Ganga Pushkaralu 2023: ప్రతి నదికి పన్నెండేళ్లకు ఓసారి పుష్కరాలొస్తాయి. ఈ ఏడాది గంగానది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 22 నుంచి మే 3 వరకూ 12 రోజుల పాటూ గంగానదీతీర ప్రాంతాలన్నీ పుణ్యస్నానాలు చేసే భక్తులతో కళకళలాడిపోతుంటాయి. గంగోత్రి, గంగాసాగర్, హరిద్వార్, బదిరీనాథ్, కేదారనాథ్, వారణాసి, అలహాబాద్ క్షేత్రాల్లో ఘాట్లు సిద్ధమయ్యాయి. అయితే ఈసారి గంగాపుష్కరాల్లో ప్రత్యేకత ఏంటంటే వారణాసి వెళ్లే భక్తులకు కాటేజీలు అందుబాటులో లేకపోతే టెంట్ సిటీలో కూడా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. గంగానది తీరంలో 100 హెక్టార్లలో ఏర్పాటు చేసిన ఈ టెంట్ సిటీని కొన్ని నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
Also Read: గంగా పుష్కరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, పుష్కరాలు ఎలా ప్రారంభమయ్యాయి!
కాశీ విశ్వేశ్వరుడిని చూసేందుకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పర్వదినాలు, ప్రత్యేక రోజుల్లో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఎంత భారీగా తరలివచ్చినా భక్తులకు వసతికి ఇబ్బంది లేకుండా టెంట్లతో నివాస కుటీరాలను నిర్మించారు. దీంతో కాశీకి వెళ్లిన వారు కాటేజీ లభించలేదన్న చింత లేకుండా ఈ టెంట్ హౌస్ లో బస చేయవచ్చు.
- గంగా ఘాట్ సమీపంలో 100 హెక్టార్లలో నిర్మించిన టెంట్ సిటీలో ఒకే విడత 200 మందికి వసతి అందుబాటులో ఉంటుంది
- గంగా దర్శన్ విల్లాస్, ప్రీమియం టెంట్స్, సూపర్ డీలక్స్ టెంట్స్ అనే మూడు విభాగాలుగా ఉన్నాయి
- విల్లాలో 900 చదరపు అడుగులు, కాశీ సూట్స్‌లో 576 చదరపు అడుగులు, సూపర్ డీలక్స్‌లో 480 నుంచి 580 చదరపు అడుగులు, డీలక్స్‌లో 250 నుంచి 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో వసతి ఉంటుంది
- చిన్నపాటి ఫ్రిజ్, టీవీ, గీజర్, రూమ్ హీటర్ అన్ని వసతులు ఉన్నాయి
- ప్రీమియం, డీలక్స్ టెంట్ రూమ్ కావాలంటే 12 వేల నుంచి 14వేలు చెల్లించాలి
- స్విస్ కాటేజీల్లో ఆర్ట్ గ్యాలరీ, లైబ్రరీ, గేమింగ్ జోన్, రెస్టారెంట్లు, డైనింగ్ ఏరియా, కాన్ఫరెన్స్ సదుపాయాలు, స్పా, యోగా స్టూడియో లాంటి సౌకర్యాలు ఉన్నాయి
Alos Read: అక్షయ తృతీయ ఎప్పుడు (ఏప్రిల్ 22 or ఏప్రిల్ 23) జరుపుకోవాలి, ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి!
ప్యాకేజీలు కూడా బుక్ చేసుకోవచ్చు
https://www.tentcityvaranasi.com వెబ్‌సైట్‌లో టెంట్ సిటీ ప్యాకేజీలు బుక్ చేసుకోవచ్చు. గంగా దర్శన్ విల్లాలో ఒకరికి 20 వేలు, కాశీ సూట్స్‌లో ఒకరికి 12వేలు , ప్రీమియం ఏసీ టెంట్‌లో ఒకరికి 10 వేలు, డీలక్స్ టెంట్‌లో 7,500 ఛార్జీలు ఉంటాయి. ఇది 1 రాత్రి, 2 రోజుల ప్యాకేజీ ధర. ఇందులో బోటు ప్రయాణం, లంచ్, టీ, బోట్ టూర్, గంగా హారతి, డిన్నర్, కల్చరల్ ప్రోగ్రామ్స్, గంగా స్నానం లాంటివి కవర్ అవుతాయి. పర్యాటకులకు టెంట్ సిటీల్‌లో ఇంకా వేర్వేరు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
వారణాసి డెవలప్‌మెంట్ అథారిటీ పబ్లిక్-ప్రైవేట్ మోడ్ పద్ధతిలో ఈ టెంట్ సిటీ ప్రాజెక్ట్ చేపట్టింది. కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభించిన తర్వాత వారణాసికి వచ్చే భక్తులు, పర్యాటకుల సంఖ్య పెరిగింది. దీంతో కొత్తగా ఈ టెంట్ సిటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. పర్యాటకులు సమీపంలోని వివిధ ఘాట్‌ల నుంచి పడవ ద్వారా టెంట్ సిటీకి చేరుకోవచ్చు. ఈ టెంట్ సిటీ అక్టోబర్ నుంచి జూన్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య వర్షాకాలం కారణంగా వీటిని తీసేస్తారు.