Nitish Kumar Wins Floor Test:
బలపరీక్షలో నితీశ్ ప్రభుత్వం విజయం సాధించింది. నితీశ్‌కి మద్దతుగా 129 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీలో మొత్తం 243 నియోజకవర్గాలున్నాయి. ఇందులో 122 వస్తే మ్యాజిక్ ఫిగర్ సాధించినట్టు లెక్క. నితీశ్‌కి 129 మంది మద్దతు రావడం వల్ల విజయం సాధించినట్టు ప్రకటించారు. అయితే..ఈ బల పరీక్ష జరిగే ముందు అసెంబ్లీ స్పీకర్‌ని తొలగించే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్ అవాద్ బిహారీ చౌదురిని తొలగించారు. ఈ స్పీకర్‌ని తొలగించే విషయంలో 125 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేయగా...వ్యతిరేకంగా 112 ఓట్లు వచ్చాయి. ఈ బలపరీక్ష జరిగే ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు NDA కూటమిలోకి జంప్ కాకుండా ఆ పార్టీ జాగ్రత్తపడింది. హైదరాబాద్ కేంద్రంగా రిసార్ట్ రాజకీయాలు నడిపింది. అటు బీజేపీ నేత నిత్యానంద్ రాయ్ కూడా 78 మంది ఎమ్మెల్యేలను పట్నాలోని ఓ హోటల్‌లో ఉంచారు. నితీశ్ కుమార్ JDU పార్టీ 40 మంది ఎమ్మెల్యేలను మరో హోటల్‌లో ఉంచి జాగ్రత్తగా కాపాడుకుంది. అంతకు ముందు రోజు జేడీయూ నేతృత్వంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశానికి ముగ్గురు నలుగురు హాజరు కాకపోవడం ఉత్కంఠ పెంచింది. NDA,JDU కూటమి బలపరీక్ష నెగ్గదంటూ అటు కాంగ్రెస్, RJD పార్టీలు తెగేసి చెప్పాయి. కానీ...బీజేపీ, జేడీయూ మంతనాలు జరిపి ఆ ఎమ్మెల్యేలనూ అసెంబ్లీ వరకు రప్పించింది. తమకు అనుకూలంగా ఓట్లు వేసేలా వ్యూహాలు రచించింది.
తేజస్వీ యాదవ్‌పై నితీశ్‌పై ఫైర్..
బల పరీక్ష నెగ్గిన తరవాత ముఖ్యమంతి నితీశ్ కుమార్ మహాఘట్‌బంధన్ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. RJD పాలనలో రాష్ట్రంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆ హయాంలో జరిగిన అవినీతిపై ప్రస్తుత NDA కూటమి కచ్చితంగా విచారణ చేపడుతుందని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ప్రతి వర్గం సంక్షేమం కోసం పని చేస్తామని స్ఫష్టం చేశారు. RJD హయాంలో రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నా వాటన్నింటినీ పట్టించుకోలేదని మండి పడ్డారు. అప్పుడు ఏం చేశారంటూ తేజస్వీ యాదవ్‌ని ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. కేవలం డబ్బులు సంపాదించుకోడం తప్ప చేసిందేమీ లేదని ఆరోపించారు.