Russia Declares Ceasefire: ఉక్రెయిన్‌పై బాంబు దాడులు కొనసాగుతున్న వేళ రష్యా తాత్కాలికంగా కాల్పులను నిలిపివేసింది. ఈ మేరకు మాస్కో కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు కాల్పులను విరమించినట్లుగా రష్యా (Russia Attacks) ప్రకటించింది. మానవతా దృక్పథంతో ఏర్పాటుచేసిన కారిడార్ల ద్వారా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న పౌరులను తరలించేందుకు కాల్పులను విరమించినట్లుగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఉక్రెయిన్ సంక్షోభాన్ని (Ukraine Crisis) పరిష్కరించే లక్ష్యంతో బెలారస్‌లో రష్యా-ఉక్రెయిన్ దేశాల (Russia Ukraine War) మధ్య జరిగిన రెండో రౌండ్ చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న పౌరుల తరలింపు కోసం మానవతా కారిడార్‌లను సృష్టించడం రష్యా మరియు ఉక్రేనియన్ అధికారులు అంగీకరించారు. పౌరుల కోసం మానవతా కారిడార్‌లను (Humanitarian Corridors in Ukraine) తెరవడానికి రష్యా కాల్పుల విరమణ చేసింది. ఉదయం 6 గంటలకు ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటించింది. ‘‘ఈ రోజు, మార్చి 5న, మాస్కో సమయం ఉదయం 10 గంటలకు, రష్యా వైపు కాల్పుల విరమణ ప్రకటించింది. మారియుపోల్, వోల్నోవాఖా నుంచి పౌరులను తరలించేందుకు మానవతా కారిడార్‌లను తెరిచింది’’ అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి శనివారం విలేకరులతో తెలిపారు.
రోజుకు 16కు పైగా విమానాలు..
ఇప్పటివరకూ ఉక్రెయిన్ నుంచి 11 వేలకు పైగా భారత పౌరులను ఇక్కడికి తరలించారు. ఉక్రెయిన్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరువాత కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. భారత ఆర్మీ సహకారంతో పౌరులను క్షేమంగా భారత్‌కు తీసుకొచ్చేందకు ఆపరేషన్ గంగ (Operation Ganga) ప్రాజెక్టును చేపట్టింది. తొలి రోజుల్లో రోజుకు ఒకట్రెండు విమానాలను నడిపిన కేంద్రం తాజాగా రోజుకు 16 వరకు ప్రత్యేక విమానాలను భారత్ నుంచి ఉక్రెయిన్, రొమేనియా, పొలాండ్, హంగేరీలకు పంపిస్తోందని కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ (Union Minister of State for External Affairs Muraleedharan) అన్నారు. యుద్ధం మొదలైన తరువాత ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకూ 11,000 కు పైగా భారత పౌరులను క్షేమంగా భారత్‌కు తీసుకొచ్చామని మంత్రి వెల్లడించారు.
ఆపరేషన్ గంగ ఫుల్ స్వింగ్.. (Operation Ganga)
తమ పౌరులను భారత్‌కు క్షేమంగా తీసుకొచ్చేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ గంగ ప్రాజెక్టు వేగవంతం చేశామని కేంద్ర మంత్రి మురళీధరన్ తెలిపారు. ఎయిర్ ఏషియా విమానం ద్వారా 170 మంది శనివారం వేకువజామున ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన భారత పౌరులను మంత్రి మురళీధరన్ రిసీవ్ చేసుకున్నారు. వారి బాగోగులు, సహాయ సహకార చర్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మిషన్‌లో భాగస్వాములు అయిన వారికి, సహకారం అందించిన విదేశీ ప్రభుత్వాలు, అక్కడి ఎంబసీ అధికారులు, వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.