Vontimitta Kalyanam 2023:  దేశ వ్యాప్తంగా ఉన్న రామాయలయాల్లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగాయి. అయితే వీటన్నింటి కన్నా  ఒంటిమిట్ట చాలా ప్రత్యేకం.  సాధారణంగా దేశ వ్యాప్తంగా వైష్ణవ ఆలయంలో చూసినా సీతారాముల కళ్యాణం చైత్ర మాసం నవమి రోజు పగలు జరిగితే..ఒంటిమిట్టలో మాత్రం చైత్ర పౌర్ణమి రోజు, వెన్నెల్లో జరుగుతుంది. ఆంధ్రా భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్టలో రామయ్య కళ్యాణ వేడుక చూసేందుకు రెండు కళ్లు చాలవు


ఆలయం ప్రత్యేకత ఇదే
జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించి రామతారక మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడట. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్టమీద నుంచి రఘురాముడు దివ్యదర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడు. శ్రీ రామచంద్రుడిపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి.. జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం


Also Read: ఆయన ఆకాశం - ఆమె పుడమి, అందుకే వారి కళ్యాణం లోకకళ్యాణానికి కారకం, ప్రకృతికి పులకరింతకు ప్రతీక


రాముడు నడయాడిన నేల
ప్రకృతి వైపరీత్యాలు, దోపిడీలు, దొంగతనాలు, దాడులు, ఘాతకాలకు తట్టుకుని నిలబడింది ఒంటిమిట్ట కోదండ రామాలయం. దీనికి ఏకశిలానగరం అనే పేరు కూడా ఉంది. సీత, రామ, లక్ష్మణుల ప్రతిరూపాలను ఒకే శిలలో విగ్రహాలుగా చెక్కారు అందుకే ఏకశిలా నగరం అనే పేరొచ్చింది.  ఆ ఏకశిలకు దగ్గర్లోనే మృకండుడు అనే మహర్షి తపస్సు చేసుకునేవారట, రాములవారు అరణ్యవాసంలో భాగంగా అటు సంచరిస్తూ కొద్ది రోజులు మృకండునికి రక్షణగా ఇక్కడ ఉన్నారని స్థలపురాణం చెబుతోంది. ప్రతి రామాలయంలోనూ కనిపించే ఆంజనేయస్వామి విగ్రహం ఈ ఆలయంలో కానరాకపోవడం మరో ప్రత్యేకత.  రాములవారు ఆంజనేయుని కలవక ముందే ఇక్కడకు వచ్చారనీ... అందుకే ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉండదని చెబుతారు. శతాబ్దాలుగా ఒంటిమిట్ట రామాలయం భక్తులకు పుణ్యతీర్థంగా ఉండేది, పోతన సైతం ఇక్కడే భాగవతాన్ని అనువదించాడనీ, అన్నమయ్య కూడా ఈ క్షేత్రాన్ని దర్శించాడనీ చెబుతారు.  


ఒంటిమిట్ట ప్రాంతం  1340లో అరణ్యంగా ఉండేది. ఆ ప్రాంతంలో కేవలం మృకుండాశ్రమం మాత్రమే ఉండేది.బోయ నాయకులైన ఒంటడు–మిట్టడు అక్కడికి వచ్చిన రాజావారు కంపరాయులుకు అక్కడి రామతీర్థంలోని నీటిని ఇచ్చి దాహం తీర్చి ఉపచారాలు చేశారు. అప్పటికే శిథిలమై ఉన్న గుడిని చూపి అభివృద్ధి చేయాలని వారు రాజును కోరడంతో గుడినిర్మాణంతో పాటూ చెరువు నిర్మాణం కూడా తలపెట్టారట. ఆ బాధ్యతను ఒంటడు, మిట్టడులకు అప్పగించారు.


Also Read: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!


పున్నమి కాంతుల్లో సీతారాముల కళ్యాణం ఇక్కడ ప్రత్యేకం
 శ్రీరామనవమి రోజు జరిపించాల్సిన కళ్యాణం చైత్ర పౌర్ణమి రోజు జరిపించడం మరింత విశేషం. పగటివేళ తాను రామకల్యాణాన్ని చూడలేకపోతున్నానని బాధపడుతున్న చంద్రుడికి శ్రీరాముడు మాటిచ్చాడట.అందుకే తన కళ్యాణ వేడుకను చంద్రుడు తిలకించేలా చైత్ర పౌర్ణమి రోజు రాత్రి జరుగుతుందని వరమిచ్చాడని కథనం. మరో కథ ప్రకారం చంద్రవంశజులైన విజయనగరరాజులు తమ కులదైవానికి తృప్తికలిగేలా... రాత్రివేళ కల్యాణాన్ని జరిపించే ఆచారాన్ని మొదలుపెట్టారని కూడా అంటారు.  కారణం ఏదైనా ఇతర రామాలయాలకు భిన్నంగా ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణం పున్నమి కాంతుల్లో జరగడం చాలా ప్రత్యేకం. 


ఆంజనేయుడి లేని రామాలయం
రామాలయం లేని ఊరూ రామాయణం వినని వారూ ఉండరంటారు. దేశంలో ఏ రామాలయానికి వెళ్లినా రాముడి కుడివైపున లక్ష్మణుడు, ఎడమ వైపున సీతాదేవి, పాదాల దగ్గర నమస్కార భంగిమలో హనుమంతుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. కానీ ఈ ఆలయంలో ఆంజనేయుడి విగ్రహం ఉండదు. అలాంటి అరుదైన ఆలయమే ఒంటిమిట్ట రామాలయం. ఈ ఆలయ నిర్మాణ సమయానికి రాముడికి హనుమంతుడు పరిచయం కాలేదనీ.. అందుకే ఇక్కడ హనుమంతుడి విగ్రహం లేదనే కథ కూడా ప్రచారంలో ఉంది.