Yatra 2 Director Mahi V Raghava: మామూలుగా పొలిటికల్ జోనర్‌లో తెరకెక్కే సినిమాలకు ఫ్యాన్ బజ్ చాలా తక్కువ ఉంటుంది. కానీ అందులో బయోపిక్‌లను మాత్రం ఇష్టపడి చూసే ప్రేక్షకులు ఉంటారు. అలాంటి జోనర్‌లో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే ‘యాత్ర 2’. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు మహి వీ రాఘవ. కానీ చాలామంది మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రభుత్వంపై ప్రజల్లో మంచి అభిప్రాయం తీసుకురావడం కోసం ఈ సినిమాను విడుదల చేశారని భావిస్తున్నారు. ఇదే సమయంలో మహి వీ రాఘవ విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరి అనుమానాలు బలపడేలా చేస్తోంది.


అదే ఉద్దేశ్యంతో..


‘యాత్ర’, ‘యాత్ర 2’లాంటి సినిమాలు కేవలం ప్రేక్షకులను మెప్పించడానికి మాత్రమే రావని, దాని వెనుక బలమైన రాజకీయ ఎజెండా ఉంటుందని చాలామంది ప్రజలు నమ్ముతున్నారు. ఎవరికీ తెలియకుండా ఇలాంటి సినిమాలను పొలిటికల్ పార్టీలు సపోర్ట్ చేస్తాయని భావిస్తున్నారు. అలాగే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యాత్ర 2’కు కూడా వైఎస్సార్సీపీ సపోర్ట్ ఉందని అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇదే సమయంలో ఒకప్పుడు జగన్ చేసిన పాదయాత్ర గురించి ప్రజలకు గుర్తుచేస్తే మరోసారి వారిలో పాజిటివ్ అభిప్రాయం ఏర్పడుతుందని దర్శకుడు భావించాడని విమర్శలు వినిపిస్తున్నాయి.


భారీ బడ్జెట్..


‘యాత్ర’ మూవీ ఏ అంచనాలు లేకుండా విడుదలయ్యి.. బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా ఆ సినిమా తెరకెక్కింది. అదే విధంగా వైఎస్ జగన్ కూడా పాదయాత్రను చేపట్టాడు. అందుకే జగన్ పాదయాత్రపై కూడా సినిమాను తెరకెక్కిస్తానని దర్శకుడు మహి వీ రాఘవ ఎప్పుడో ప్రకటించాడు. ‘యాత్ర’ కంటే ఎక్కువగా బడ్జెట్ పెట్టి మరీ ‘యాత్ర 2’ను తెరకెక్కించారు. ఫిబ్రవరీ 10న విడుదలయిన ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ.10 కోట్ల మార్క్‌ను టచ్ చేసింది. కానీ మొదటి భాగంతో పోలిస్తే ‘యాత్ర 2’కు అందులో సగం కలెక్షన్స్ కూడా రాలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దర్శకుడికి సాయంగా నిలబడాలని నిర్ణయించుకుందట.


విడుదలకు ముందే లేఖ..


‘యాత్ర 2’ విడుదలకు ముందే తనకు హార్సిలీ హిల్స్‌లో 2 ఎకరాలు ఇవ్వాలని, స్టూడియోను ఏర్పాటు చేసుకుంటానని ప్రభుత్వానికి లేఖ రాశాడట దర్శకుడు మహి వీ రాఘవ. దర్శకుడి కోరికను మన్నించిన ప్రభుత్వం.. తను అడిగిన రెండు ఎకరాలు కూడా అందజేసినట్టుగా టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ సినిమా తెరకెక్కించడం వల్ల దర్శకుడికి అన్ని విధాలుగా లాభం జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు విమర్శిస్తున్నారు. ఇక ఈ బయోపిక్స్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించగా.. వైఎస్ జగన్ పాత్రలో తమిళ హీరో జీవా కనిపించాడు. వైఎస్ జగన్‌లాగా మాట్లాడడం కోసం, ప్రవర్తించడం కోసం జీవా ఎంత కష్టపడ్డాడో చెప్తూ మూవీ టీమ్ మేకింగ్ వీడియోను కూడా విడుదల చేసింది.


Also Read: మురళీమోహన్ నా శత్రువు - రాజమౌళి షాకింగ్ కామెంట్స్!