దేవుడి నివాసాలుగా భావించే ఆలయాల సందర్శనకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. లింగ, వర్ణ, వయో భేదం లేకుండా అంతా స్వామి, అమ్మవార్ల ఆశీస్సులకోసం క్యూ కడుతుంటారు. కొన్ని ఆలయాల్లో స్త్రీలకు ప్రవేశం లేకపోతే.. మరికొన్ని ఆలయాల్లో పురుషులకు ప్రవేశం లేదు. ఆ గుళ్లలో మగవాళ్లు రాకుండా ఉండేందుకు అక్కడ  కాపలాదారులు పహారా కాస్తుంటారు. ఆ ఆలయాలేంటో తెలుసుకుందాం...
 
Also Read: ఈమె 'మగధీర' మిత్రవింద కాదు శ్రీకృష్ణుడి మిత్రవింద
రాజస్థాన్‌లోని బ్రహ్మాజీ ఆలయం
బ్రహ్మదేవుడికి ఆలయాలుండడం చాలా అరుదు. మనదేశంలోని రాజస్థాన్‌లో ఉన్న బ్రహ్మ పుష్కర్‌లో బ్రహ్మదేవుడి ఆలయం ఉంది. ఈ ఆలయంలో మగవాళ్లకు ప్రవేశం లేదు. పురుషుడైన బ్రహ్మ ఆలయంలోకి పురుషులకు ఎందుకు ప్రవేశం లేదంటారా..అందుకు కారణం బ్రహ్మ అనే చెప్పాలి.  బ్రహ్మ యజ్ఞం చేయాలనుకుని నిశ్చయించుకున్నప్పుడు సరస్వతీదేవి ఆ సమయంలో ఆయన పక్కన ఉండదు. ఆ సమయంలో గాయత్రిని పెళ్లిచేసుకుని యజ్ఞాన్ని పూర్తిచేస్తాడు. అందుకే ఆగ్రహించిన సరస్వతీదేవి ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించరాదని, కాదని ప్రవేశిస్తే  దాంపత్య సమస్యలు వస్తాయని శపించిందట. 
 
కేరళలో భగవతీ ఆలయం
భగవతీ ఆలయం కేరళ చెంగన్నూర్‌ ఉంది. ఇక్కడ అమ్మవారు ప్రతినెలా రుతుస్రావాన్ని ఆచరిస్తుంది. అమ్మవారికి గుడ్డకప్పినప్పుడు అది ఎర్రగా మారుతుంది. దీంతో అమ్మవారు రుతుస్రావం ఆచరించారని తెలుసుకుని గుడిని మూడు రోజుల పాటూ మూసివేస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. నాలుగో రోజు ఆడవారు రహస్యంగా విగ్రహానికి పవిత్రజలంతో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత పూజారులు వచ్చి అభిషేకం నిర్వహిస్తారు. అప్పటి నుంచీ అందర్నీ గుడిలోకి అనుమతిస్తారు. ప్రతి నెలా మూడురోజులు కేవలం మహిళలు మాత్రమే గుడిలోకి వెళ్లడానికి అర్హులు. ఇదే కాకుండా  108 శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్పే కన్యాకుమారిలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రధాన దేవతను భగవతీమాతగా పిలుస్తారు. ఈ ఆలయంలోకి కూడా పురుషులు వెళ్లరు.


ఆట్టుక్కాల్‌ ఆలయం, కేరళ
కేరళ రాష్ట్రం తిరువనంతపురానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఆట్టుక్కాల్‌ అమ్మవారి దేవాయం ఉంది. కేవలం పురుషులకు శబరిమలై ఆలయంలో ప్రవేశమున్నట్లే ఈ ఆట్టుక్కాల్‌ దేవాలయంలో కేవలం స్త్రీలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఈ ఆలయంలోకి పురుషులు వెళితే పాపం చుట్టుకుంటుందని భావిస్తారు. ఏటా వారం రోజుల పాటు అమ్మవారికి నారీ పూజ చేస్తారు. మహిళలు వారం రోజుల పాటు నిష్టతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు. అప్పుడు కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి. మగవాళ్లు ఉండరాదు. దీన్ని‘పొంగా ఉత్సవం’ అంటారు. ఫిబ్రవరి, మార్చి నెల మధ్యలో ఈ దేవాలయంలో పొంగా ఉత్సవం వైభవంగా జరుగుతుంది. 


Also Read:  స్వర్గానికి షార్ట్ కట్! ధర్మరాజు తమ్ముళ్లు కుక్కతో కలసి వెళ్లిన రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!
బీహార్‌లోని మాతా ఆలయం
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని మాతా ఆలయానికి "పీరియడ్స్" సమయంలో మాత్రమే మహిళలను అనుమతిస్తారు. ఆ సమయంలో మగ పూజారులు కూడా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించరు. 


ఆంధ్రప్రదేశ్‌లోని కామాఖ్య దేవాలయం
గౌహతిలోని ప్రసిద్ధ కామాఖ్య దేవాలయంలా విశాఖపట్నంలోని కామాఖ్య పీఠం ఉంది.  ఇక్కడ కూడా నెలలో కొన్ని రోజులు పురుషుల ప్రవేశాన్నినిషేధిస్తుంది.  ఇక్కడ కూడా అమ్మవారికి రుతుక్రమం వస్తుందని చెబుతారు. ప్రతి వేసవిలో అంబువాసి పండుగ సందర్భంగా కామాఖ్య దేవత యొక్క రసజ్వల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో గర్భగుడి నుంచి ప్రవహించే నీరు ఎర్రగా ఐరన్ ఆక్సైడ్ వలె రుతుస్రావంలా కనబడుతుంది. కాళికా పురాణం ప్రకారం కామాఖ్య దేవిని శివుని చిన్న భార్యగా, ముక్తిని ప్రసాదించే శక్తిగా వర్ణిస్తారు.