Tdp Wins Ichchapuram Constituency Eight Times : శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. ఈ జిల్లాలో చిట్ట చివర ఉన్న ఈ నియోజకవర్గానికి దగ్గరగా ఒరిస్సా రాష్ట్రం ఉంటుంది. ఈ నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు ఒరిస్సాతో సరిహద్దులు ఉన్నాయి. అటువంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన తరువాత నుంచి అండగా ఉంటోంది. 1952లో రాష్ట్రంలో తొలి ఎన్నిక జరిగింది. ఈ నియోజకవర్గం ఏర్పాటైన తరువాత నుంచి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా, అత్యధికసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఇక్కడి నుంచి విజయం సాధించారు. 


ఎనిమిది సార్లు ఎగిరిన టీడీపీ జెండా 
1952లో ఈ నియోజకవర్గంలో తొలిసారి ఎన్నిక జరిగింది. తొలి ఎన్నికల్లో అప్పటి కేఎల్పీ పార్టీకి చెందిన నీలాద్రిరావు రెడ్డి వవిజయం సాధించారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన హెచ్‌ పట్నాయక్‌పై 1650 ఓట్ల తేడాతో విజయాన్ని నమోదు చేశారు. 1955లో జరిగిన రెండో ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా మరోసారి హెచ్‌ పట్నాయక్‌ పోటీ చేయగా, కేఎల్పీ పార్టీకి చెందిన యు రంగబాబు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 7161 ఓట్ల తేడాతో రంగబాబు విజయం సాధించారు. 1962 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కీర్తి చంద్రదేవ్‌ సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన డి ఏకాంబరిపై 9166 ఓట్ల తేడాతో విజయం సాధించారు.


1967లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎల్‌ కరియరెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన కేసీ దేవ్‌పై 6433 ఓట్ల తేడాతో కరియరెడ్డి విజయం సాధించారు. 1978లో జరిగిన ఎన్నికల్లో జనతాపార్టీకి చెందిన బీవీ శర్మ కాంగ్రెస్‌ ఐ పార్టీ నుంచి పోటీ చేసిన కేబీ స్వామిపై 14,446 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత జరిగిన 1983లో జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎంవీ కృష్ణారావు కాంగ్రెస్‌ ఐ పార్టీ నుంచి పోటీ చేసిన ఎల్‌ఎస్‌ రావుపై 9106 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎంవీ కృష్ణారావు విజయాన్ని సాధించారు. కాంగ్రెస్‌ ఐ నుంచి పోటీ చేసిన ఎల్‌ఎస్‌ రావుపై 35,368 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో ఎంవీ కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ ఐ నుంచి పోటీ చేసిన బి త్రినాథరెడ్డిపై 16,499 ఓట్ల తేడాతో విజయాన్ని నమోదు చేశారు.


1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అచ్యుతరామయ్య సమీప ప్రత్యరిథ కాంగ్రెస్‌ ఐ నుంచి పోటీ చేసిన బి త్రినాథరెడ్డిపై 13,484 ఓట్లతో తేడాతో గెలిచారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎంవీ కృష్ణారావు సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ ఐ నుంచి పోటీ చేసిన నరేష్‌ కుమార్‌పై 4343 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ (ఐ) నుంచి పోటీ చేసిన నరేష్‌ కుమార్‌ (లల్లూ) సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన డి ఏకాంబరిపై 7745 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన పిరియా సాయిరాజ్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎన్‌ రామారావుపై 2275 ఓట్లతో విజయాన్ని దక్కించుకున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బెందాళం అశోక్‌ వైసీపీ నుంచి పోటీ చేసిన ఎన్‌ రామారావుపై 25,278 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇక్కడి నుంచి బెందాళం అశోక్‌ విజయాన్ని నమోదు చేశారు. సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి బరిలోకి దిగిన పిరియా సాయిరాజ్‌పై 7145 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 


ఎనిమిదిసార్లు టీడీపీ అభ్యర్థులు విజయం 
ఇచ్ఛాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలుస్తూ వస్తోంది. 15 సార్లు ఇప్పటి వరకు ఎన్నికలు జరిగితే.. ఎనిమిది సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు. తెలుగుదేశం ఏర్పాటైన తరువాత 2004లో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ నుంచి నరేష్‌ కుమార్‌(లల్లూ) విజయాన్ని దక్కించుకున్నారు. మిగిలిన ఏడుసర్లు టీడీపీ అభ్యర్థులే విజయం సాధించడం గమనార్హం. ఈ నియోజకవర్గం నుంచి అత్యధికంగా ఎంవీ కృష్ణారావు నాలుగుసార్లు విజయం సాధించారు. ఈ నాలుగుసార్లు టీడీపీ నుంచే ఆయన బరిలోకి దిగారు. ఆ తరువాత యు రంగబాబు రెండుసార్లు, బెందాళం అశోక్‌ రెండేసి సార్లు ఇక్కడ విజయాన్ని దక్కించుకున్నారు.


ప్రస్తుతం సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న బెందాళం అశోక్‌ వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే హ్యాట్రిక్‌ విజయాన్ని దక్కించుకున్నట్టుగా అవుతుంది. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన హెచ్‌ పట్నాయక్‌, కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన బి త్రినాథరెడ్డి, ఎల్‌ఎస్‌ రావు, కాంగ్రెస్‌, వైసీపీ నుంచి బరిలోకి దిగిన ఎన్‌ రామారావు రెండేసి సార్లు ఇక్కడ ఓటమిని చవి చూశారు. ఇకపోతే, ఇచ్చాపురంలో 2,67,953 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1,31,428 మంది, మహిళలు 1,36,508 మంది ఓటర్లు ఉన్నారు.