Vasant Panchami 2024: మాఘమాసంలో ఐదోరోజు వచ్చే పంచమిని వసంత పంచమిగా జరుపుకుంటారు. దీన్నే శ్రీ పంచమి, సరస్వతి పంచమి అని కూడా అంటారు. దక్షిణాదినే కాదు ఉత్తరాదిన కూడా శ్రీ పంచమిని విశేషంగా జరుపుకుంటారు. ఈ ఏడాది (2024) వసంత పంచమి ఫిబ్రవరి 14 బుధవారం వచ్చింది. 


ఇసుకతో అమ్మవారిని ప్రతిష్టించిన రోజు


వసంత పంచమి రోజే బాసరలో వ్యాసమహర్షి ఇసుకతో అమ్మవారిని ప్రతిష్టించాడని చెబుతారు. ఈ శ్రీ పంచమి రోజు విద్యాభ్యాసం చేస్తే ..ఆ పిల్లలు ఉన్నత విద్యావంతులు అవుతారని విశ్వాసం.  అందుకే చాలామంది తల్లిదండ్రులు వసంతపంచమి రోజు బాసరలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధిని పొందుతారు. ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో వచ్చే గుప్త నవరాత్రుల్లో పంచమి తిథిరోజు సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేయడం వెనుకున్న ఉద్దేశం ఇదే.


Also Read: ఈ రోజు ఈ రాశులవారి ప్రయత్నాలు ఫలిస్తాయి, ఫిబ్రవరి 14 రాశిఫలాలు


బాసరగా మారిన వ్యాసర


సరస్వతి దేవి కొలువైన బాసరలో..వసంతపంచమి వేడుకలు మరింత ప్రత్యేకం. బ్రహ్మాండ పురాణంలో బాసర స్థల మహత్యం  గురించి ఉంటుంది. అందులో ప్రముఖంగా వినిపించే కథ వ్యాసుడిది. కురుక్షేత్ర సంగ్రామంతో మనసు చలించిపోయిన వ్యాసుడు ప్రశాంతంగా తపస్సుని ఆచరించేందుకు గోదావరీ తీరంలో మధ్య భాగమైన బాసరకు చేరుకున్నాడు.  గోదావరిలో స్నానమాచరిస్తుండగా వ్యాసులవారికి సరస్వతి సాక్షాత్కరించి ఇసుకతో తన విగ్రహాన్ని రూపొందించమని చెప్పింది. అమ్మవారి ఆజ్ఞ మేరకు వ్యాసుడు నిత్యం పిడికెడు ఇసుకను తీసుకుని నిదానంగా ఓ విగ్రహాన్ని రూపొందించాడు. అదే ఇప్పుడు కనిపించే మూలవిరాట్టు అని  చెబుతారు.  ఆ మూలవిరాట్టుకి నిత్యం పసుపు రాస్తూ సరికొత్త రూపుని భక్తులు దర్శించుకునేలా చేస్తున్నారు పూజారులు. అమ్మవారి విగ్రహానికి సమీపంలోనే మహాలక్ష్మి, మహాకాళి విగ్రహాలు కొలువై ఉంటాయి. ఇలా ముగ్గురమ్మలూ ఓ చోట కొలువై ఉండటం కూడా చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆలయంలోని విగ్రహం వ్యాసుల వారి చేతిలో రూపొందింది కనుక ఈ ప్రదేశానికి వ్యాసర అన్న పేరు ఉండేది..కాలక్రమేణా వ్యాసర బాసరగా మారింది.


lso Read: మనిషిని బతికించేంత శక్తి ఉంది ప్రేమకు - ఇదిగో ప్రూఫ్!


సరస్వతీ దేవి చేతుల్లో ఆయుధాలు ఉండవెందుకు!


సరః అంటే కాంతి..కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ దేవి. తెల్లని పద్మంలో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. సాధారణంగా దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. కానీ సరస్వతీ దేవి రూపులో ఎక్కడా ఆయుధాలు కనిపించవు. జ్ఞానమే ఆమె ఖడ్గం, సంగీతమే ఆమె సాధనం, ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం. అందుకే పుస్తకం, వీణలను చేతపట్టి ధవళ వస్త్రాలతో కనిపిస్తుంది. తత్వ విచారానికీ, పరిపూర్ణ వ్యక్తిత్వానికీ చిహ్నమైన కమలం మీద ఆశీనురాలై ఉంటుంది. అందుకే జ్ఞానాన్ని ఆశించే ప్రతి ఒక్కరూ  ‘సరస్వతీ నమస్తుభ్యం’ అంటూ ఆమెకు తొలిపూజలందిస్తారు.


Also Read:  ఎవరీ రతీ మన్మధులు - వీరి ప్రేమకథ ఎందుకంత ప్రత్యేకం!


ఉత్తరాదిన వసంతపంచమి


ఉత్తరాదిన కూడా వసంత పంచమిని వేడుకగా చేసుకుంటారు. పశ్చిమ బెంగాల్ లో సరస్వతి విగ్రహానికి మూడురోజులు పూజలు చేసి ఆఖరు రోజు గోదావరి నదిలో నిమజ్జనం చేస్తారు.పంజాబ్,బిహార్ రాష్ట్రాల్లో దీనిని పంతంగుల పండుగగా జరుపుకుంటారు.  వసంత పంచమి రోజు పసుపు రంగుకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో వసంత పంచమినే కామదేవ పంచమి అని కూడా అంటారు. రతి దేవి, కామదేవుడు వసంత ఋతువు వచ్చిన ఆనందంలో రంగులు జల్లుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారట. అందుకే దేశం లోని కొన్ని ప్రాంతాల వారు ఈ పంచమి రోజు రంగులు జల్లుకుంటారు. 
Also Read: రాక్షసిని దేవతగా మార్చిన అద్భుతమైన ప్రేమకథ!