Love Story of Hidimbi  and Bhima : మహాభారతంలో ఎన్నో ప్రేమకథలున్నాయి. ప్రతి ప్రేమకథా అద్భుతమే.. ఆ ప్రేమికులంతా పోరాడి ప్రేమను గెలిచినవారే. తొలిచూపులో ప్రేమలో పడినప్పటి నుంచి ఆఖరి శ్వాస వదిలేవరకూ ఆ ప్రేమని నిలబెట్టుకున్నవారే. ఇలాంటి ప్రేమకథల్లో ఒకటి భీముడు - హిడింబి. 


తొలిచూపులోనే...


అరణ్యవాసంలో భాగంగా పాండవులు లక్కఇంటిలో నివాసం ఉంటారు. ఈ ఇంటికి నిప్పంటుకున్న సమయంలో అక్కడి నుంచి తప్పించుకుని అడవిలోకి వెళ్తారు పాండవులు. అంతా నిద్రపోతుంటే భీముడు కాపలా కాస్తూ ఉంటాడు. వాసనతోనే వాళ్లను గుర్తుపట్టిన రాక్షసుడైన హిడింబాసురుడు.. తన చెల్లెలు హిడింబిని పంపించి వాళ్ల వివరాలు కనుక్కోమంటాడు. అన్న ఆజ్ఞ మేరకు పాండవులు ఉన్న ప్రదేశానికి వెళ్లిన హిడింబి... తొలిచూపులోనే భీముడితో ప్రేమలో పడుతుంది. తనపై ఉన్న ప్రేమతో.. మా అన్న వల్ల మీకు ముప్పు ఉంది..ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోమని హెచ్చరిస్తుంది. ఆ తర్వాత హిడింబాసురిడితో యుద్ధం చేసి చంపేస్తాడు భీముడు. 


Also Read: ఫిబ్రవరి 14 వసంతపంచమి - శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి!


మనసులో మాట చెప్పిన హిడింబి


తానొక స్త్రీ అనే బిడియం లేకుండా తన మనసులో మాట భీముడికి తెలియజేస్తుంది హిడింబి. తక్షణమే అంగీకరించని భీముడు ఆ తర్వాత హిడింబి ప్రేమకు తలొంచుతాడు..అదే సమయంలో ఓ కండిషన్ పెడతాడు. నీతో కొంతకాలమే కలిసి ఉంటాను, తర్వాత మేం వెళ్లిపోతాం అంటాడు. ఆ షరతులకు అంగీకరించిన హిడింబి..భీముడిని గాంధర్వ వివాహం చేసుకుంటుంది. వీరి ప్రేమకు గుర్తుగా పుట్టిన వాడే ఘటోత్కచుడు.


ఉత్తమ ప్రేమికురాలు -  ఆదర్శనీయమైన తల్లి


హిడింబి కేవలం ఉత్తమ ప్రేమికురాలే కాదు. ఆదర్శనీయమైన తల్లి కూడా. హిడింబితో కొంతకాలం కలసున్న భీముడు..ఘటోత్కచుడు జన్మించిన తర్వాత ఆమెను అడవిలోనే వదిలేసి..తల్లి,సోదరులతో కలసి అజ్ఞాతవాసానికి వెళ్లిపోతాడు. భీముడికి ఇచ్చిన మాట ప్రకారం వారివెంట వెళ్లకుండా ఉండిపోయిన హిడింబి... మాయలు, మంత్రాలు, యుద్ధ విద్యల్లో ఘటోత్కచుడిని గొప్పవాడిగా తీర్చిదిద్దుతుంది. అనుక్షణం పాండవుల గొప్పదనం గురించి చెబుతూ వారిపై అభిమానం కలిగిలా చేస్తుంది. అవసరం అయినప్పుడు పాండవులకు సహాయం చేయమన్న తల్లి ఆజ్ఞ మేరకు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పక్షాన పోరాడి ప్రాణాలు కోల్పోయాడు ఘటోత్కచుడు. 


Also Read: ఫిబ్రవరి 14 న మీ పిల్లలతో ఈ శ్లోకాలు చదివించండి!


మనాలిలో హిడింబి మాతా దేవాలయం


ఘటోత్కచుడు పెరిగి పెద్దవాడై రాజ్యపాలనాభారాన్ని తీసుకునే వరకూ తనయుడితో పాటూ ఉన్న హిండింబి ఆ తర్వాత హిమాలయాలకు వెళ్లిపోయింది. అక్కడ తపస్సు చేసి అనేక దివ్యశక్తులను పొందింది. హిమాచల్‌ప్రదేశ్‌ మనాలి ప్రాంతవాసులు హిడింబిని దైవంగా భావిస్తారు. అమ్మగా కొలుస్తారు. హిమాచల్‌ప్రదేశ్‌లో కొలువైన హిడింబి మాతా దేవాలయంలో ఏటా వసంతరుతువులో దూంగ్రీ మేళా పేరుతో మూడురోజుల పాటూ  కన్నుల పండువగా ఉత్సవం జరుపుకుంటారు. ఈ హిడింబి మాత దేవాలయాన్ని మహారాజా బహదూర్‌సింగ్ నిర్మించారు. దట్టమైన దేవదారు వృక్షాల మధ్య ఉన్న ఈ ఆలయంలో ఎప్పుడూ ఓ అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది. తమకు ఎలాంటి సమస్య ఎదురైనా ఎలాంటి ఆపద సంభవించినా ప్రజలు హిడింబామాతను వేడుకుంటారు. ఏడాదిలో కొన్ని రోజులు మినహా మిగిలిన కాలమంతా హిడింబి ఆలయంలో మంచుపేరుపోయి ఉంటుంది. ఈ ఆలయంలోపల ఓ పెద్దరాయి మీద ఆమె పాదముద్ర కూడా ఉంది. ఈదేవాయలం శిఖరం ఎత్తు 24 మీటర్లు. గుడి ద్వారాలు కూడా చక్కటి నగిషీలతో ఆకర్షణీయంగా ఉంటాయి. గర్భగుడిలో హిడింబామాత విగ్రహం మూడు అంగుళాల ఎత్తు మాత్రమే ఉంటుంది. ఈ గుడికి 70 మీటర్ల దూరంలో హిడింబి మాత కుమారుడు ఘటోత్కచుడి ఆలయం ఉంటుంది. 


Also Read: ఫిబ్రవరి 14న మీ రాశిప్రకారం చేయాల్సిన పరిహారాలివే!