క్షమ, దయ,ధైర్యం, వివేకం, ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన స్త్రీ పాత్ర సీతాదేవి. సీత లేకుండా రాముడు లేడు అందుకే ఆమె గుణగణాలపై ఎందరో మేథావులు చర్చల మీద చర్చలు చేశారు. సీతలోని సుగుణాలు నేటి మగువకు ఎంతో ఆదర్శం, స్పూర్తి దాయకం. రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా ఆ సమయంలో సీతమ్మ ప్రవర్తన అద్భుతం అనిపిస్తుంది. భర్త అడుగుజాడల్లో నడిచిఎన్నో కష్టాలు ఓర్చుకుని ఆఖరికి ప్రాణార్పణానికి సిద్ధపడిన ఆమెలో అన్నీ సుగుణాలే...


ఆత్మాభిమానం
వనవాసంతో భాగంగా చిత్రకూటానికి సీతారాములు వచ్చారని తెలిసిన ఆమె తండ్రి జనకుడు... వారిని కలిసి వనవాసం పూర్తై రామలక్ష్మణులు వచ్చేవరకూ మిథిలా నగరానికి వచ్చి తనతో పాటూ ఉండాలని కోరుతాడు. ఆ మాటలను సున్నితంగా తిరస్కరించిన అభిమానవతి సీత. మెట్టినింటికొచ్చాక ఎన్ని కష్టాలు ఎదురైనా ఎవరికి వారు పరిష్కరించుకోవాలి కానీ పుట్టింటి గడప తొక్కకూడదన్న సందేశాన్నిచ్చింది. 


దయ
తన ముందు చేయి చాచి నిల్చున్నది ఎవరినైనా ఆదరించాలన్న దయాగుణం ఆమెది. అందుకే తనింటికి మారువేషంలో భిక్షాటనకు వచ్చిన రావణుడికి లక్ష్మణరేఖ దాటి మరీ భిక్షం వేసిన దయామూర్తి. అంటే తన రక్షణ కన్నా దానమే గొప్పదన్నది ఆమె భావన.


జంతు ప్రేమికురాలు:...
ప్రకృతి మీద, పశుపక్ష్యాదుల మీద సీతకు ఎనలేని ప్రేమ. అదే ప్రేమతో అందమైన జింకను తన కోసం తీసుకురమ్మని భర్తను అభ్యర్థించింది. అయితే అదే ఘట్టం ఆ తదనంతరం రావణసంహారానికి దారితీసిందనుకోండి. 


వివేకం
మనం ఎంత తెలివైన వారం అనేది కష్టం వచ్చినప్పుడు స్పందించే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే రావణుడు తనను అపహరించుకుపోతున్నప్పుడు... తన ఆనవాళ్లు రాముడికి ఎలా తెలిపాలా అని ఆలోచించింది. ఇప్పట్లా అప్పట్లో ఫోన్లు లేవుకదా...అందుకే తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను నేలపై జారవిడిచి తన ఆనవాళ్లు రాముడికి దొరికేలా చేసింది. 


ప్రేమ
తన భర్తపై ఎంత ప్రేమ అంటే..వర్ణించేందుకు మాటలు సరిపోవు. రావణుడి చెరలో బంధీగా ఉన్నప్పుడు కూడా నిత్యం శ్రీరామనామస్మరణ చేస్తూ అనుక్షణం పతి క్షేమాన్ని కోరుకునేది. 


చైతన్యం
అపాయంలో ఉన్నప్పుడు కూడా ఆమె శత్రువులకు లొంగలేదు. తన వశం కావాలంటూ రావణుడు బెదిరించినప్పుడు కూడా సీత అస్సలు తగ్గలేదు. నువ్వు నాకు ఈ గడ్డిపరకతో సమానం అని చెప్పి రావణుడి ధర్మ హీనతను ప్రశ్నించింది. 


క్షమ 
రాక్షస సంహారం తర్వాత సీతను అశోకవనం నుంచి విడిపించి తీసుకువెళ్తున్న సమయంలో....తాను బంధీగా ఉన్నప్పుడు మాటలతో, చేతలతో తనను హింసించిన రాక్షసులకు ఎలాంటి కీడు తలపెట్టవద్దని, వాళ్లు కేవలం స్వామిభక్తి చూపారని హనుమంతుడితో చెప్పిన  క్షమాగుణం సీత సొంతం.


ధైర్యం
పాతివ్రత్య నిరూపణ కోసం సీతను అగ్నిప్రవేశం చేయమని రాముడు అడిగినప్పుడు ఆమె  బోరుబోరున ఏడవలేదు. తనని నమ్మమని ప్రాధేయపడలేదు. రాముడి మాటలు తన గుండెను గాయపరిచినా సహనంతో భరించింది...తాను తప్పుచేయలేదన్న ఆత్మవిశ్వాసంతో నిప్పుల్లో దూకి తనపై నిందలేసిన వారు కూడా సిగ్గుతో తలదించుకునేలా చేసింది. 


ఆదర్శం
అడవిలో ఆశ్రమవాసిగా కాలం గడుపుతూ కూడా తన కుమారులను ప్రయోజకుల్ని చేయాలని ఎల్లవేళలా తపిస్తూ, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడం ఆమె ఉత్తమ పెంపకానికి నిదర్శనం.


చిన్న చిన్న కారణాలతో జీవిత భాగస్వామితో గొడవలు పట్టుకుంటున్నారు, కూర్చుని మట్లాడుకుంటే పరిష్కారమయ్యే సమస్యని పుట్టింటివరకూ తీసుకెళ్లి పెద్దది చేస్తున్నారు, రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు అన్నట్టే తప్పొప్పులు ఇద్దరివైపూ ఉంటాయని గుర్తించకుండా వేలెత్తి చూపించుకుంటున్నారు.ఫలితంగా నిండు జీవితాలు ముక్కలైపోతున్నాయి. పురుషులు అయినా స్త్రీ అయినా ఇలాంటి ఆదర్శనీయమైన వారిగురించి తెలుసుకున్నప్పుడు కనీసం బంధానికి విలువ ఇవ్వాలని గుర్తించాలి. పెళ్లిరోజు చేసిన ప్రమాణం నిలుపుకోవాలి....ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సీతాదేవి రామనామమే జపించింది, రామయ్య ఏకపత్నీవ్రతుడిగా నిలిచాడు.. అందుకే ప్రతి జంటకీ సీతారాములు ఆదర్శమే...