రీసెంట్‌గా తెలుగులో విడుదలైన తమిళ్ సినిమా టైటిల్స్ చూశారా? ఆ పదాలు ఏవో, ఏంటో మనకి అర్థం కావు. తమిళ్ టైటిల్ 'వలిమై' పేరుతోనే తెలుగులోనూ అజిత్ సినిమాను విడుదల చేశారు. 'వలిమై' అంటే తమిళంలో బలం అని అర్థం. పోనీ, తెలుగుకు 'బలం' అని పెట్టినా బావుండేది. అలా చేయకుండా తమిళ టైటిల్‌ను తెలుగులో రాసేసి విడుదల చేశారు. 'హే సినామికా' అని మరో సినిమా వచ్చింది. తెలుగులో సినామికా అనే పదం లేదు. సినామికా అంటే తమిళంలో ఎప్పుడూ కోప్పడే ఓ అందమైన అమ్మాయి అని అర్థమట. తెలుగు కోసం మరో టైటిల్ ఆలోచించలేదు. ఆ సినిమానూ తమిళ టైటిల్‌తో విడుదల చేశారు. కొంతలో కొంత సూర్య నయం. 'ఈటి' సినిమాకు 'ఎవరికీ తల వంచడు' అని కాప్షన్ ఇచ్చారు.
సాధారణంగా తమిళులకు మాతృభాష మీద అభిమానం ఎక్కువ. తమిళ సినిమాలకు ఇంగ్లిష్ టైటిల్స్ పెట్టరు. మాతృభాషలో టైటిల్స్ పెడతారు. మరి, తెలుగు ప్రేక్షకులకు భాషాభిమానం ఉండదా? గౌరవం ఉండదా? తెలుగు ప్రేక్షకులను తమిళ దర్శక నిర్మాతలు లోకువగా తీసుకుని తమిళ్ టైటిల్స్‌తో తెలుగులో సినిమాలను విడుదల చేస్తున్నారని సోషల్ మీడియాలో ఒకరు ట్వీట్ చేశారు. అది చూసిన తమిళ నిర్మాత ఎస్.ఆర్. ప్రభుకు కోపం వచ్చింది.
"ఇందులో గౌరవానికి సంబంధించిన అంశం ఏమీ లేదు. కళాకారులు ఎవరూ ప్రేక్షకులను లోకువగా తీసుకోరు. చులకనగా చూడరు. ఇది సౌండింగ్, కంఫర్ట్ కు సంబంధించినది. నిజం చెప్పాలంటే... 'బాహుబలి', 'పుష్ప' సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ ధోరణికి ప్రాధాన్యం ఇచ్చింది. అది వర్కవుట్ అయ్యింది. మిగతా వాళ్ళు ఫాలో అవుతున్నారు" అని ఎస్.ఆర్. ప్రభు ట్వీట్ చేశారు. సూర్య, కార్తీ హీరోలుగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఆయన పలు సినిమాలు నిర్మించారు. తెలుగులో విడుదల చేశారు.
Also Read: ఆ ఒక్కటీ చెబితే 'రాధే శ్యామ్' నిర్మాతలు నన్ను చంపేస్తారు! - ప్రభాస్
తమిళ పరిశ్రమను వెనుక వేసుకొచ్చే క్రమంలోఆయన ఓ లాజిక్ మిస్ అయ్యారు. 'బాహుబలి' అనేది సినిమాలో హీరో పేరు. 'పుష్ప' కూడా హీరో పేరే. పైగా, ఆ రెండు పేర్లు తమిళంలో కూడా ఉంటాయి. 'వలిమై', 'సినామిక', 'ఈటి' వంటి పేర్లు తెలుగులో లేవు. ఈ చిన్న లాజిక్ ఎస్.ఆర్. ప్రభు ఎలా మిస్ అయ్యారో? ఆయన నిర్మించిన 'సుల్తాన్' సినిమాను తెలుగులో అదే పేరుతో విడుదల చేసినప్పుడు... ఈ టైటిల్ విమర్శలు రాలేదు. అంతకు ముందు కార్తీ 'ఖైదీ', 'కాష్మోరా' సినిమాలకు కూడా విమర్శలు లేవు! ఇప్పుడు ఎందుకు తమిళ్ టైటిల్స్ మీద వస్తున్నాయంటే... తెలుగులో లేని పదాలను తీసుకొచ్చి టైటిల్స్ పెట్టి, తెలుగు ప్రేక్షకుల మీద రుద్దుతున్నారు కాబట్టి! ఇది తమిళ ఇండస్ట్రీ గమనిస్తే మంచిది.
Also Read: నోరు తెరిచి అడిగిన బోయపాటి శ్రీను, సూర్య మనసులో ఏముందో?