Sri Rama Navami 2023: బంధం కలిస్తే బంధుత్వం.. ఇద్దరు వ్యక్తుల మధ్య అనురాగ ముడులువేసే ప్రక్రియ పెళ్లి. పెళ్లి ఇద్దరు ఇద్దరు మనుషులనే కాదు రెండు కుటుంబాలను కలుపుతుంది. అంతుకుముందు పరిచయం లేనివారి మధ్య ఆత్మీయతకు కారణమవుతుంది. పూర్తి సంప్రదాయబద్దంగా జరిగిన సీతారాముల కళ్యాణం లోకానికి సంప్రదాయం..దంపతుల మధ్య అనురాగం ఎలా ఉండాలో చెప్పే మార్గదర్శనం..వాల్మీకి రామాయణంలోని ఈ ఘట్టాలు ఎప్పటికీ అపురూపాలే...
ప్రేమపెళ్లి కాదు ..పెళ్లి తర్వాత ప్రేమ
సీతారాములది ప్రేమ వివాహం కాదు.. వాస్తవానికి శ్రీరాముడు సీతమ్మను పెళ్లిచేసుకోవడం కోసం శివధనస్సును ఎక్కుపెట్టలేదు..తన గురువైన విశ్వామిత్రుని ఆదేశం మేరకే ఎక్కుపెట్టాడు. ఆ తర్వాత కూడా నేరుగా సీతమ్మను స్వీకరించలేదు. తన తండ్రి దశరథుడు వచ్చి, జనకమహారాజుతో మాట్లాడి, ఇద్దరూ అంగీకరించిన తర్వాతే..ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కుదిరిన తర్వాతే సీతను వివాహం చేసుకునేందుకు అంగీకరించాడు. అలాగాని పెద్దలు చెప్పారు ఏదో పెళ్లిచేసుకున్నారులే అనుకుంటే పొరపాటే..సీతారాములిద్దరికీ ఒకరంటే ఒకరికి వర్ణించలేనంత ప్రేమ.
ప్రియాతు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి ।
గుణాద్రూప గుణాచ్ఛాపి ప్రీతిః భూయోభివర్థత ।। (వాల్మీకి రామాయణం)
పెద్దలు కుదిర్చిన పెళ్లి కదా అని రామయ్య సీతమ్మపై మరింత ప్రేమను పెంచుకుంటే..తన గుణగణాలతో ఆ ప్రేమను రెట్టింపయ్యేలా చేసింది సీతమ్మ . పుట్టింటిని వదిలి తనను నమ్మి వచ్చిన స్త్రీని ఎంతగా ప్రేమించాలో, ఎలా గౌరవించాలో రామచంద్రుడు చూపిస్తే.. అనురాగం, ప్రేమతో మాత్రమే భర్తను తనవాడిని చేసుకోవాలనే సందేశం సీతమ్మ ఇచ్చింది. అందుకే వారు ఆదర్శ దంపతులయ్యారు.
Also Read: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి
శ్రీరామ నవమి రోజు కళ్యాణం ఎందుకు చేస్తారు
సీతారామ కల్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్ర యుక్త వైశాఖ శుద్ధ దశమి నాడు జరిగింది. కానీ ‘మహతాం జన్మనక్షత్రే వివాహం’ అంటుంది ఆగమ శాస్త్రం. మహాత్ములు, అవతారమూర్తుల జన్మతిథి నాడు ఆ నక్షత్రంలో భక్తులు కల్యాణం చేయాలని శాస్త్ర నియమం. చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించాడు శ్రీరాముడు. ఆ పర్వదినాన్ని శ్రీరామనవమిగా ఘనంగా చేసుకుంటారు. ఈ సందర్భంగా ఊరూవాడా సీతారాముల కల్యాణం జరుపుతారు.
విశ్వామిత్రుడు అందించిన సమాచారంతో మిథిలానగరం చేరుకున్న రామచంద్రుడి కుటుంబానికి ఘనంగా స్వాగత సత్కారాలు పలికాడు జనకమహారాజు. శివధనుర్భంగం విషయం చెప్పి తన కుమార్తెను కోడలిగా స్వీకరించమని కోరతాడు జనకుడు
ప్రతిగృహో దాతృవశః శ్రుతం ఏతత్ మయా పురా।
యథా వక్ష్యసి ధర్మజఞ తత్ కరిష్యామహే వయం ।।
జనకుడి మాటలు విని ధశరథుడు ఏమన్నాడంటే.. అయ్యయ్యో! జనకా.. అలా అంటావేంటి. అసలు ఇచ్చేవాడంటూ ఉంటే కదా పుచ్చుకునేవాడు ఉండేది. నీ కుమార్తెను నా కోడలిగా చేస్తానంటున్నావు. నువ్వు దాతవు. నేను పుచ్చుకునేవాడిని... అంటూ ఎంతో ఆప్యాయంగా జనకుడి ఆహ్వానాన్ని స్వీకరిస్తాడు. అలా వైశాఖ శుద్ధ దశమి ఉత్తర ఫల్గుణి నక్షత్ర శుభముహూర్తాన్ని సీతారాముల కల్యాణానికి వేదమూర్తులు నిర్ణయించారు. ఆకాశమంత పందిరి కింద, భూదేవి అంత వేదిక సిద్ధం చేసి మంగళవాయిద్యాలు, వేద మంత్రాలు నడుమ సీతారాముల కళ్యాణ ముహూర్త ఘడియలు సమీపించగానే..జనకమహారాజు వేదికపైకి వచ్చి..కుమార్తె చేతిని పట్టుకుని రామయ్యకు అప్పగిస్తూ..
ఇయం సీతా మమసుతా సహ ధర్మచరీ తవ ।
ప్రతీచ్ఛ చ ఏనాం భద్రం తే పాణి గృహ్ణీష్వ పాణినా ।
పతివ్రతా మహాభాగా ఛాయా ఇవ అనుగతా సదా ।।
రామయ్యా! ఇదిగో...నా కుమార్తె అయిన సీత. నీకు సహధర్మచారిణిగా స్వీకరించు. నీకు శుభాలు కలుగుతాయి. ఈమె పతివ్రతగా ఉండి, నిత్యం నిన్ను నీడలా అనుసరిస్తుంది అంటూ సీతమ్మ చేతిని రామయ్య చేతికి అందిస్తాడు. అత్తవారింట ఎలా నడుచుకోవాలో అన్ని బోధనలూ ఒక్క శ్లోకంలో చెప్పాడన్నమాట.
Also Read: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!
సీతారాముల కళ్యాణం పుడమికి పులకరింత
రాముడు నీలమేఘశ్యాముడు...నీలవర్ణం ఆకాశ లక్షణం. అంటే రాముడు పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీక
సీతమ్మ నాగలితో భూమి దున్నుతుండగా ఉద్భవించింది..భూమి పంచభూతాల్లో ఒకటి
పంచభూతాల్లో మొదటిదైన భూమికి సీతమ్మ, చివరిదైన ఆకాశానికి రామయ్య సంకేతాలు. ఎప్పుడైతే ఆకాశం భూమిని చేరుతుందో (వాన చినుకుగా మారి) అప్పుడు పుడమి (భూమి) పులకరిస్తుంది. పంటను అందిస్తుంది. ఆ పంట జీవులకు ఆహారంగా మారి శక్తిని ఇస్తుంది. అంటే ఎప్పుడైతే రామయ్య సీతమ్మకు చేరుకుంటాడో అప్పుడు లోకానికి శక్తి వస్తుంది. ఇలా సీతారామకళ్యాణం లోకకళ్యాణానికి కారకంగా, ప్రకృతి పులకరింతకు ప్రతీకగా నిలిచిందన్నమాట.
ఇద్దరూ యజ్ఞ ప్రసాదమే
వాస్తవానికి సీతారాముల ఇద్దరి పుట్టుకా ఒకేలా జరిగింది.. ఇద్దరూ యజ్ఞ ప్రసాదమే. సంతానం కోసం దశరథ మహారాజు చేసిన పుత్రకామేష్ఠి ఫలితంగా లభించిన యజ్ఞపాయస ప్రసాద ఫలితంగా రాముడు కౌసల్య గర్భాన జన్మించాడు. యజ్ఞం చెయ్యటం కోసం భూమిని దున్నే ప్రయత్నంలో నాగలి చాలుకు తగిలి భూమిని నుంచి తనకు తానుగా అయోనిజగా ఆవిర్భవించింది సీతమ్మ. ఇద్దరూ యజ్ఞప్రసాదాలే. అందుకే వారిద్దరి కల్యాణం కూడా లోక కళ్యాణ యజ్ఞానికి పునాదిగా నిలిచింది.