డుతా భక్తి అనేది ఒక జాతీయం. చేతనైనంత సాయం చెయ్యడాన్ని ఉడుతా భక్తి అని అనవచ్చు. కొన్ని సార్లు మనం పూర్తిస్థాయిలో సాయం చేసి సమస్య పరిష్కరించే పరిస్థితి ఉండదు. కానీ మనకు ఎంతో కొంత సాయం చెయ్యాలన్న తపన మాత్రం ఉంటుంది. ఉదాహరణకు ఎక్కడో భూకంపం వచ్చింది. విపరీతమై నష్టం జరిగింది. అక్కడ ప్రజలు విపరీతమైన కష్టంలో ఉన్నారు. ప్రభుత్వ సాయం అందుతున్నప్పటికీ అది చాలదు. వ్యక్తులుగా అందరూ చేతులు కలిపి కొంత మొత్తాన్ని జమ చేసో, లేక ఆహారధాన్యాలు పోగేసో అక్కడి వారికి పంపిస్తారు. ఇలాంటి సాయాన్ని ఉడుతాభక్తి సాయంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి చిన్నచిన్న సాయాలు కూడా కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద పాత్రే పోషిస్తాయి. ఇంత చిన్న వాళ్లం మనం చేసే సహాయం ఏపాటిది అనే ఆలోచన లేకుండా తోచిన సహాయం చెయ్యడాన్ని ఉడుతా భక్తి సాయంగా చెబుతారు. ఒక మంచి పని పెద్ద ఎత్తున్న ఎవరో తలపెడతారు మన వంతుగా మనం ఒక చెయ్యి వేయ్యడంగా చెప్పవచ్చు.


ఎక్కడిది ఈ ఉడుతా భక్తి?


ఈ జాతీయం నిజానికి రామాయణం నుంచి పుట్టింది. సీతకబురు తెలిసిన తర్వాత రాముడు లంకకు బయలు దేరుతాడు. సముద్రతీరం చేరిన తర్వాత వానర సైన్యం ముందుకు సాగేందుకు దారి లేక దారి ఇవ్వమని సముద్రుడి మీదకు బాణం ఎక్కు పెడతాడు. అప్పుడు సముద్రుడు రాముడి ముందుకు వచ్చి అది తన చేతిలోపని కాదని వారధి నిర్మించుకునేందుకు సహాయం చెయ్యగలనని వేడుకున్నాడు. అందుకే సముద్రం మీద వేసిన రాళ్లు మునిగిపోకుండా నీటిమీద తేలియాడాయట. వానర సేన సహాయంతో  సముద్రం మీద వారధి నిర్మించే బృహత్కార్యక్రమం మొదలు పెడతాడు శ్రీరాముడు. ఆ సమయంలో సముద్రపు ఒడ్డున నివసించే ఉడత రామకార్య సాధనలో తాను కూడా భాగం పంచుకోవాలని ఆశపడింది. అతి చిన్న ప్రాణి అంత పెద్ద పనిలో ఏ రకంగా సేవ అందించగలదు. పిడికెడంత తాను నీటిలో తడుస్తూ, ఇసుకలో పొర్లాడుతూ ఆ ఇసుకను రాళ్లమధ్య నింపే ప్రయత్నం చేసింది తన శక్తి కొలది. రాముడు భక్తిగా ఉడుత చేస్తున్న సాయం చూసి ముచ్చట పడి తన చేతుల్లోకి తీసుకుని లక్షణుడితో ‘‘ఇంత చిన్న ప్రాణి మంచి పనికి చేతనైన సాయం చెయ్యాలని తపన పడుతోంది. ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఈ లోకంలో ధర్మం నాలుగు పాదాలా నడుస్తుంది.’’ అంటూ ఉడుత శరీరం మీద చేతితో నిమిరితే ఏర్పడిన గీతలే ఇప్పటికీ ఉడుత ఒంటి మీద ఉన్నాయనేది ఒక కథ. ఈ కథ ఆధారంగానే ఉడుతా భక్తి అనే జాతీయం వాడుకలో ఇప్పటికీ ఉంది.


చేతనైన సాయం చెయ్యడాన్ని ఉడుతా భక్తిగా ఏదో చేశామండి అని అంటుంటారు, చేసిన పనిని ఎవరైనా మెచ్చుకున్నపుడు మొహమాటంగా. తనకు చేతనైన సాయం చెయ్యకుండా ఉండకూదని కూడా ఈ జాతీయం వెనుకున్న నీతి. చిన్న చిన్న సామెతలు, జాతీయాల్లో సైతం చాలా జీవన నైపుణ్యాలను, జీవిత సత్యాలను బోధిస్తూ వచ్చారు మనకు మన పెద్దలు. వాటి వెనుకున్న ధర్మసూక్ష్మాలను తెలుసుకుని జీవితాన్ని సుగమం చేసుకోవడమే మన కర్తవ్యం.


Also Read: గంగా పుష్కరాలకు కాశీ వెళుతున్నారా - టెంట్ సిటీలో రూమ్స్ ఇలా బుక్ చేసుకోండి