AP Elections 2024: విజయవాడ: వైసీపీ అవినీతి, అసమర్ధ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు బీజేపీ ప్రజలతో కలసి ప్రజాపోరు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) తెలిపారు. రాష్టంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 21 నుంచి 29  వరకు 9 రోజుల పాటు ప్రజాపోరు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య నాయకుల సమావేశం ప్రజాపోరు కార్యక్రమం కన్వీనరర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి (Vishnuvardhan Reddy) అధ్యక్షతన రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగింది. 


ముఖ్యఅతిధిగా హాజరైన పురందేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో దుర్మార్గమైన నియంతృత్వ పాలన సాగుతోందని విమర్శించారు. కొండలు, గుట్టలు వంటి ప్రకృతి వనరులను యధేచ్ఛగా దోచుకుంటూ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. మద్యం, ఇసుక సరఫరాల్లో వైసీపీనే కేంద్రీకృత అవినీతికి పాల్పడుతుందని ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. ఎవరైనా వైసీపీ సర్కార్ అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారని, ఎన్నికల్లో గెలిచేందుకు కూడా నకిలీ ఓటరు ఐడీ కార్డులు సృష్టించడం ఏపీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. 


తిరుపతి ఉప ఎన్నికల్లో నకిలీ ఐడీలు సృష్టించేందుకు సహకరించిన ఉన్నతాధికారులు ఇప్పుడు జైల్లో ఉన్నారని పురందేశ్వరి గుర్తుచేశారు. పన్నుల భారాలు మోపి, ధరలు అదుపు చేయలేక ప్రజలను ఆర్ధిక సంక్షోభంలో నెట్టివేసిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు అవకాశం వచ్చిందన్నారు. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని.. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. అందుకోసమే ‘‘ప్రజాపోరు’’ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఒకవైపు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతిని ప్రజలకు వివరించడం ద్వారా వైసీపీను ఓడించడం.... మరోవైపు ప్రధాని మోదీ సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రానికి అందించిన సహకారం వివరించి ప్రజల మద్దతు కూడగట్టాలన్నారు. ఏపీలో వైసీపీకి బుద్ధి చెప్పడంతో పాటు.. కేంద్రంలో మూడోసారి కూడా బీజేపీనే గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంటే డబులింజన్‌ సర్కార్‌ సౌలభ్యంతో ఏపీ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. 


వైసీపీ ఓటమి ఖాయం: విష్ణువర్ధన్‌రెడ్డి
ప్రజాపోరుతో వైసీపీ ఓటమి ఖాయమైపోయిందని ప్రజాపోరు కన్వీనరు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం పట్ల కనిపించే వ్యతిరేకతకు గతేడాది 15 రోజుల పాటు జిల్లా స్ధాయిలో చేసిన ప్రజాపోరు కార్యక్రమం ప్రభావం ఒక ప్రధాన కారణమన్నారు. నాయకుల ప్రసంగాలు, కరపత్రాల పంపిణి, డిజిటల్‌ మాధ్యమాల ప్రసారం ద్వారా ప్రచారం చేస్తామన్నారు. అసెంబ్లీకి ఒకటి చొప్పున 175 ప్రచార రధాలను కూడా ఈ కార్యక్రమం కోసం సిద్దం చేస్తున్నామన్నారు. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో 50 మిని బహిరంగ సభలు నిర్వహించనున్నారు. పార్లమెంటు స్ధాయిలో ఒక భారీ బహిరంగసభ జరుగుతుందని, కేంద్రమంత్రులు,  జాతీయ, రాష్ట్ర స్ధాయి నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. 
ప్రజలపై వేసిన పన్నుల భారాలు, ప్రభుత్వ అవినీతి, వనరుల దోపిడి, అభివృద్ధి లేమిని ప్రశ్నించాలన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, అన్ని వర్గాలను మోసం చేయడం, మహిళలకు వేధింపులు వైసీపీ ప్రభుత్వంలో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు కృషి చేయాలని సూచించారు.