BRS Meeting: తెలంగాణలో అధికార పార్టీపై అప్పుడే సమర శంఖం పూరించబోతున్నారు మాజీ సీఎం,బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్. నేడు నల్గొండ వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడాన్ని నిరసిస్తూ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా కేసీఆర్ జనంలోకి వస్తున్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడ బైపాస్ రోడ్డులో సాయంత్రం మూడు గంటలకు సభ ప్రారంభం కానుంది. రైతు గర్జన పేరిట ఈ సభను బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసింది. ఎన్నికల తర్వాత కేసీఆర్ ఎక్కడా బహిరంగంగా మాట్లాడింది లేదు. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన స్పందించలేదు. ఇప్పుడు ఇవాళ్టి సభలో ఏం మాట్లాడతారో అన్న ఆసక్తి అందరిలో ఉంది.
కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకొస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అంగీకరించాయి. అయితే ఇది తెలంగాణలో రాజకీయంగా పెను దుమారాన్ని రేపింది. దీన్నే ప్రచారాస్త్రంగా మలుచుకున్న బీఆర్‌ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. లోక్‌సభ ఎన్నికలు ఉన్న వేళ దీన్ని మరింత సాగదీసే ఉద్దేశం లేని ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కూడా కేంద్రానికి అప్పగించడం లేదని ప్రకటించింది. అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది.
దీన్ని కూడా బీఆర్‌ఎస్ తనకు అనుకూలంగా మార్చుకుంది. ఇది తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ విజయమని పేర్కొంది. నల్గొండ సభ ఉన్నందునే మిగతా బిజినెస్‌ను పక్కన పెట్టి దీనిపై చర్చించారని ఆరోపించింది. ఈ క్రమంలోనే ప్రాజెక్టుల అంశం అసెంబ్లీలో పెద్ద చర్చకే దారి తీశాయి. రెండు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగిస్తున్నారన్న కారణంతోనే నల్గొండ సభకు పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్... అక్కడ ఏం తీర్మానం చేయనుందో చూడాలి. దీనికి రైతు గర్జన అని పేరు పెట్టుకున్న బీఆర్‌ఎస్... ప్రాజెక్టులపై అల్టిమేటం ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. నదీ జలాలపై ఫోకస్ పెట్టబోతున్నట్టు సమాచారం అందుతోంది. ఆరు నెలల్లో నదీ జలాల పంపకాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని గడువు ఇచ్చే అవకాశం ఉంది. అప్పటికి కొత్త ప్రభుత్వానికి కావాల్సినంత టైం ఇచ్చినట్టు అవుతుందని తర్వాత మరోసారి పోరుబాటు పట్టవచ్చని అంటున్నారు.
సభలో చర్చకు కేసీఆర్ రావాలంటూ అధికార పక్షం పట్టుబడుతోంది. అదే టైంలో ఆయన వస్తే మీరు తట్టుకోలేరంటూ బీఆర్‌ఎస్ హెచ్చరిస్తోంది. ఇప్పుడు నల్గొండ వేదిక నుంచి కేసీఆర్ గర్జన ఏ స్థాయిలో ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది. ఓవైపు అధికారం కోల్పోయి నిరాశలో ఉన్న కేడర్‌ను మరోసారి లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం చేసే పని కూడా కేసీఆర్ చేయబోతున్నట్టు సమాచారం. అందులో భాగంగానే బహిరంగ సభను ఏర్పాటు చేశారని అంటున్నారు.