Love Story Of Kama Deva and Rati:  ప్రేమకు సంకేతంగా రతీ మన్మథుల పేర్లు చెబుతారు. మన్మథునిని కామదేవుడు, కాముడు, మదనుడు, రతికాంతుడు అని పిలుస్తారు. ఆయన అర్థాంగి రతీదేవి. ప్రేమికులకు, ప్రేమకు సరైన నిర్వచనం చెప్పే ఈ జంటని తలుచుకుంటే ప్రేమ సఫలం అవుతుందంటారు. వీరి  ప్రేమ-పెళ్లి గురించి 'కామవివాహం' అనే పేరుతో శివపురాణం రుద్రసింహతలో ఉంది. 


ఎవరీ రతీ మన్మధులు!


బ్రహ్మ మనసు నుంచి మన్మథుడు జన్మించాడని..రతీదేవిని దక్ష ప్రజాపతి కుమార్తె అని పురాణాల్లో ఉంది. తనతో సహా అందర్నీ మోహింపజేయగల శక్తి బ్రహ్మదేవుడు మన్మథుడికి ప్రసాదించాడు. ఆ శక్తిని ఓసారి పరీక్షించుకోవాలని భావించిన మన్మథుడు...అక్కడే ఉన్న బ్రహ్మ మానసపుత్రిక అయిన సంధ్య, మరీచి, దక్షుడు లాంటి వారితో సహా బ్రహ్మదేవుడి మీద కూడా పూలబాణాలను ప్రయోగించాడు. ఎంతో కఠినమైన ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన వారంతా కూడా తమకు కామ వికారం కలగడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అంతలో అక్కడ శివుడు ప్రత్యక్షమై అందుకు కారణం మన్మథుడని తెలుసుకుని ఆగ్రహిస్తాడు. పరమేశ్వరుడి కోపాన్ని తట్టుకోలేక మన్మథుడు పక్కకు తొలగడంతో వారంతా సాధారణ స్థితికి వస్తారు. తనను సైతం మనోవికారానికి గురిచేసిన మన్మథుడు..శివుడి ఆగ్రహానికి అంతమైపోతాడని శపిస్తాడు బ్రహ్మదేవుడు. శివుడు వెళ్లిపోయిన తర్వాత బ్రహ్మ ముందు మోకరిల్లిన మన్మథుడు..శాపాన్ని ఉపసంహరించుకోమని  అర్థిస్తాడు . అప్పటికి శాంతించిన బ్రహ్మ...అంతా దైవ ప్రేరణే అని..దీనివల్ల కూడా నీకు మంచి జరుగుతుందని అభయం ఇస్తాడు. 


Also Read: రాక్షసిని దేవతగా మార్చిన అద్భుతమైన ప్రేమకథ!


మన్మథ బాణాలను మించినవి రతీ చూపులు!


దక్ష ప్రజాపతి మన్మథుడి దగ్గరకు వచ్చి తన స్వేదం నుంచి పుట్టిన తన కుమార్తె రతీదేవిని పెళ్లిచేసుకోవాలని కోరతాడు. రతీ దేవిని చూసిన ఆ క్షణంలో మన్మథుడి బాణాలు మన్మథుడినే కొట్టాయి. దీంతో సమ్మోహనం చెందిన మన్మథుడు తన బాణాల కన్నా రతీదేవి చూపులే వేగవంతంగా ఉన్నాయని ఆశ్చర్యపోతాడు. రతీదేవితో ఆనందంగా ఉన్న మన్మథుడు..బ్రహ్మదేవుడు ఇచ్చిన శాపాన్ని మర్చిపోయాడు. 


శివుడి ఆగ్రహానికి మసైపోయిన మన్మథుడు


తారకాసురుడనే రాక్షసుడు తనను సంహారం కేవలం శివ-పార్వతుల సంతానం వల్ల మాత్రమే సాధ్యం అని వరం పొందుతాడు. అప్పటికే సతీదేవి వియోగంలో ఉన్న పరమేశ్వరుడు పార్వతి ప్రేమను పట్టించుకునే స్థితిలో ఉండడు.  అలాంటి సమయంలో శివుడి మనసుని మళ్లింపజేయాలంటే మన్మథుడే సరైనవాడని భావించిన బ్రహ్మాదిదేవతలు మన్మథుడిని ప్రయోగిస్తారు. తపోనిష్ఠలో ఉన్న పరమేశ్వరుడి మనసు మార్చటానికి వెళ్లిన మన్మథుడు...ఆ ప్రయత్నంలో భాగంగా శివుడి ఆగ్రహానికి మాడి మసైపోతాడు. 


Also Read: ఫిబ్రవరి 14 వసంతపంచమి - శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి!


రతీదేవికోసం మన్మథుడి మరో జన్మ


శివుడు కోపాగ్నిలో దగ్ధమైన మన్మథుడు ఆ తర్వాత ఏమయ్యాడో భాగవతంలో వ్యాసుడు చెప్పిన కథ ఇది. శివుడి ఆగ్రహానికి మాడి మసైపోయిన మన్మథుడిని చూసి రతీ దేవి విలపిస్తుండగా దేవతలంతా ఆమెను ఓదార్చి.. మన్మథుడు తిరిగి ప్రద్యుమ్నుడు అనే పేరుతో జన్మిస్తాడని చెబుతారు. అలా శ్రీ కృష్ణుడు- రుక్మిణీదేవికి జన్మించినవాడే ప్రద్యుమ్నుడు. ఆ బాలుడిని ఎత్తుకెళ్లిపోతాడు శంబరాసుడు అనే రాక్షసుడు. ఆ రాక్షసుడి బారినుంచి బాలుడిని రక్షించమన్న నారదుడి మాటమేరకు శంబరాసుడి ఇంట్లో దాసిగా చేరుతుంది రతీదేవి. కొన్ని రోజుల తర్వాత ఆ బాలుడిని తీసుకెళ్లి సముద్రంలో పడేస్తాడు శంబరాసురుడు...ఓ చేప మింగేస్తుంది. ఆ చేప జాలరివలకు చిక్కుతుంది...తిరిగి శంబరాసురిడి వంటగదికి చేరుతుంది ఆ చేప. దాన్ని వండుదామని కోసిన రతీదేవికి బాలుడు కనిపిస్తాడు. అప్పటి నుంచీ జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన రతీదేవి..ఆ బాలుడికి యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత గతాన్ని, ప్రస్తుత జన్మలో జరిగినది వివరిస్తుంది. శంబరాసురుడి సంహారం అనంతరం ప్రద్యుమ్నుడు రతీదేవితో కలసి ద్వారక నగరానికి వెళతాడు. శ్రీకృష్ణుడి లా ఉన్న ప్రద్యుమ్నుడిని చూసి అందరూ కృష్ణుడేమోనని అనుకుంటారు.  రుక్మిణీదేవి కూడా పురిట్లోనే తనకు దూరమైన తనయుడు ఉండి ఉంటే ఇలాగే ఉండేవాడేమో అనుకుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన నారదుడు అసలు విషయం చెబుతాడు. 


Also Read: ఫిబ్రవరి 14 న మీ పిల్లలతో ఈ శ్లోకాలు చదివించండి!


ఆలయ గోడలపై రతీ మన్మధుల చిత్రాలు


మన్మథునికి ప్రత్యేకించి ఆలయాలేవీ లేవుకానీ...భార్య రతీదేవితో కలిసి మన్మథుడు చేసే ప్రేమప్రయాణం ఆలయాల గోడలపై చిత్రాలుగా కనిపిస్తుంది.  మన్మథుని పేరుతో ఎన్నో పర్వదినాల సందర్భంగా వినిపిస్తుంది. ఫాల్గుణ కృష్ణ తదియ రోజు కామమహోత్సవం అనీ, చైత్ర శుద్ధ త్రయోదశి మదన త్రయోదశి అనీ మన్మథుని కొలుచుకునేందుకు కేటాయించారు.  ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున వచ్చే హోళీ (కాముని పున్నిమ) రోజునే మన్మథుని శివుడు దహించివేశాడంటారు. అందుకు సూచనగా కొన్ని ప్రాంతాలలో మంటలు వేయడం కనిపిస్తుంది. ఇక మాఘమాసంలో వచ్చే వసంతపంచమని కామదేవ పంచమిగా జరుపుకుంటారు.  


Also Read: ఫిబ్రవరి 14న మీ రాశిప్రకారం చేయాల్సిన పరిహారాలివే!


మన్మథుని ప్రసన్నం చేసుకునేందుకు కామగాయత్రి పేరుతో మంత్రం కూడా ఉంది. ఈ మంత్రాని పఠిస్తే జీవితంలో మంచి తోడు దొరకడంతో పాటూ బంధం కలకాలం నిలిచి ఉంటుందని చెబుతారు. 
ఓం కామ దేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి
తన్నో అనంగ ప్రచోదయాత్!