Red Sea: ఎర్ర సముద్రంలో సంక్షోభం (Red Sea Crisis) కొనసాగుతూనే ఉంది. హౌతీ ఉగ్రవాదుల దాడులతో సరుకుల రవాణాకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఫలితంగా చాలా వరకూ వెజిల్స్ సౌతాఫ్రికా మీదుగా తమ దారిని మళ్లించుకుంటున్నాయి. ఇది దూరాభారంతో పాటు ధరాభారాన్ని పెంచనుంది. ముఖ్యంగా యాపిల్స్ ధరలు విపరీతంగా పెరగనున్నాయి. ఇప్పటికే భారత్‌లో వాతావరణ మార్పుల కారణంగా యాపిల్స్‌,నారింజ పండ్ల ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. ఫలితంగా ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడు భారత్‌కి వచ్చే దిగుమతుల ఖర్చులూ పెరగడం వల్ల ధరలు మరింత భారం కానున్నాయి. ఎర్ర సముద్రం మీదుగా కాకుండా సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్ మీదుగా ఈ కంటెయినర్‌లు వస్తున్నాయి. ఇవి ముంబయికి చేరుకోవాలంటే చాలా సమయం పడుతుంది. దూరం కూడా ఎక్కువే. 21 టన్నుల యాపిల్స్ మోసుకొచ్చే ఒక్కో వెజిల్‌కి కనీసం 2-3వేల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం యాపిల్స్‌పై ప్రభుత్వం 50% దిగుమతి సుంకం వేస్తోంది. ఇది కలుపుకుని ఆ 21 టన్నుల యాపిల్స్ ఖర్చు 4,500 డాలర్లకు పెరుగుతుంది. 


ఇక యాపిల్స్ ఎక్కువగా పండే హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈ సారి వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఫలితంగా ఈ పంటసాగుపై ప్రతికూల ప్రభావం పడింది. ఇలాంటి సమయాల్లోని భారత్ దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. టర్కీ, అమెరికా, ఈజిప్ట్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ముంబయి లాంటి ప్రధాన నగరాల్లో ఇప్పటికే యాపిల్స్ ధరలు మండి పోతున్నాయి. అటు నారింజ పండ్ల ధరలూ ఇదే విధంగా పెరుగుతున్నాయి. ఈజిప్ట్, టర్కీ నుంచి భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. టర్కీ నుంచి యాపిల్స్‌ విషయానికొస్తే 18కిలోల బాక్స్‌ ధర రూ.2,200-2,300 వరకూ పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. రిటైల్ మార్కెట్‌లో కిలో యాపిల్స్ ధర రూ.200 కిలోల వరకూ పలుకుతోంది. ఈ సారి దేశీయంగా పడిన నారింజ పండ్లకు పెద్దగా డిమాండ్ ఉండడం లేదు. నాణ్యత సరిగ్గా లేకపోవడం వల్ల విక్రయాలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. రిటైల్ మార్కెట్‌లో నారింజ పండ్ల కిలో ధర రూ.150-180 వరకూ ఉంటోంది. ఈ ఏడాదంతా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. 


ఎర్ర సముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభంతో లక్షల కోట్ల డాలర్ల నష్టం జరిగే ప్రమాదముందన్న అంచనాలున్నాయి. చమురు మోసుకొస్తున్న ఓడలపై హౌతీలు దాడులు చేస్తున్నారు. ఫలితంగా...అవి నడి సముద్రంలో చిక్కుకుపోయాయి. ఈ దాడుల కారణంగా చమురు సరఫరాకి అంతరాయం కలుగుతోంది. ఈ పరిణామాలపై.. World Economic Forum అధ్యక్షుడు బార్జ్ బ్రెండే కీలక వ్యాఖ్యలు చేశారు. డిమాండ్‌కి తగ్గట్టుగా సప్లై లేకపోవడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు 10-20% మేర పెరిగే ప్రమాదముందని బాంబు పేల్చారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.Suez Canal ని మూసేయడం వల్ల అంతర్జాతీయంగా చమురుతో పాటు నిత్యావసర సరుకుల సరఫరాకి అంతరాయం కలుగుతుందని...వాటి ధరలు అమాంతం పెరిగొచ్చని అంచనా వేశారు. 


Also Read: Bihar Floor Test: బలపరీక్షలో నెగ్గిన నితీశ్ సర్కార్, అసెంబ్లీ నుంచి విపక్షాలు వాకౌట్