలయ నిర్మాణానికి శంకుస్దాపన చేసారు. ఆరోజు నుంచి ఇంటి పనులూ ,పొలం పనులు చేసుకుంటూనే  ఉభయగోదావరి జిల్లాల్లో విరాళాలు సేకరించారు. వెయ్యి నుంచి 25 వేల రూపాయల వరకూ ఎవరికి తోచినంత సాయం వాళ్లు చేశారు. ఇసుక తీసుకెళ్లే ట్రాక్టర్ డ్రైవర్లు ఆలయ నిర్మాణానికి ఉచితంగా ఇసుక అందించేవారు. మరికొందరు దాతలు, గుమ్మాలు ,టైల్స్ ఇచ్చారు.ఇంకా ఇతర పనులకు సంబంధించి కూడా ఎవరు చేయగిలిన పని వాళ్లు చేశారు. కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు కూడా పనులు వాయిదా వేయలేదు.  పట్టుదలతో మూడేళ్లలో కోటి రూపాయలు విరాళాలుగా సేకరించారు. 2018 లో మొదలుపెట్టి మూడేళ్లలో నిర్మాణం పూర్తిచేశారు.  ఫిబ్రవరి 11న శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి విగ్రహాల ప్రతిష్ఠను కనులపండువగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ, గరుత్మంతుల విగ్రహాల్నీ ప్రతిష్ఠించారు. ఈ పూజల సందర్భంగా గ్రామ యువత, పెద్దలూ ముందుకు వచ్చి నాలుగు రోజులు అన్నసమారాధన చేశారు. ఆఖరి రోజున గ్రామం మొత్తం ఏకమై వేలాది మందికి భోజనాలు పెట్టారు.  ఆడవాళ్లు మీవల్ల ఏమవుతుంది అన్నవారికి.... తలుచుకుంటే తాము ఏపనైనా చేయగలం అని నిరూపించి చూపించారు. ఆ రోజు హేళన చేసిన నోర్లే ఇప్పుడు ఆడవాళ్లూ మీకు జోహార్లు అంటున్నాయ్.  


Also Read:సెల్ప్ రెస్పెక్ట్ కి ఇంతకన్నా నిదర్శనం ఎవరుంటారు, అందుకే ఆమె తరతరాలకు ఆదర్శం