Palasa Constituency : శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. జిల్లాలో ఏర్పడిన నియోజకవర్గాల్లో పలాస ఏర్పాటై 15 ఏళ్లు మాత్రమే అవుతోంది. నియోజకవర్గాలు పునర్విభజన తరువాత 2009లో పలాన నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకు ఇక్కడ మూడు ఎన్నికలు జరగ్గా, ఒకసారి కాంగ్రెస్‌, మరోసారి టీడీపీ, ఇంకోసారి వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి ప్రాతినిధ్యంవహిస్తున్న సీదిరి అప్పలరాజు రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. మరికొద్దిరోజుల్లో జరగనున్న ఎన్నికలు పలాసకు నాలుగోవి కావడం గమనార్హం. నాలుగో ఎన్నికలకు పలాస నియోజకవర్గ ప్రజలు సిద్ధమవుతున్నారు. 


రెండు లక్షలకుపైగా ఓటర్లు


పలాస నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి. వీటిలో పలాస ఒకటి కాగా, మందస, వజ్రపుకొత్తూరు మిగిలిన రెండు మండలాలు. శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 2,21,184 మంది ఓటర్లు ఉండగా, 1,09,690 మంది పురుషులు, 1,11,468 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 


మూడుసార్లు ఎన్నికలు.. మూడు పార్టీలకు దక్కిన విజయం


పలాస నియోజకవర్గం ఏర్పాటైన తరువాత ఇప్పటి వరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో నియోజకవర్గాలు పునర్విభజన తరువాత పలాస ఏర్పాటైంది. నియోజకవర్గం ఏర్పాటైన తరువాత 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జుత్తు జగన్నాయకులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సమీప ప్రత్యర్థి గౌతు శివాజీపై జగన్నాయకులు 6,814 ఓట్ల తేడాతో విజయం సాధించారు.


2014లో జరిగిన టీడీపీ నుంచి పోటీ చేసిన గౌతు శివాజీ విజయం సాధించారు. వైసీపీ నుంచి పోటీ చేసిన సమీప ప్రత్యర్థి వి బాబూరావుపై 17,525 ఓట్లతో తేడాతో గెలుపొందారు. మూడోసారి 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన సీదిరి అప్పలరాజు ఇక్కడి నుంచి విజయాన్ని దక్కించుకున్నారు. సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన గౌతు శిరీషపై 16,247 ఓట్ల తేడాతో సీదిరి అప్పలరాజు విజయాన్ని దక్కించుకున్నారు. వైసీపీ ప్రభుత్వం రెండోసారి ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా ఈయన బాధ్యతలు చేపట్టారు.


నియోజకవర్గం ఏర్పాటైన తరువాత ఇక్కడి నుంచి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న తొలి వ్యక్తిగా అప్పలరాజు నిలిచారు. పోటీ చేసి గెలిచిన తొలిసారే మంత్రి వర్గంలో ఈయన స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం. దేశ వ్యాప్తంగా చర్చకు కారణమైన ఉద్ధానం సమస్య ఈ ప్రాంతంలోనే అధికంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉద్ధానం కిడ్నీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, ఉద్ధానం కిడ్నీ ఆస్పత్రిని పలాసలోనే ఏర్పాటు చేసింది.


Also Read:టీడీపీ కంచుకోట ఇచ్ఛాపురం, ఎనిమిదిసార్లు సైకిల్ జయకేతనం - నెక్ట్స్ ఏంటి?


Also Read:  సింగనమల టీడీపీలో ఏం జరుగుతోంది? బండారు శ్రావణిపై వ్యతిరేకత ఎందుకు!