Rajya Sabha Election: రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అధికార వైసీపీకి ఉన్న బలాన్ని బట్టి ఈ మూడు స్థానాలు ఆ పార్టీకే దక్కుతాయి. అందుకు అనుగుణంగానే ముగ్గురు అభ్యర్థులను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. వీరిలో ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు చూస్తున్న టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, రఘునాథరెడ్డి అభ్యర్థిత్వాలను వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఒక్కో ఎంపీ స్థానాన్ని దక్కించుకోవాలంటే 44 మంది ఎమ్మెల్యేల మద్ధతు అవసరం. వైసీపీకి గడిచిన ఎన్నికల్లో వచ్చిన 151 స్థానాలను బట్టి ఈ మూడు స్థానాలను దక్కించుకునేందుకు అనుగుణమైన మెజార్టీని సులభంగానే సాధిస్తుంది. కానీ, ఎమ్మెల్సీ స్థానానికి గతంలో జరిగిన ఎన్నిక సమయంలో కొందరు ఎమ్మెల్యేలు అధికార వైసీపీకి ఝలక్‌ ఇచ్చారు. నలుగురు పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడంతో తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన అభ్యర్థి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఇది పార్టీకి ఊహించని పరిణామం కావడంతో ముఖ్య నాయకులు షాక్‌ తిన్నారు. అటువంటి పరిస్థితి మరోసారి ఎదురవుతుందా..? అన్న ఆందోళన పార్టీ నాయకుల్లో ఉంది. 


రెబల్స్‌గా మారే ప్రమాదం


వచ్చే ఎన్నికలకు వైసీపీ గత కొన్నాళ్ల నుంచి వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే అనేక నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను ప్రకటించారు. సిటింగ్‌ ఎమ్మెల్యేలను మార్చేశారు. కొందరిని వేర్వేరు చోట్లకు స్థాన చలనం కలిగించారు. కొందరికి ఎంపీ స్థానాలను ఖరారు చేశారు. ఈ పరిణామాలన్నీ వైసీపీ అధిష్టానాన్ని ఇబ్బందులకు గురి చేసే ప్రమాదముందని చెబుతున్నారు. ఆరు విడతల్లో సుమారు 60కుపైగా స్థానాలకు వైసీపీ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. వీరిలో చాలా మందికి టికెట్లు లేవని చెప్పేసింది. వారంతా ఇప్పుడు పార్టీకి లైన్‌కు అనుగుణంగా ఉండి రాజ్యసభ అభ్యర్థులకు ఓట్లేస్తారా..? అన్నది ఇప్పుడు సస్పెన్ష్‌గా మారింది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మరీ వైసీపీ అధినాయకత్వంపైనా, సీఎం జగన్‌పైనా నేరుగా విమర్శలు సంధిస్తున్నారు. వారంతా పార్టీ అభ్యర్థులకు ఓట్లేసే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. ఇప్పటికే కొందరు టీడీపీ నేతలతో టచ్‌లోకి కూడా వెళ్లారు. ఇవన్నీ చూస్తే వైసీపీ ఇబ్బందికర పరిస్థితిని రాజ్యసభ ఎన్నికల్లో ఎదుర్కొంటుందా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, మూడు స్థానాలు గెల్చుకునేందుకు వైసీపీకి 132 మంది ఎమ్మెల్యేలు బలం ఉంటే సరిపోతుంది. వైసీపీకి 151 మంది ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేసిన రెబల్స్‌, తాజాగా మరో 20 మంది వరకు రెబల్స్‌ ఉంటారని అంచనా వేసుకున్నా.. వైసీపీకి పెద్దగా నష్టం ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే టీడీపీ, జనసేన నుంచి గెలిచి వైసీపీతో సన్నిహితంగా ఉంటున్న ఎమ్మెల్యేలు ఐదుగురు ఉన్నారు. వీరి బలంగా సులభంగానే రాజ్యసభ స్థానాలను గెలుస్తానమని పార్టీ నాయకులు చెబుతున్నారు. వ


అంతుచిక్కని టీడీపీ వ్యూహం


టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యూహం ఎవరిక అంతు చిక్కదు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా పార్టీ అభ్యర్థిని నిలబెట్టరనుకున్న తరుణంలో పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టడమే కాకుండా గెలిపించే చతురతను చంద్రబాబు ప్రదర్శించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే విధమైన వ్యూహాలను అనుసరించే అవకాశశముంది. ప్రస్తుతం టీడీపీకి రాజ్యసభలో ఉన్న ఏకైక సభ్యుడు కనకమేడల రవీంద్ర. ఆ స్థానం ఖాళీ అవుతోంది. కొత్తగా ఎవరూ టీడీపీ నుంచి ఎన్నిక కాకపోతే రాజ్యసభలో ఆ పార్టీ స్థానమే కోల్పోతుంది. దీన్ని కూడా చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశముంది. రాజ్యసభలో టీడీపీ నుంచి ప్రాతినిధ్యం ఉండాలంటే ఒక్క స్థానాన్ని అయినా కైవశం చేసుకోవాలి. అందుకు అనుగుణంగా టీడీపీ సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, టీడీపీ కూడా నామినేషన్‌ పత్రాలు తీసుకుంది. ఇదే ఇప్పుడు వైసీపీ నేతలను కలవరానికి గురి చేస్తోంది. ఈ నెల 15 వరకు నామినేషన్ల దాఖలుకు సమయం ఉంది. అయితే, టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. టీడీపీ కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. గెలిచే అవకాశం ఉందని టీడీపీ అధినాయకత్వం భావిస్తే మంగళ, బుధవారాల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. రాజ్యసభలో రాష్ట్ర కోటాలో 11 స్థానాలు ఉండగా, ప్రస్తుతం వైసీపీకి చెందిన ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. ఈ మూడు స్థానాలు గెలిస్తే మొత్తం స్థానాలు వైసీపీ ఖాతాలోకి చేరతాయి. చూడాలి మరి టీడీపీ ఈ ఎన్నికల్లో పోటీకి దిగితే ఎన్నిక అనివార్యం అవుతుంది. పోటీ చేసేందుకు ముందుకు రాకపోతే మాత్రం ఏకగ్రీవంగా వైసీపీ అభ్యర్థులు విజయం సాధించనున్నారు.