Ganga Pushkaralu 2023: ప్రతి నదికి పన్నెండేళ్లకు ఓసారి వచ్చే పెద్ద పండుగ పుష్కరం. ఏడాదికో నదికి పుష్కరం జరుగుతుంది. 2023లో గంగానదికి పుష్కర శోభ వచ్చింది. ఏప్రిల్ 22 నుంచి మే 3 వరకూ..అంటే 12 రోజుల పాటూ గంగానదీతీర ప్రాంతాలన్నీ పుణ్యస్నానాలు చేసే భక్తులతో కళకళలాడిపోతుంటాయి. గంగా నది తీర ప్రాంతాలైన గంగోత్రి, గంగాసాగర్‌, హరిద్వార్‌, బదిరీనాథ్‌, కేదారనాథ్‌, వారణాసి, అలహాబాద్‌ క్షేత్రాల్లో ఘాట్లు సిద్ధమయ్యాయి. 


పుష్కరాలు ఎలా ప్రారంభమయ్యాయంటే!


తుందిలుడు అనే మహర్షి పరమేశ్వరుడిని ప్రస‌న్నం చేసుకునేందుకు ఘోర‌మైన త‌ప‌స్సు చేశాడు.  తపస్సుకి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై వ‌రం కోరుకోమ‌ంటే నేను నీలో శాశ్వతంగా ఉండిపోయేలా వ‌రాన్ని ప్రసాదించ‌మ‌ని వేడుకున్నాడు. సరే అన్న పరమేశ్వరుడు తనలో ఉన్న జ‌ల‌శ‌క్తికి ప్రతినిధిగా తుందిలుని నియ‌మించాడు. అలా ముల్లోకాలలో ఉన్న న‌దుల‌న్నింటికీ తుందిలుడు అధిప‌తి అయ్యాడు. ఈ ప్రపంచంలోని జీవ‌రాశులు అన్నింటికీ నీరే జీవనాధారం కాబట్టి తుందిలునికి, పుష్కరుడు... అంటే `పోషించేవాడు` అన్న పేరు వ‌చ్చింది.


Alos Read: అక్షయ తృతీయ ఎప్పుడు (ఏప్రిల్ 22 or ఏప్రిల్ 23) జరుపుకోవాలి, ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి!


మరో కథనం ప్రకారం


పుష్కరుడనే బ్రాహ్మణుడు పరమేశ్వరుడికోసం తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన భోళాశంకరుడు వరం కోరుకోమంటే..జీవులు చేసిన పాపాలతో నదులు అపవిత్రమైపోతున్నాయి..తన స్పర్శతో నదులు పనీతం అయ్యే వరం ప్రసాదించమని కోరుకున్నాడు పుష్కరుడు. అప్పుడు పరమేశ్వరుడు.. నువ్వు ఏనదిలోకి ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుంది. ఏడాదికి 12 రోజుల పాటూ ఒక్కో నదిలో ప్రవేశిస్తావు..ఆ 12 రోజులు ఆయా నదుల్లో స్నానమాచరించేవారు శివైక్యం పొందుతారని వరమిచ్చాడు. 


పుష్కరుడి వరంలో భాగం కావాలన్న బృహస్పతి


పుష్కరుడికి ఇచ్చినవరంలో తనకూ భాగం కావాలని దేవగురువు బృహస్పతి అడగడంతో.. బృహస్పతి  ఏడాదికోరాశిలో ప్రవేశిస్తాడు.. రాశి మారినప్పుడు ఆ రోజు నుంచి 12 రోజుల పాటూ పుష్కరుడు ఒక్కో నదిలో ఉంటాడని శివుడు, బ్రహ్మ చెప్పారు. అందుకే బృహస్పతి రాశిమారిన రోజు నుంచి 12 రోజుల పాటూ పుష్కరాలు జరుగుతాయి. బృహ‌స్పతి  ఒకో రాశిలో దాదాపు ఏడాదిపాటు ఉంటాడు. అందుక‌ని ఈ 12 రాశుల‌నూ బృహ‌స్పతి చుట్టబెట్టాలంటే దాదాపు 12 ఏళ్ల ప‌డుతుంది. అంటే ఒక న‌దికి పుష్కరాలు జ‌రిగితే, మ‌ళ్లీ అదే న‌దికి పుష్కరాలు జ‌రిగేందుకు 12 ఏళ్ల ఆగాల‌న్నమాట‌. అందుక‌నే 12 ఏళ్ల కాలాన్ని పుష్కర కాలం అని పిలుస్తారు. ఈ ఏడాది బృహస్పతి మేషరాశిలో ప్రవేశించడంతో గంగా పుష్కరాలు జరుగుతాయి. ఏప్రిల్ 22 నుంచి మే 3 వరకూ జరిగే పుష్కరసమయంలో బ్రహ్మాది దేవతలంతా పుష్కరునితో సహా నదీజలాల్లో ప్రవేశిస్తారు. ఆ నీటిలో స్నానంచేయడం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయనీ అక్కడ పిండప్రదానాలు చేస్తే పితృదేవతలు పుణ్యలోకాలు పొందుతారనీ పురాణాలు చెబుతున్నాయి


Also Read: భర్తలకు గుడ్ న్యూస్ - అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన అవసరం లేదు - ఎందుకంటే!


శివైక్యం చెందాలనే కోరిక


హిందువులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా గంగానదిలో స్నానమాచరించాలని భావిస్తారు. గంగ స్పర్శతో సకలపాపాలూ హరించుకుపోతాయన్న విశ్వాసం. జీవిత చరమాంకంలో ఆరోగ్యం సహకరించనప్పుడు కూడా కాశీ వెళ్లి గంగానదిలో తొమ్మది రోజుల పాటూ స్నానమాచరించి విశ్వనాథుడి సన్నిధిలో తొమ్మిది రోజులు ఉండాలని భావిస్తారు. అంత పరమపవిత్రమైన గంగానదికి పుష్కరాలంటే భక్తజనానికి ఇంతకన్నా పెద్ద పండుగ ఏముంది. గంగలో మునిగి శివైక్యం చెందాలని భావిస్తారు..


బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తే ఏ నదికి పుష్కరాలు
గంగానది - మేషరాశి
నర్మద - వృషభరాశి
సరస్వతి - మిథునరాశి
యమున - కర్కాటకరాశి
గోదావరి - సింహరాశి
కృష్ణ  - కన్యారాశి
కావేరి  - తులారాశి
భీమానది - వృశ్చికరాశి
తపతి/బ్రహ్మపుత్ర - ధనూరాశి
తుంగభద్ర - మకరరాశి
సింధు - కుంభరాశి
ప్రాణహిత - మీనరాశి