Farmers Protest Updates: డిమాండ్ల సాధన కోసం గళమెత్తిన రైతులు నేడు ఢిల్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఓవైపు రైతుల ప్రకటన మరోవైపు పోలీసుల హై అలర్ట్ అన్నీ కలిపి దేశ రాజధానిలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అన్నదాతల ప్రయత్నాలను పూర్తిగా అడ్డుకొని ఆందోళనలు భగ్నం చేయాలని భద్రతా సిబ్బంది మూడు రోజుల నుంచి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అదే స్థాయిలో రైతులు కూడా వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. 






ఢిల్లీలో ర్యాలీలు, ప్రదర్శనలు పూర్తిగా నిషేధించారు. సిటీలో ట్రాక్టర్లు పూర్తిగా నిషేధించారు. నెల రోజుల పాటు 144 సెక్షన్ పెట్టారు. మార్చి 12 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్‌ తెలిపారు. రైతులు చేపట్టే చలో ఢిల్లీకి అనుమతి లేదంటున్న అధికారులు... అలా ఎవరైనా వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 






ఉత్తర్వులు ఇచ్చి ఆగిపోకుండా రైతు సంఘాలు ఢిల్లీ వైపు రాకుండా చర్యలు కూడా తీసుకున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భారీగా కట్టడి చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ వచ్చే రోడ్లలో ఫుల్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా ప్రాంతాల్లో రోడ్లను తవ్వేశారు. మరికొన్ని చోట్ల రోడ్లకు అడ్డంగా మూడు అడుగుల మేర గోడలు కూడా కట్టారు. వాటికి ఇనప కంచెలు పెట్టారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. 
ఢిల్లీలోని మూడు సరిహద్దుల్లో (టిక్రీ బోర్డర్, సింఘు బోర్డర్, యూపీ గేట్) వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. మంగళవారం నుంచి సింఘు సరిహద్దు వద్ద అన్ని రకాల వాహనాల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


భూసేకరణలో తీసుకున్న భూములకు పరిహారం పెంచడం, పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ తీసుకురావడంలాంటి డిమాండ్లతో ఈసారి రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్‌ మోర్చాతోపాటు ఇతర రైతు సంఘాలు పార్లమెంట్ ఎదుట నిరసనలకు ప్రయత్నాలు చేశాయి. యూపీ, హర్యానా, పంజాబ్‌కు చెందిన రైతులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చాయి. ట్రాక్టర్లతో భారీగా ర్యాలీగా వచ్చి పార్లమెంట్‌ ముందు కూర్చుంటామని హెచ్చరించారు. 






రైతు సంఘాల హెచ్చరికతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఓ వైపు కట్టడి చర్యలు తీసుకుంటూనే వారితో చర్చలు కూడా చేసింది. కేంద్రమంత్రులు పీయూష్ గోయల్‌, అర్జున్ ముండా వారితో మంతనాలు జరిపారు. రెండు సార్లు జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు.






పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ"మంత్రులతో సమావేశం సుమారు 5 గంటల పాటు సాగింది. వారి ముందు ఒక ఎజెండాను ఉంచాం. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. ఆందోళనను ఆపడానికి ప్రభుత్వం మమ్మల్ని సమయం అడుగుతోంది, కానీ వారు రెండేళ్ల క్రితం రైతుల ఆందోళన ముగిసినప్పుడు మమ్మల్ని సమయం అడిగారు. ఇప్పుడు సమయం ఇవ్వడం సరికాదని భావించాం. బలమైన ప్రతిపాదన ఉంటే సమయం ఇవ్వడం గురించి ఆలోచించవచ్చు కానీ వారి వద్ద ఏమీ లేదన్నారు.