Age Limit for Telangana Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వయోపరిమితిని 44 సంవత్సరాల నుంచి 46 ఏళ్లకు పెంచింది. అయితే యూనిఫామ్ సర్వీసులకు మాత్రం మినహాయింపునిచ్చింది. వయోపరిమితి నుంచి సడలింపు ఇచ్చింది. ఈ మేరకు నిర్దేశించిన గరిష్ట వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో గ్రూప్-1 సహా చాలా పోటీ పరీక్షల కోసం నిరుద్యోగ యువత ఎదురుచూస్తోంది. అయతే ఐతే ప్రశ్నపత్రాల లీకేజీల వల్ల, పరీక్షల నిర్వహణ వాయిదా పడుతోంది. దాంతో వారి వయసు పెరిగిపోతోంది. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో.. వయసు పెరిగినా, అభ్యర్థులు, పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు వీలు కలగనుంది. 


ప్రభుత్వం అన్ని విషయాలన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత.. రెండేళ్లు పెంచాలని నిర్ణయం తీసుకుంది. గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాల నుండి 46 సంవత్సరాలకు పెంచింది. యూనిఫాం సేవలకు కాకుండా.. మిగతా పోస్టులకు రెండు సంవత్సరాల కాలం ఈ వర్తింపు ఉంటుందని పేర్కొంది. ఈ నియమం ఏ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం వర్తించదు.. పోలీసు, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖలు మొదలైన యూనిఫాం సేవలకు వర్తించదు.


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఖాళీల భర్తీకి సంబంధించి కొన్ని హామీలు ఇచ్చింది. ఐతే.. హామీల అమలు కొంత ఆలస్యమయ్యేలా ఉంది. అందువల్ల ఉద్యోగం కోసం ఎదురుచూసే వారు, కొత్త ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం చూస్తున్నారు. ఐతే.. వారికి ఏజ్ పరిమితి పెరిగిపోయే ప్రమాదం ఉండటంతో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏజ్ లిమిట్‌ని 44 ఏళ్ల నుంచి, 46 ఏళ్లకు పెంచింది. అందువల్ల నిరుద్యోగులు కొంత ఉపశమనం పొందుతారు. ఇక వారు తమ లక్ష్యాలు సాధించేందుకు వీలు కలగనుంది.


కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి తొందర్లోనే మెగా డీఎస్సీ, గ్రూప్స్ నోటిఫికేషన్, పోలీస్ రిక్రూట్మెంట్ కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం వయో పరిమితి పెంచడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి లైన్‌క్లియర్‌..
తెలంగాణ వచ్చి పదేళ్లు కావొస్తున్నా ఇప్పటివరకూ ఒక్కసారి కూడా గ్రూప్–1 పోస్టులను గత ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఈ క్రమంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ పై కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకుంది. గ్రూప్ 1 పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని గత ఏడాది హైకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కానీ ప్రస్తుతం మారిన పరిస్థితులతో కొత్తగా ఏర్పాటైన చైర్మన్, సభ్యులు గ్రూప్ 1పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు మరో వ్యాజ్యం సుప్రీంలో దాఖలు చేసినట్లు సమాచారం. దాంతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. మరోవైపు గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి పోస్టుల సంఖ్యను ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన 503 గ్రూప్-1 నోటిఫికేషన్‌కు అదనంగా మ‌రో 60 పోస్టులను భ‌ర్తీ చేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 563కి చేరినట్లయింది.