Lokesh sensational comments on ycp leaders : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ వైసీపీ కీలక నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy)పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శంఖారావం (Shankaravam) పేరుతో సదస్సులు నిర్వహిస్తున్న నారా లోకేష్‌ (Nara Lokesh) రెండో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలస నియోజకవర్గాల్లో శంఖారావాన్ని నిర్వహించిన లోకేష్‌ వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర వైసీపీ బాధ్యతలు చూస్తున్న వైవీ సుబ్బారెడ్డి, గతంలో ఈ బాధ్యతలు నిర్వర్తించిన విజయసాయిరెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విరుచుకుపడ్డారు. 


ఉత్తరాంధ్రను దోచుకున్న ఆ ఇద్దరూ! 
ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి పందికొక్కుల్లా దోచుకుంటున్నారంటూ లోకేష్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి సంపదను అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు విలువజేసే భూములను కబ్జా చేశారన్నారు. వీరి కబంధ హస్తాల నుంచి ఉత్తరాంధ్రను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలపై ఉందని లోకేష్‌ స్పష్టం చేశారు. జగన్‌ పని అయిపోయిందని, సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలే చెబుతున్నారన్నారు. ఐదేళ్లలో ఇసుకలో రూ.5400 కోట్లు జగన్‌ రెడ్డి దోచుకున్నాడని ఆరోపించారు. వివేకానందరెడ్డిని హత్యచేసి.. పిన్ని తాళి బొట్టును జగన్‌ రెడ్డి తెంపాడని ఆరోపించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో రేపో, మాపో ఏ వన్‌ ముద్దాయిగా జగన్‌ రెడ్డి మిగిలిపోతాడని లోకేష్‌ జోస్యం చెప్పారు. ప్రతి మద్యం సీసాపై పాతిక రూపాయలు చొప్పున జె ట్యాక్స్‌ ద్వారా నేరుగా జగన్‌రెడ్డికి వెళుతోందని, ఇప్పటి వరకు రూ.45 వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని మద్యంపై సంపాదించాడన్నారు. 


ఇంటి పేరులో ధర్మం.. చేసే పనులన్నీ అధర్మాలే 
మంత్రి ధర్మాన ప్రసాదరావుపై సైతం నారా లోకేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరులోనే ధర్మం ఉందని, ఆయన చేసే పనులన్నీ అధర్మాలేనని స్పష్టం చేశారు. ఇక్కడి నేతకు బుద్ధి చెప్పాల్సిన అవసరముందని స్పష్టం చేవారు. స్పీకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలస నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉందన్నారు. స్పీకర్‌ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో అభివృద్ధితో పోటీ పడేలా ఉండాలని, కానీ, ఇక్కడ ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. కొడుకు పేరుతో మైన్లను అడ్డగోలుగా రాయించుకుంటున్నారని ఆరోపించారు. ఇసుకలో రూ.300 కోట్లు రూపాయలు కొట్టేశాడంటూ స్పీకర్‌పై ఆరోపణలు చేశారు. డమ్మా బుస్సుల సీతారాం ఐదేళ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మరో మంత్రి సీదిరి అప్పలరాజుపైనా లోకేష్‌ విమర్శలు గుప్పించారు. అవినీతికి కేరాఫ్‌గా మారిపోయాడని, స్పీకర్‌, సీదిరి అప్పలరాజు అవినీతిలో పోటీ పడుతున్నారన్నారు. శాసనసభలో లేకుండా పోవడానికి ప్రధాన కారణం స్పీకర్‌ తమ్మినేని సీతారామేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ నేతలందరికీ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.


రానున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో శ్రీకాకుళం ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. మూడు నెలల్లో తాడేపల్లి ప్యాలెస్‌ కూలడం ఖాయమని, పార్టీకి అండగా ఉన్న పసుపు సైనికులకు లోకేష్‌ దన్యవాదాలు తెలిపారు. ఎన్నికలు ముందు దొంగ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం వైసీపీ చేస్తోందని, అటువంటి వారికి అండగా ఉంటామన్నారు. ఎలక్షనియరింగ్‌ చేయకుండా చేసే ప్రయత్నాలను వైసీపీ చేస్తోందని, ఈ తరహా కేసులపై న్యాయ పోరాటం చేస్తామని, వారి వివరాలను ఎంపీ రామ్మోహన్‌ నాయుడకు అందించాలని సూచించారు.