Ooru Peru Bhairavakona: సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సూపర్ నేచురల్ ఫాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ ను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 16న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ సన్నాహాలు చేసారు. అయితే మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ సెన్సార్ సర్టిఫికెట్ ఆపాలంటూ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ, ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సెన్సార్ అధికారుల మీద ఫిర్యాదు చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కి లేఖ రాయడం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 


‘‘సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయడానికి ముందే 'ఊరు పేరు భైరవకోన' సినిమా టిక్కెట్లు బుక్ మై షోలో ఓపెన్ చేయడంపై నట్టి కుమార్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సెన్సార్ నిబంధనల ప్రకారం సర్టిఫికెట్ ఇవ్వకుండా సినిమా విడుదల తేదీని ప్రచారం చేయకూడదు. కానీ ఈ సినిమాను ఫిబ్రవరి 16న విడుదల చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు సెన్సార్ నిబంధనలకు విరుద్ధంగా బుక్ మై షోలో టిక్కెట్లు తెరిచారు అని కంప్లెయింట్ చేసారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై చర్యలు తీసుకోవాలి’’ అని ముంబైలోని సీబీఎఫ్‌సీ చైర్మన్ ను కోరారు.


‘‘ఊరు పేరు భైరవకోన.. సినిమాకి సంబంధించి నిర్మాతలు ఏ తేదీన సెన్సార్‌ కి దరఖాస్తు చేసుకున్నారు, వారికి అప్లై చేసిన ఆర్డర్ లిస్ట్‌లో చాలా సినిమాలు సెన్సార్ స్క్రీనింగ్ కోసం పెండింగ్‌లో ఉండగా ఈ సినిమాని ముందుగా ఎందుకు సెన్సార్ చేయాల్సి వచ్చింది? అని నట్టి కుమార్ తన లేఖలో ప్రశ్నించారు. ఒకవేళ దీనికి హైదరాబాద్ రీజినల్ సెన్సార్ బోర్డ్ వారు బాధ్యులని తేలితే విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు. ‘‘ఏ రకమైన సర్టిఫికేట్ జారీ చేయబడుతుందో తెలియకుండా నిబంధనలకు విరుద్ధంగా బుక్ మై షో టిక్కెట్లను ఎలా తెరవవచ్చు? పిల్లలు చూడకూడదని సర్టిఫికేట్ జారీ చేస్తే, టిక్కెట్లు ముందుగానే జారీ చేయబడినందున దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అందుకే వెంటనే సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ను ఆపేయాలని కోరుతున్నా’’ అని పేర్కొన్నారు. 


‘‘తాజాగా 'యాత్ర-2' సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ కూడా రాకముందే రిలీజ్ డేట్ గురించి విపరీతంగా ప్రచారం జరిగిందని, సర్టిఫికేట్ జారీ చేయడానికి ముందు బుక్ మై షోలో బుకింగ్స్ ఓపెన్ చేసారని నట్టి కుమార్ ఆరోపించారు. వరుస సమస్యలు వస్తున్నా, సెన్సార్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అలాగే ఇటీవల విడుదలైన తెలుగు భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి పెద్ద నిర్మాతలు సెన్సార్ కు అప్లై చేసిన వెంటనే సెన్సార్ సర్టిఫికెట్లు పొందుతున్నారు. చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమాల సెన్సార్ కోసం దరఖాస్తు చేసుకుని రోజుల తరబడి వేచి చూస్తున్నారు. నిర్మాతగా ఎన్నో చిన్న, మధ్యతరహా బడ్జెట్ సినిమాలు చేశాను, ఈ పరిణామాలు చాలా బాధగా ఉన్నాయి’’ అని నట్టి కుమార్ రాసుకొచ్చారు. 


‘‘ప్రస్తుతం హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డు అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలు విమర్శనాత్మకంగా మారాయి. గతంలో సెన్సార్ ఆఫీసర్లుగా పనిచేసిన కైలాష్ ప్రసాద్, రత్నమాల, శ్యాంప్రసాద్ తదితరులు స్ట్రిక్ట్ ఆఫీసర్లుగా, నిజాయితీపరులుగా సెన్సార్ బోర్డ్ హైదరాబాద్ రీజనల్ ఆఫీసర్లుగా పేరు తెచ్చుకున్నారు. కచ్చితమైన నిబంధనలు పాటిస్తూ పెద్ద నిర్మాతలపై కూడా వారి హయాంలో కేసులు పెట్టిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడున్న హైదరాబాద్ రీజనల్ సెన్సార్ బోర్డ్ విధానాలు, తీరు విమర్శలకు తావిస్తోంది. ఈ క్రమంలో సినిమాలకు ఆర్డర్ లో అలాగే నిబంధనలకు వ్యతిరేకంగా సెన్సార్ జరగకపోవడంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. సెన్సార్ ఏజెంట్ సురేష్, సెన్సార్ బోర్డ్ ఉద్యోగి కరుణాకర్‌లను విచారించి వారి ఫోన్ నంబర్లు, గూగుల్ పే, బ్యాంకు అకౌంట్ నంబర్లను పరిశీలిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. నేను పైన పేర్కొన్న అన్ని ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను’’ అని నట్టి కుమార్ పేర్కొన్నారు. 


'ఊరు పేరు భైరవకోన' సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ఆపాలంటూ, హైదరాబాద్ సెన్సార్ అధికారుల మీద ఫిబ్రవరి 10వ తేదీన నట్టి కుమార్ కంప్లైంట్ చేసారు. దీనిపై ఇంతవరకూ సంబంధిత ఎవరూ స్పందించలేదు. మరో 4 రోజుల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ వివాదంపై ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.


Also Read: CBN లక్కీ నెంబర్ 23, 'వ్యూహం' విడుదల తేదీ 23: రామ్ గోపాల్ వర్మ వైరల్ ట్వీట్