Kurnool News: తరతరాలుగా ఉన్న కక్షలు, కార్పణ్యాలు..ఆధిపత్య పోరులో ప్రాణాలు కోల్పోయినవారు ఎందరో..ఒకప్పుడు బాంబుల గడ్డగా పేరుగాంచిన  ఆ పోరుగడ్డలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఫ్యాక్షన్ గొడవలు తగ్గి ఆళ్లగడ్డలో  సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు...మళ్లీ ఒకరమైన ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ(YCP) నుంచి ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి(Gangula Brijendra Reddy) , తెలుగుదేశం నుంచి మరోసారి భూమా అఖిలప్రియా(Akila Priya) పోటీలో నిలిచే అవకాశం ఉంది. ఈ రెండు కుటుంబాల మధ్య తరతరాలుగా  ఆధిపత్య పోరు కొనసాగుతుండగా..మరోసారి వారసులు పోటీలో ఉండటం ఆసక్తి రేకెత్తిస్తోంది.
గంగుల వర్సెస్ భూమా
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ(Allagadda) అంటేనే ఒకపుడు బాంబుల గడ్డ గా పేరు . తరతరాలుగా ఇక్కడ గంగుల కుటుంబం, భూమా కుటుంబాలు ఆధిపత్యం కోసం పోరాటాలు చేస్తున్నాయి. వీరి కుటుంబాల్లో ఎంతోమంది ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకే బలయ్యారు.ఒకరు ఒక పార్టీలో ఉంటే మరొకరు ప్రత్యర్థి పార్టీకి జంప్ అవుతారు. ఇక్కడి వీరి వర్గానికి పార్టీలతో పనిలేదు. తమ నేత ఏం చెబితే అదే వేదం. ఏ గుర్తుపై గుద్దమంటే కళ్లు మూసుకుని గుద్దేస్తారు. గంగుల ప్రభాకర్ రెడ్డి(Gangula Prbhakar Reddy), భూమానాగిరెడ్డి(Bhuma Nagi Reddy) మధ్య ఆధిపత్య పోరు నువ్వా నేనా అంటూ నడిచింది. భూమానాగిరెడ్డి తెలుగుదేశంపార్టీలో చేరి కర్నూలు జిల్లాను ఏలారు. జిల్లా అధ్యక్షుడిగా అన్నీ తానై నడిపారు. ఆయన భార్య శోభానాగిరెడ్డి సైతం రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. తెలుగుదేశంతో విభేదించి ప్రజారాజ్యం చేరిన భూమా దంపతులు...ఆ తర్వాత వైసీపీ గూటికి చేరారు. 2014 ఎన్నికల ముందు జరిగిన రోడ్డుప్రమాదంలో శోభానాగిరెడ్డి(Shobha Nagi Reddy) మృతిచెందడంతో  ఆతర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె వారసురాలుగా  పెద్ద కుమార్తె భూమా అఖిలప్రియ అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలుగుదేశం(Tdp) అధికారంలో చేపట్టడంతో సొంతగూటికి తెలుగుదేశంలోకి భూమా కుటుంబం అడుగుపెట్టి ఈసారి ఏకంగా అఖిలప్రియ(Akila Priya) మంత్రిపదవి దక్కించుకుంది. చిన్న వయసులోనే రాజకీయంగా ఎన్నో ఎదురు దెబ్బలు చూసిన అఖిలప్రియ...తండ్రి మరణించినా, గత ఎన్నికల్లో ఓటమిపాలైనా గుండె నిబ్బరంతో  కేడర్ ను కాపాడుకుంటూ వస్తున్నారు. ఎన్నికలు సమయం దగ్గరపడుతుండటంతో  ఇప్పుడు ఆళ్లగడ్డలో మళ్లీ వేడి రాజుకుంది.
మాటల బాంబులు
ఆళ్లగడ్డపై మరోసారి జెండా ఎగురవేసేందుకు గంగుల కుటుంబం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అధికారం అండతో అఖిలప్రియాపై సామ, దాన, దండోపాయాలను ప్రయోగిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి ఆమెపై పలుమార్లు కేసులు పెట్టి వైకాపా ప్రభుత్వం  వేధిస్తోంది. ఆమెకు ప్రత్యర్థుల నుంచే కాకుండా సొంత మనుషుల నుంచీ పోటీ ఎదుర్కొవాల్సి వస్తోంది. తండ్రికి అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డితో గొడవలు, అన్న కిషోర్ కుమార్ రెడ్డితో వైరం ఇబ్బంది కలిగించే అంశాలే. అయితే నారాలోకేశ్ చేప్టటిన యువగళం, అధినేత చంద్రబాబు నాయుడి  రా..కదలిరా సభలు విజయవంతం చేయడంతో  అటు అధిష్టానం దృష్టిలోనూ ఇటు కేడర్ దృష్టిలోనూ మంచిమార్కులే పడినట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో ఆళ్లగడ్డతోపాటు నంద్యాలోనూ  తమ కుటుంబ సభ్యులే పోటీలో ఉంటారని అఖిలప్రియ అంటున్నా...ప్రస్తుతానికి ఆళ్లగడ్డలో మాత్రం సీటు కన్ఫార్మ్ అయినట్లేనని తెలుస్తోంది. కానీ జనసేనతో పొత్తులో భాగంగా సీట్ల వ్యవహారం తేలాల్సి ఉంది. జనసేన తరపున ఇరిగెల రాంపుల్లారెడ్డి సీటు ఆశిస్తున్నారు. ఈ కుటుంబంతోనూ  భూమా కుటుంబానికి విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి వీరిద్దరూ కలిసి పని చేస్తారా అనేది ప్రశ్నార్థకమే. అటు గంగుల కుటుంబం సైతం ఈసారి గెలుపు తమదేనన్న  దీమాలో ఉంది. అఖిలప్రియ దూకుడు వ్యవహారం, వివాదస్పద నిర్ణయాలే తమను గెలిపిస్తాయని వారు అంటున్నారు.