Tovino Thomas latest movie Anweshippin Kandethum review in Telugu: టోవినో థామస్ తెలుగు ప్రేక్షకులు కొందరికి తెలుసు. వంద కోట్లకు పైగా వసూలు చేసిన ఆయన మలయాళ హిట్ '2018'ను తెలుగు డబ్బింగ్ చేశారు. థియేటర్లలో మంచి పేరు తెచ్చుకుంది. సూపర్ హీరో సినిమా 'మిన్నల్ మురళి'కి తెలుగులో ఫ్యాన్స్ ఉన్నారు. టోవినో థామస్ మలయాళ సినిమాలను ఆహా ఓటీటీ డబ్బింగ్ చేసి తెలుగు వీక్షకుల ముందుకు తీసుకొచ్చింది. టోవినో థామస్ హీరోగా నటించిన లేటెస్ట్ మలయాళ సినిమా 'అన్వేషిప్పిన్ కండతుమ్'. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.


కథ: ఆనంద్ నారాయణ్ (టోవినో థామస్) సబ్ ఇన్‌స్పెక్టర్. అతని స్టేషన్ పరిధిలో ఓ అమ్మాయి మిస్సింగ్ కేసు నమోదు అవుతుంది. హంతకుడిని ఆనంద్ & టీం పట్టుకుంటుంది. అయితే... అనూహ్య పరిణామాల కారణంగా వాళ్లందరూ సస్పెండ్ అవుతారు. జనం ముందు ఆనంద్ దోషిగా నిలబడాల్సి వస్తుంది. కొన్నాళ్లకు ఎస్పీ (సిద్ధిఖీ) ఆనంద్ & టీంను పిలిచి మరో కేసు అప్పగిస్తారు. లోకల్ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్, సిట్ టీం ఇన్వెస్టిగేషన్ చేసినా... శ్రీదేవి (అర్తన బిను) మర్డర్ కేసును సాల్వ్ చేయలేకపోతారు.


శ్రీదేవి హంతకులు ఎవరో గనుక పట్టుకోగలిగితే ముందు జరిగిన కేసును జనం మర్చిపోతారని ఎస్పీ చెబుతారు. శ్రీదేవి కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్లిన ఆనంద్ & టీంకు ఆ ఊరి ప్రజలు ఎందుకు సహకరించలేదు? అమ్మాయి మిస్సింగ్ కేసులో ఆనంద్ & టీం ఎందుకు సస్పెండ్ అయ్యింది? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ: ఒక్క టికెట్టు మీద రెండు సినిమాలు... 'అన్వేషిప్పిన్ కండతుమ్' థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కలిగే ఫీలింగ్. టోవినో థామస్ క్యారెక్టర్ మారలేదు. కానీ, ఇంటర్వెల్ ముందు - వెనుక... రెండు కథలు చెప్పారు దర్శక రచయితలు డార్విన్ కురియాకోస్, జిను అబ్రహం. అయితే... రెండు కథల్లో కామన్ పాయింట్ ఏమిటంటే? ఎంగేజ్ చేసే ఇన్వెస్టిగేషన్!


'అన్వేషిప్పిన్ కండతుమ్'లో హీరో పోలీస్ ఆఫీసర్. అయితే... మాస్ మూమెంట్స్ ఒక్కటీ ఉండదు. సాధారణ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారో? అలా టోవినో థామస్ పాత్రను చూపించారు. కథ, కథనం, నటీనటుల పెర్ఫార్మన్స్ మీద కాన్సంట్రేషన్ ఎక్కువ చేశారు. పోలీస్ వ్యవస్థలో లోపాలను ప్రస్తావిస్తూ... న్యాయం కోసం యంగ్ పోలీస్ ఎంతలా తపన పడ్డాడు? అనేది ఆసక్తిగా చూపించారు.


ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ప్రేక్షకులకు కొత్త కాదు. రెగ్యులర్‌గా ఆ జానర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు నెక్స్ట్ ట్విస్ట్ ఏమిటో గెస్ చేయడం పెద్ద కష్టం కూడా కాదు. 'అన్వేషిప్పిన్ కండతుమ్'లో స్పెషాలిటీ ఏమిటంటే... ప్రేక్షకుల ఊహకు అందని ట్విస్టులు సర్‌ప్రైజ్ చేస్తాయి. ఫస్టాఫ్‌లో లిల్లీ మర్డర్ కేసులో గానీ... సెకండాఫ్‌లో శ్రీదేవి మర్డర్ కేసులో గానీ... ఫలానా వ్యక్తి హంతకుడు అని భావిస్తే? అతడు కాదు, మరొకరు అంటూ దర్శక, రచయితలు సర్‌ప్రైజ్ చేశారు. సహజత్వానికి దగ్గరగా సినిమా తీశారు. 


ఫస్టాఫ్ సాగినంత వేగంగా సెకండాఫ్ ముందుకు వెళ్లలేదు. ఇన్వెస్టిగేషన్స్‌లోనూ ట్విస్ట్స్ బావున్నాయి. ఆ ట్విస్ట్స్ వచ్చే వరకు కొన్ని రొటీన్ సీన్స్ కూడా ఉన్నాయి. స్క్రీన్ ప్లేలో స్పీడ్ పెంచితే రేసీగా సినిమా ముందుకు వెళుతూ మరింత థ్రిల్ ఇచ్చేది. టెక్నికల్ విషయాలకు వస్తే... సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం బావుంది. ఆ కథకు అవసరమైన మేరకు చేశారు. సినిమాటోగ్రఫీ బావుంది. ప్రొడక్షన్ డిజైన్‌లో కథా నేపథ్యాన్ని, 1990 కాలాన్ని చక్కగా ఆవిష్కరించారు.


ఆనంద్ నారాయణన్ పాత్రలో టోవినో థామస్ నటన ఆకట్టుకుంటుంది. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఏ దశలోనూ క్యారెక్టర్ పరిధి దాటి బయటకు వెళ్ళలేదు. ఓ సాధారణ ఎస్సై మాత్రమే ప్రేక్షకులకు కనిపిస్తారు. తన ఇమేజ్, హీరోయిజం ఆ పాత్ర మీద పడకుండా, డామినేట్ చేయకుండా చూసుకున్నారు. టోవినో ఫిజిక్ ప్లస్ అయ్యింది. రాజ్ తరుణ్ 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' హీరోయిన్ అర్తన బిను ఈ సినిమాలో శ్రీదేవి రోల్ చేశారు. అందంగా, అమాయకంగా కనిపిస్తూ... ఆ పాత్రకు న్యాయం చేశారు. సిద్ధిఖీ, ఇంద్రాస్ మినహా మిగతా నటీనటుల్లో కొత్త వాళ్లు ఎక్కువ.


Also Read: ట్రూ లవర్ రివ్యూ: 'గుడ్ నైట్' హీరో కొత్త సినిమా - హిట్టా? ఫట్టా?


క్రైమ్ డ్రామా, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చూడాలని కోరుకునే ప్రేక్షకులకు 'అన్వేషిప్పిన్ కండతుమ్' బెస్ట్ ఆప్షన్. రెండున్నర గంటలు ఎంగేజ్ చేస్తుంది. టోవినో థామస్, అర్తన బినుతో పాటు మిగతా ఆర్టిస్టులు పెర్ఫార్మన్స్, సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం, ట్విస్టులు మంచి శాటిస్‌ఫ్యాక్షన్ ఇస్తాయి. ఇటీవల వచ్చిన రియలిస్టిక్ క్రైమ్ డ్రామాల్లో 'అన్వేషిప్పిన్ కండతుమ్' ఒకటిగా నిలుస్తుంది.


Also Readలాల్ సలామ్ రివ్యూ: రజనీకాంత్‌ది ప్రత్యేక పాత్రనా? ఫుల్ లెంత్ పాత్రనా? సినిమా ఎలా ఉంది?