సినిమా రివ్యూ: 'సెబాస్టియన్ పీసీ 524'
రేటింగ్: 2/5
నటీనటులు: కిరణ్ అబ్బవరం, నువేక్ష, కోమలీ ప్రసాద్, రోహిణి, సూర్య, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు
ఎడిటింగ్: విప్లవ్ న్యసదాం  
సినిమాటోగ్రఫీ: రాజ్ కె. నల్లి
సంగీతం: జిబ్రాన్ 
నిర్మాతలు: సిద్ధారెడ్డి బి, జయచంద్రారెడ్డి, ప్రమోద్, రాజు
దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి  
విడుదల తేదీ: మార్చి 4, 2022


యువ కథానాయకులు ప్రయోగాలు చేయడానికి వెనుకాడటం లేదు. కమర్షియల్ చిత్రాలకు మాత్రమే పరిమితం కాకుండా... కొత్త తరహా కథలు, పాత్రలతో కూడిన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'రాజావారు రాణిగారు', 'ఎస్.ఆర్. కళ్యాణమండపం' సినిమాలతో ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం... 'సెబాస్టియన్ పీసీ 524' (Sebastian PC 524 Movie)తో ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చారు. సినిమాలో రేచీకటి (Night Blindness) తో సమస్యలు ఎదుర్కొనే పోలీస్ కానిస్టేబుల్ పాత్రను ఆయన పోషించారు. పోలీస్ కథలు చాలా వచ్చాయి. అయితే... రేచీకటి ఉన్న ఒక కానిస్టేబుల్ మర్డర్ కేసును ఎలా సాల్వ్ చేశాడు? అనేది 'సెబాస్టియన్ పీసీ 524'లో ఆసక్తికరమైన అంశం. ఈ సినిమా ఎలా ఉంది? (Sebastian PC 524 Movie Review)


కథ: సెబాస్టియన్ (కిరణ్ అబ్బవరం)కు రేచీకటి. ఆ విషయాన్ని దాచిపెట్టి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదిస్తాడు. అయితే... రేచీకటి వల్ల ఎదురైన పరిస్థితుల కారణంగా ప్రతి ఊరు నుంచి కొన్ని రోజులకు ట్రాన్స్‌ఫ‌ర్‌ అవుతుంటాడు. చివరకు, సొంతూరు మదనపల్లి వస్తాడు. ఎస్సై, కానిస్టేబుల్స్... తోటి ఉద్యోగులు వాళ్ళందరూ పక్క ఊరిలో బందోబస్తుకు వెళ్ళడంలో ఒకరోజు రాత్రి పోలీస్ స్టేషన్‌లో సెబా ఒక్కడే ఉండాల్సి వస్తుంది. ఆ రాత్రి తనను ఒకరు వేధిస్తున్నారని, కాపాడమని నీలిమ (కోమలీ ప్రసాద్) నుంచి ఫోన్ వస్తుంది. యథావిధిగా ఫోన్ పక్కన పెట్టేస్తాడు సెబాస్టియన్. తెల్లారితే ఆమె మరణించిందని తెలుస్తుంది. నీలిమను ఎవరు హత్య చేశారు? ఈ కేసును సెబాస్టియన్ ఎలా చేధించాడు? ఈ కేసులో తాను ప్రేమించిన హేలీ (నువేక్ష), స్నేహితుడు తేజ, నీలిమ మామ (సూర్య)ను సెబాస్టియన్ ఎందుకు అనుమానించాడు? సెబా ప్రయాణంలో ఆమె తల్లి (రోహిణి) పాత్ర ఏమిటి? సెబాకు రేచీకటి ఉందనే సంగతి ఎవరెవరికి తెలుసు? తదితర ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ: ఓ అమ్మాయి మరణించింది. అది సహజ మరణమా? హత్యా? హత్య అయితే ఎవరు చేశారు? అనేది దర్యాప్తు చేయడం అసలు పాయింట్. అయితే... కథానాయకుడికి రేచీకటి కావడంతో మంచి కామెడీ సన్నివేశాలకు కథలో చోటు దక్కింది. సినిమాను సీరియస్‌గా కాకుండా వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశారు. రేచీకటితో హీరో చేసే ఇన్వెస్టిగేషన్ కూడా కాస్త థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా ఉంది. అందువల్ల, ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్‌లా కాకుండా... డిఫ‌రెంట్‌గా ఉంటుంది.


'సెబాస్టియన్ పీసీ 524' సినిమాను ప్రారంభించిన విధానం బావుంటుంది. కిరణ్ అబ్బవరం పాత్రలో ఒదిగిపోయారు. దాంతో ప్రథమార్థం కామెడీ సన్నివేశాలతో సరదాగా సాగుతుంది. ద్వితీయార్థంపై ఆసక్తి పెంచుతూ... విశ్రాంతికి ముందు అసలు కథలోకి సినిమా అడుగు పెడుతుంది. విశ్రాంతికి ముందు వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అయితే... ద్వితీయార్థంలో కథ నెమ్మదిస్తుంది. కథనంలో వేగం లోపిస్తుంది. అదే సినిమాకు మైనస్. మాటల్లో, పాటల్లోని సాహిత్యంలో ఉన్న డెప్త్ సినిమాలో లోపించింది. క్రైమ్ డ్రామా, సస్పెన్స్ థ్రిల్లర్‌కు అవసరమైన సంగీతాన్ని జిబ్రాన్ అందించారు. 'హేలీ...', 'రాజాధి రాజా...' పాటలు బావున్నాయి. 'హేలీ...'ని చిత్రీకరించిన తీరు బావుంది. 'రాజాధి రాజా...' ఆకట్టుకుంటుంది. అయితే... పాటలకు సరైన సందర్భాలు కుదరలేదు. అనూహ్యంగా వచ్చినట్టు ఉంటాయి. ఇంగ్లిష్ నేపథ్య గీతం పంటికింద రాయిలా తగులుతుంది. కథనంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సినిమాటోగ్రాఫర్ రాజ్ కె. నల్లి ప్రతి ఫ్రేమును అందంగా తీర్చిదిద్దారు. రెగ్యులర్ సినిమాలకు డిఫరెంట్ కలర్ టోన్‌లో 'సెబాస్టియన్ పీసీ 524' ఉంటుంది. సన్నివేశాలకు అవసరమైన ఫీల్‌ను రాజ్ కె. నల్లి తీసుకు వచ్చారని చెప్పాలి. నిర్మాణ విలువలు బావున్నాయి. మదర్ సెంటిమెంట్ సీన్స్ కథకు అడ్డు తగిలాయి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా అంత ఆసక్తికరంగా సాగలేదు. స్క్రీన్ ప్లేను సరిగ్గా రాసుకుని ఉంటే మంచి థ్రిల్లర్ సినిమా అయ్యేది. ఇప్పుడు అటు థ్రిల్లర్, ఇటు క్రైమ్ డ్రామా కాకుండా మిగిలింది.


కానిస్టేబుల్‌గా పెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర చేశారు కిరణ్ అబ్బవరం. ఆయన కామెడీ టైమింగ్ బావుంది. చిత్తూరు యాసలో డైలాగులు చెబుతూ... చీకటి అంటే భయపడే సన్నివేశాల్లో వినోదం పండించారు. ఆ తర్వాత కేసు దర్యాప్తు చేసే సన్నివేశాల్లో సీరియ‌స్‌నెస్‌ చూపించారు. గెటప్స్ పరంగానూ ఆయన వేరియేషన్ చూపించారు. నటి రోహిణి మరోసారి తల్లి పాత్ర చేశారు. కిరణ్, ఆమెకు మధ్య మదర్ సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి. 'హేలీ...' పాటలో నువేక్ష అందంగా కనిపించారు. నటన పరంగా తేలిపోయారు. కథలో కోమలీ ప్రసాద్‌ది కీలక పాత్ర. హీరోయిన్ కాదు కానీ... కథంతా ఆమె చుట్టూ తిరుగుతుంది. నీలిమగా కోమలీ ప్రసాద్ చక్కగా నటించారు. శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, ఆదర్శ్ బాలకృష్ణ, తమిళ నటుడు జార్జ్ మర్యన్, తేజ పాత్రలో కనిపించిన వ్యక్తి పాత్రలకు తగ్గట్టు చేశారు.
Also Read: 'హే సినామికా' రివ్యూ: దుల్కర్ సల్మాన్... కాజల్ అగర్వాల్... అదితి రావు హైదరి నటించిన సినిమా ఎలా ఉందంటే?
రేచీకటి కల పాత్రను ఎంపిక చేసుకున్నందుకు, 'సెబాస్టియన్ పీసీ 524' సినిమా చేసినందుకు కిరణ్ అబ్బవరాన్ని అభినందించాలి. నటుడిగా ఆయన సినిమాకు న్యాయం చేశారు. వినోదం అందించారు. అయితే... ద్వితీయార్థంలో కథనం నెమ్మదించడం, సన్నివేశాలను సాగదీయడం ప్రేక్షకుడు పక్కచూపులు చూసేలా చేసే అంశాలే. అలాగని, సినిమాను తీసి పారేయలేం! డిఫరెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌ ఇస్తుందీ 'సెబాస్టియన్ పీసీ 524'. కిరణ్ అబ్బవరం కోసం, పాటలు - ఛాయాగ్రహణం కోసం చూడొచ్చు. సెబా కామెడీతో పాటు విజువల్స్ బావున్నాయి.