Basra IIIT News: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆలుగడ్డ కూరలో కప్పలు వచ్చేయాని విద్యార్థులకు ఆరోపిస్తున్నారు. ఓ విద్యార్థి తన ప్లేట్లో కప్పను చూసి ఖంగుతిన్నాడు. దీంతో మిగతా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అయితే మెస్ కాంట్రాక్టర్ తన పలుకుబడిన ఉపయోగించి విషయం బయటకు రాకుండా విద్యార్థులను కట్టడి చేశారు. అయినా ఒక ఫొటో బయటకు రావడంతో అసలు విషయం తెలిసింది. బాసర ట్రిపుల్ ఐటీలో ఏడు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి కోసం మూడు మెస్లున్నాయి. ఇవి ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించారు. మూడు మెస్‌ల నిర్వాహకులు-అధికారులు కలిసిపోయారు. కొన్నాళ్లుగా విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆందోళన చేస్తే అడ్మిషన్ తొలగిస్తాం
భోజనాల్లో పురుగులు నిత్యకృత్యమైందని తాజాగా కప్పను రావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలను బయటకు రాకుండా మీడియాను కట్టడి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. . మీడియాకు క్యాంపస్‌లోకి అనుమతి ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు. కాసులకు కక్కుర్తి పడి విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. విద్యార్థుల తిండి కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు చెల్లిస్తోందని, అయితే క్యాంపస్‌లో జరుగుతున్న విషయాలు బయటకు చెప్పినా, ఆందోళనలు చేసినా అడ్మిషన్ తొలగిస్తామని మెస్ కాంట్రాక్టర్లు హెచ్చరించడం దుమారం రేపుతోంది.
స్పందించని అధికారులు
గత కొన్ని రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ హాస్టల్ మెస్సులో పురుగులు, బొద్దింకలు, కప్పపిల్లలు వస్తున్నాయని విద్యార్థులు అంటున్నారు. దీనిపై అనేకసార్లు విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా మెస్ నిర్వాహకుల తీరు మారలేదు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ హాస్టల్ లో కలుషిత ఆహారం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. నిన్న ఉదయం బ్రేక్ పాస్ట్‌లో కప్పపిల్ల కనిపించడంతో విద్యార్థులు వాంతులు చేసుకున్న పరిస్థితి. ఇవాళ ఉదయం టిఫెన్ లో బొద్దింకలు కనిపించాయి. దీంతో ఈ తిండి తినలేమంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనలపై మీడియా కథనాలు రావడంతో ఉన్నతాధికారులు అలెర్ట్ అయ్యారు. మెస్ నిర్వాహకులైన శక్తి క్యాటరింగ్ సంస్థకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల వివరణ కోసం వెళ్లిన మీడియాను లోపలికి అనుమతి లేదంటూ సిబ్బంది వెనక్కి పంపించేశారు.