Sri Rama Navami 2023: మనిషిగా జన్మించాక ఎలాగో ఒకలా బతికేయడం కాదు..ఎలా బతకాలో తెలుసుకోవాలి. ఎలాంటి జీవితం గడపాలి, వ్యక్తిత్వం ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, బంధుమిత్రులతో ఎలా మెలగాలి, చుట్టుపక్కలవారితో ఎలా మమేకమవ్వాలి, కష్టసుఖాల్లో ఎలా ముందుకు సాగాలి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి ఇన్ని లక్షణాలు ఒక్కరికే ఉండడం సాధ్యమా అంటే ఈ ప్రశ్నకు ఒకేఒక్క సమాధానం శ్రీరామచంద్రుడు. పేరుకే దేవుడైనా మనిషిగా ఎలా బతకాలో బతికి చూపించాడు దశరథ తనయుడు  శ్రీ రాముడు. సంపూర్ణమైన మనిషి అనిపించే ఒకే ఒక్క రూపం శ్రీరాముడు. భగవంతుడు మానవజన్మ ఎత్తితే ఆ జన్మకు ఏ విధంగా సార్థకత వస్తుందో నిరూపించి చూపించాడు...అలాంటి రాముడిని విగ్రహరూపంలో పూజించి, కళ్యాణం జరిగిన రోజు నాలుగు అక్షింతలు తలపై వేసుకుని వదిలేస్తారా..రామచంద్రుడి నుంచి ఏం నేర్చుకోవాలో తెలుసుకుని అనుసరిస్తారా..!


శ్రీ రాముడికే సొంతమైన ప్రత్యేక గుణాలివే


ఉత్తమ తనయుడు
తండ్రి పట్ల కొడుకు ఎలా ఉండాలో చెప్పడానికి రాముడు ఒక్కడు చాలేమో. తెల్లారితే అయోధ్య రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడవుతాడు. మాహారాజు హోదాలో గౌరవం, భోగం..ఇక జీవితానికి తిరుగేముంది..కానీ తెల్లారేసరికి అడవుల బాట పట్టాడు. తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం జరగాలని, రాముడు వనవాసం చేయాలన్న దశరథుడి మాటగా కైకేయి చెప్పడంతో మారు మాట్లాడకుండా వనవాసానికి వెళ్లిపోయాడు. తండ్రి తనని చూడకుండా  ఉండలేడని తెలిసినప్పటికీ పిన్నమ్మకు తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే వనవాసం చేయకతప్పదు. అందుకే ఎందుకు అని తిరిగి ప్రశ్నించలేదు..మారు మాట్లాడలేదు..అడవుల బాటపట్టాడు.  ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు వనవాసాలు చేయాల్సిన అవసరం లేదు.. చెడు సావాసాలు చేసి తల్లిదండ్రులను క్షోభ పెట్టకుండా చాలు


Also Read: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది, రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలంటారు ఎందుకు!


ఉత్తమ భర్త
ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య.. రాముడు ఏకపత్నీవ్రతుడు అంటారు. పెళ్లి అనే బంధానికి విలువ ఇచ్చి ఒకే స్త్రీతో జీవితం పంచుకోవడం ఈ రోజుల్లో 
చూడగలమా, సాధ్యమా. మూడు ముళ్లు వేసిన స్త్రీతో సంసార బంధంలో కొనసాగుతూ..మరో స్త్రీ గురించి ఆలోచిస్తున్నారు..భార్యను కాకుండా పరాయి స్త్రీలో ఏవో ప్రత్యేకతలు చూసి మురిసిపోతున్నారు. వాస్తవానికి పరాయి స్త్రీ సాంగత్యం మాత్రమే కాదు ఆ ఆలోచన కూడా తప్పే. ప్రస్తుత రోజుల్లో రామచంద్రుడు లాంటి భర్త మన మధ్య ఉంటే చేతులెత్తి నమస్కరించాల్సిందే.. ఆభార్య నిత్యం పాదపూజ చేసినా తప్పులేదేమో...


అహంకారం అలంకారం కాదని చెప్పిన రాముడు
రాజుకు అహంకారం అనేది సహజంగా వచ్చే గుణం. అంటే గొప్పస్థానంలోనో, అధికారంలోనో ఉన్నవారు అహంకారాన్ని కూడా అలంకారంగా భావిస్తారు. స్థాయిని బట్టి సావాసాలు ఉండేలా చూసుకుంటారు. కానీ శ్రీరామచంద్రుడు అలా కాదు..రామయ్యకి ఎలాంటి బేధాలు లేవు. పడవ నడుపుకునే గుహుడిని గుండెలకు హత్తుకున్నాడు. అడవిలో ఉండే వానర రాజు సుగ్రీవుడితో స్నేహం చేశాడు. బంగారులేడి మాయలేడి అని తెలియదా ..రాముడు దేవుడే కదా అంటారేమో..నిజమే కానీ..రాముడు ఎప్పుడూ దేవుడిలా బతకలేదు మనిషిలానే బతికాడు. అందుకే భార్య బంగారులేడి కావాలని అడిగిన వెంటనే ఉన్నపాటుగా వెళ్లాడు. అంటే చుట్టూ అద్భుతంగా కనిపిస్తున్న ప్రపంచంలో మాయ, మిధ్య అనేవి చాలా ఉన్నాయ్..వాటిని గుర్తించకుండా పరుగులుతీస్తే  ఆ తర్వాత బాధపడక తప్పదని అర్థం చేసుకోవాలి.


రాముడికి సాయం అవసరమా!
లంకలో ఉన్న సీతను తీసుకువచ్చేందుకు రాముడు నేరుగా వెళ్లలేడా..మధ్యలో వానరుల సాయం ఎందుకని ప్రశ్నిస్తే..
బంగారు పళ్లానికి అయినా గోడ చేర్పు ఉండాలని చెబుతారు. అంటే ఎంత గొప్పవారైనా నిజమైన స్నేహితుడి సాయం ఉంటే అసాధ్యం అయిన సముద్రం లాంటి కష్టాలను దాటుకుని ఆవలి తీరానికి చేరుకోవడం ఎంతమాత్రం కష్టం కాదని చెప్పడమే. ఎంత గొప్పవాడికి అయినా తనవెంట నమ్మకస్తుడు ఉండాలి. రాముడికి హనుమంతుడిలా. నమ్మిన బంటు అనే మాట అక్కడి నుంచే వచ్చింది.


Also Read: ఈ రాశులవారికి సంపాదన కన్నా ఖర్చులెక్కువ


రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు
స్నేహితుడిని నమ్మడం సాధారణ విషయమే. మరి శత్రువును నమ్మడం సాధ్యమేనా. అంతటి క్షమ రాముడి సొంతం. శత్రువైన రావణుడి తమ్ముడు విభీషణుడు వచ్చి శరణు కోరినప్పుడు వీసమెత్తు కూడా అనుమానించలేదు. శత్రువు తమ్ముడు కదా ఏం ప్రమాదం ఉంటుందో అని ఆలోచించలేదు .. కారణం ఏంటంటే..శరణు అని వచ్చిన శత్రువునైనా అక్కున చేర్చుకోవాలన్న సందేశం అది.  ఆ సమయంలో రాముడిని ఎవరో ప్రశ్నించారట.. రావణుడిని చంపి లంకను ఇస్తా అని విభీషణుడికి మాట ఇచ్చావు కదా..మరి ఆ రావణుడే క్షమించమని వస్తే ఏం చేస్తావని...అప్పుడు రాముడు ఏం చెప్పాడో తెలుసా
 ”అదే జరిగితే రావణుడికి నా అయోధ్య ఇచ్చేస్తా..” 
రాముడి గొప్పతనం గురించి ఇంతకన్నా ఏం చెబుతాం.


భార్యపై అనుమానం కాదు ఆమెకి ఇచ్చిన గౌరవం
ఏ విషయంలోనూ ఎవ్వరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేయకూడదు...వారికి వారుగా నిజం తెలుసుకునేలా చేయాలి. సర్దిచెప్పడం మొదలెడితే చాలా సందేహాలుంటాయి..వారికి వారుగా తెలుసుకుంటే మరో ప్రశ్నకు అవకాశం ఉండదు. లంకలో ఉండొచ్చిన సీతమ్మను ఏలుకుంటున్నాడన్న మాట పడినప్పుడు రాముడు చేసినదిదే. తన భార్య గురించి తనకు తెలియదా..ఎవరో ఏదో అన్నారని ఆమెని అడవుల్లో వదిలేయాలా అంటే...రాజుగా ప్రజల మాటల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రాజ్య ప్రజల మాటను గౌరవించాడు. భార్యకి దూరంగా ఉన్నాడు. అది  సీతపై అనుమానం కాదు..నిజం ఏంటో లోకానికి తెలియాలి కదా. నిందవేసిన నోర్లే సీతమ్మను మహాపతివ్రతగా గుర్తించేలా చేశాడు..


ఇంకా చెప్పుకుంటూ పోతే శ్రీరామచంద్రుడు వేసిన ప్రతి అడుగూ సందేశమే...


"శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే "