అధ్భుతమైన వ్యూహకర్త
ద్రుపదుడి యఙ్ఞవాటికలో అగ్ని నుంచి జన్మించిన శక్తి స్వరూపిణి ద్రౌపది. అందమైన, బలమైన స్త్రీ మాత్రమే కాదు మంచి వ్యూహకర్త కూడా. కురుసభలో దుశ్శాసనుడు, అడవిలో సైంధవుడు, విరాటుని కొలువులో కీచకుడు ఇలా ఎంత మందితో అవమానాలు, వేధింపులు ఎదుర్కొని ఒక్కోక్కరికీ బుద్ధిచెప్పింది.  దురహంకార రాజులను నాశనం చేయడానికే శచీదేవి ఈ అవతారం ఎత్తింది.  తనను నిండు సభలో అవమానించిన సంఘటనను పదేపదే గుర్తుచేసుకుంటూ పాండవులను కార్యోన్ముఖులను గావించి మహాభారత యుద్ధానికి పరోక్షంగా కారణమైంది. తనను వెలయాలిలా ఈడ్చుకొచ్చిన దుశ్శాననుడి రక్తం కళ్లజూసిన వరకూ తన కురులను ముడివేయనని శపథం చేసింది.  అందుకే 13 ఏళ్ల పాటు జుట్టు విరబోసుకునే ఉంది ద్రౌపది.


Also Read: సెల్ప్ రెస్పెక్ట్ కి ఇంతకన్నా నిదర్శనం ఎవరుంటారు, అందుకే ఆమె తరతరాలకు ఆదర్శం


ఆత్మస్థైర్యానికి నిదర్శనం
జనకుడి కుమార్తె, శ్రీరాముని ధర్మపత్ని అయిన సీతాదేవి సహనానికి మారుపేరు. తన క్షమాగుణంతో భూదేవిని మించి అనిపించుకుంది. పుట్టినింట్లో అల్లారుముద్దుగా పెరిగిన సీతాదేవి మెట్టినింటలో అండుగుపెట్టినప్పటి నుంచి తిరిగి తల్లి భూదేవి ఒడికి చేరేవరకూ ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. అయినప్పటికీ ఎక్కడా  ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. భార్యగా తన బాధ్యత మరువకుండా భర్త వెంట నడిచింది, లవకుశలకు జన్మించేసరికి అడవిలో ఉన్నప్పటికీ వారిని వీరులుగా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయింది. 


ఉత్తమ ప్రేమికులురాలు-ఆదర్శవంతమైన తల్లి
హిడింబి కేవలం ఉత్తమ ప్రేమికురాలే కాదు. ఆదర్శమైన తల్లి కూడా. కొడుకు పుట్టిన తర్వాత భీముడు, మిగిలిన పాండవులు, కుంతి.. ఆమెను అడవిలోనే వదిలేసి అజ్ఞాతవాసానికి వెళ్లిపోతారు. అయినా ఆమె భర్త భీముడికి ఇచ్చిన మాటమేరకు వారి వెంట వెళ్లదు.  మాయలు, మంత్రాలు, యుద్ధ విద్యల్లో ఘటోత్కచుడిని గొప్పవాడిగా తీర్చిదిద్దుతుంది. పాండవులపై అభిమానం కలిగేలా చేస్తుంది. అవసరమైనప్పుడు వాళ్లకు సాయం చేయమంటుంది. యుద్ధంలో పాండవులకు సహాయం చేస్తూ ఘటోత్కచుడు తన ప్రాణాలను పణంగా పెట్టి చనిపోతాడు.  ఘటోత్కచుడు పెరిగి పెద్దవాడై రాజ్యపాలనాభారాన్ని తీసుకునే వరకూ తనయుడితో పాటూ ఉన్న హిండింబి ఆ తర్వాత హిమాలయాలకు వెళ్లిపోయింది. అక్కడ తపస్సు చేసి అనేక దివ్యశక్తులను పొందింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి ప్రాంతవాసులు హిడింబిని దైవంగా భావిస్తారు. అమ్మగా కొలుస్తారు. హిమాచల్‌ప్రదేశ్‌లో కొలువైన హిడింబి మాతా దేవాలయంలో ఏటా వసంతరుతువులో దూంగ్రీ మేళా పేరుతో మూడురోజుల పాటూ  కన్నుల పండువగా ఉత్సహం జరుపుకుంటారు. ఈ హిడింబి మాత దేవాలయాన్ని మహారాజా బహదూర్‌సింగ్ నిర్మించాడు.  


గంజాయి వనంలో తులసి మొక్క
రావణాసురుడి  భార్య మండోదరి. ఈమె మహా పతివ్రత. మండోదరి మాయాసురుడి కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్లిచేసుకుంటాడు. అయినప్పటికీ ఉత్తమ భార్యగా నిలిచింది. రావణుడిని మంచి మార్గంలో నడిపించేందుకు ఎంతగానో తాపత్రయపడింది. సీతను అపహరించుకుని వచ్చినప్పుడు కూడా తప్పని చెప్పింది.  సీతను రాముని వద్దకు పంపించాలని అభ్యర్థించింది. రాముడితో తన భర్త చేసేది అధర్మ యుద్దం అని తెలిసి హెచ్చరించింది. ఆమె మాటలు పెడచెవిన పెట్టిన రావణుడు తన పతనాన్ని తానే తెచ్చుకున్నాడు. అన్ని అరాచకాలను చూస్తున్నా, లంకలో రాక్షసుల మధ్య ఉన్నా ఆమె గంజాయి వనంలో తులసి మొక్కలానే నిలిచింది. 


Also Read: పురుషులు ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే దాంపత్య సమస్యలు తప్పవట


కరణేషు మంత్రి
తార....ఈమె ప్రస్తావన రామాయణంలో ఉంటుంది. ఈమె తొలుత వాలి భార్య అయినప్పటికీ...వాలి మరణానంతరం వానర రాజనీతిని అనుసరించి సుగ్రీవుడి భార్య అయింది. పైగా తన కుమారుడైన అంగదుడిని కాపాడుకోవాలంటే అండ అవసరం..అందుకే రాముడి సలహా అనుసరించి వసుగ్రీవుడి భార్య అయింది. తార కథ నుంచి మనం తెలుసుకోవలసిన నీతి ఏంటంటే భార్య ఎప్పుడూ లౌకిక పరిస్థితుల గురించి భర్తకు తెలియడేస్తూ కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉండాలి. అంతేకానీ కర్తవ్య విముఖుణ్ణి చేయరాదు.  


ఇంకా చెప్పుకుంటూ వెళితే చాలామంది ఉన్నారు. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఆ సమయంలో వారి ధైర్య స్థ్యైర్యాలు, ఓర్పు సహనాన్ని నేటి మహిళలు స్పూర్తిగా తీసుకుంటే.. కుటుంబాల్లోనూ గొడవలు ఉండవు, సంసార జీవితాల్లో కలతలు రావంటున్నారు పండితులు.